ఏపీలో కరోనా విజృంభణ.. ఇవాళ కూడా 21వేల కొత్త కేసులు

ఏపీలో కరోనా విజృంభణ.. ఇవాళ కూడా 21వేల కొత్త కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇవాళ బుధవారం కూడా 21 వేల 452 కొత్త కేసులు నమోదయ్యాయి. 89 మంది కరోనా నుంచి కోలుకోలేక కన్నుమూశారు.  గడచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 90 వేల 750 మందికి పరీక్షలు చేయగా 21 వేల 452 కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే గడచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో 19 వేల 95 మంది డిశ్చార్జ్ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. 
గడచిన 24గంటల్లో అత్యధికంగా విశాఖపట్టణం జిల్లాలో 11 మంది చనిపోగా.. తూర్పు గోదావరి,కృష్ణా, విజయనగరం జిల్లాల్లో 9 మంది చొప్పున, చిత్తూరు, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో 8 మంది చొప్పున, శ్రీకాకుళం జిల్లాలో ఏడుగురు, అనంతపురం జిల్లాలో ఆరుగురు, కర్నూలు జిల్లాలో ఐదుగురు, ప్రకాశం జిల్లాలో నలుగురు, పశ్చిమ గోదావరి జిల్లాలో ముగ్గురు, కడప జిల్లాలో ఇద్దరు చొప్పున చనిపోయారు. 
జిల్లాల వారీగా నమోదైన కేసులు
జిల్లాల వారీగా నమోదైన కేసులు పరిశీలిస్తే అనంతపురం జిల్లాలో 2185 మంది, చిత్తూరు జిల్లాలో 1908 మంది, తూర్పు గోదావరి జిల్లాలో 2927 మంది, గుంటూరు జిల్లాలో 1836 మంది, కడప జిల్లాలో 1746 మంది, కృష్ణా జిల్లాలో 997 మంది, కర్నూలు జిల్లాలో 1524 మంది, నెల్లూరు జిల్లాలో 1689 మంది, ప్రకాశం జిల్లాలో 1192 మంది, శ్రీకాకుళం జిల్లాలో 1285 మంది, విశాఖపట్టణం జిల్లాలో 2238 మంది, విజయనగరం జిల్లాలో 693 మందికి, పశ్చిమ గోదావరి జిల్లాలో 1232 మందికి తాజాగా కరోనా నిర్ధారణ అయింది. ఇవాళ్టి వరకు రాష్ట్రంలో జరిపిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య కోటి 76 లక్షల 5 వేల 687కు చేరింది.