రాష్ట్రంలో కొనసాగుతున్న లిక్కర్ షాపుల వేలం

రాష్ట్రంలో కొనసాగుతున్న లిక్కర్ షాపుల వేలం

హైదరాబాద్: రాష్ట్రంలో మద్యం దుకాణాలకు భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 9వ తేదీ నుంచి 18 దాకా ఆబ్కారీ ఆఫీస్​లలో అప్లికేషన్లు తీసుకున్నారు. మొత్తంగా 67,849 అప్లికేషన్లు వచ్చాయి. గురువారం ఒక్కరోజే 37,160  దరఖాస్తులు వచ్చాయి. మొత్తం అప్లికేషన్ల ద్వారా రాష్ట్ర సర్కారుకు రూ.1,357 కోట్ల ఆదాయం సమకూరింది. పోయినసారి 48 వేల అప్లికేషన్లతో 975 కోట్ల ఇన్‌‌‌‌కం రాగా.. ఈసారి 67,849 దరఖాస్తులకు గాను రూ. 1357 కోట్ల ఆదాయం వచ్చింది.

సిటీ పరిధిలో..
హైదరాబాద్, సికింద్రాబాద్ ఎక్సైజ్ యూనిట్ పరిధిలో మొత్తం 179 వైన్స్ షాప్​లుండగా.. 3500కు పైగా అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అంబర్​పేటలోని మహా రాణా ప్రతాప్  ఫంక్షన్ హాల్​లో ఉదయం 11 గంటలకు లక్కీ డ్రా మొదలైంది. రంగారెడ్డి జిల్లా పరిధిలో సరూర్ నగర్, శంషాబాద్ ఎక్సైజ్ యూనిట్లకు సంబంధించి వైన్స్ షాప్​ల కేటాయింపు కోసం సరూర్ నగర్ ఇండోర్​ స్టేడియంలో డ్రా జరుగుతోంది. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 234 వైన్స్ షాప్ లుండగా.. 8,262 అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు చెప్పారు. సరూర్ నగర్ ఎక్సైజ్ యూనిట్​కు సంబందించి 134 వైన్స్ షాప్ లుండగా 4102 అప్లికేషన్లు, శంషాబాద్ ఎక్సైజ్ పరిధిలోని 100 షాప్​లకు 4137 అప్లికేషన్లు వచ్చాయి.

మేడ్చల్ జిల్లాలో..
మేడ్చల్  ఎక్సైజ్ యూనిట్ పరిధిలో మొత్తం 114 వైన్స్ షాప్ లుండగా.. 3069 అప్లికేషన్లు వచ్చినట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయభాస్కర్ తెలిపారు. బాలానగర్ ఎక్సైజ్ పీఎస్ పరిధిలోని 40 వైన్స్ షాప్​లకు 1302 అప్లికేషన్లు, కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ పరిధిలోని 44 షాప్​లకు 1667అప్లికేషన్లు, మేడ్చల్ ఎక్సైజ్ పరిధిలోని 640 అప్లికేషన్లు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లాకు సంబంధించి లక్కీ డ్రా కొంపల్లిలోని కేవీఆర్ ఫంక్షన్ హాల్​లో ఉంటుందన్నారు.

జగిత్యాల జిల్లాలో..
రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన ఆబ్కారి చట్టం ప్రకారం శనివారం జగిత్యాల జిల్లాలోని 71 మద్యం దుకాణాలకు జిల్లా కేంద్రంలోని ఏబీ కన్వెన్షన్ హాల్ నందు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా డ్రా తీయనున్నారు. జిల్లాలో ఉన్న మొత్తం 71 మద్యం దుకాణాలకు 1,463 దరఖాస్తులు వచ్చాయి. జిల్లా  కలెక్టర్ రవి చేతుల మీదుగా డ్రా తీసి లబ్దిదారులను ఎంపిక చేయనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 2,620 వైన్​ షాపులుండగా 131 ఎస్టీలకు, 262 ఎస్సీలకు, 393 గౌడ్స్‌‌‌‌కు కేటాయించారు. ఒక్కో షాపుకు సగటున 26 అప్లికేషన్లు వచ్చాయి. ఏపీ బార్డర్ ప్రాంతాలతో పాటు హైదరాబాద్‌‌‌‌లో ఉంటున్న ఏపీ వ్యాపారులే భారీ సంఖ్యలో దరఖాస్తులు సమర్పించారు. రంగారెడ్డిలో 8,224, ఖమ్మం జిల్లాలో 6,212 దరఖాస్తులు వచ్చాయి. ఇక్కడ అత్యధికంగా ఒక్కో షాపుకు సగటున 61 అప్లికేషన్లు వచ్చాయి. కొత్తగూడెం 4,271, నల్గొండ లో 4,079 స్వీకరించారు. ఆదిలాబాద్ జిల్లాలో అతి తక్కువగా 591 అప్లికేషన్లు మాత్రమే వచ్చాయి. ఇక్కడ సగటున ఒక్కో దుకాణానికి 15 మాత్రమే వచ్చాయి.