కొనసాగుతున్న ఎమ్మెల్మీ ఎన్నికల పోలింగ్

 కొనసాగుతున్న ఎమ్మెల్మీ ఎన్నికల పోలింగ్

హైదరాబాద్: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో మొత్తం 5 లక్షల 5 వేల 565 మంది ఓటర్లున్నారు. వీరికోసం 731 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. ఇక్కడ కొత్తగా ఏర్పడిన జిల్లాల ప్రకారం మొత్తం 12 జిల్లాల్లో పోలింగ్ జరుగుతోంది. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 90 వేల 826 మంది ఓటర్లు ఉండగా.. ములుగు జిల్లాలో అతి తక్కువగా 10 వేల 323 మంది ఓటర్లున్నారు. వరంగల్-నల్గొండ-ఖమ్మం నియోజకవర్గంలో 71 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వరంగల్-నల్గొండ-ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 11 వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో  వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నారు. కేవలం మండల కేంద్రాల్లో మాత్రమే పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానంలో 93 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ స్థానంలో మొత్తం 5 లక్షల 31 వేల 268 మంది ఓటర్లు ఉండగా.. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో లక్షా 44 వేల 416 మంది ఓటర్లు ఉన్నారు. నారాయణపేట జిల్లాలో అతి తక్కువగా 13 వేల 899 మంది మాత్రమే ఉన్నారు. ఎన్నికలు సజావుగా జరగడానికి ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఒక ఫ్లైయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్ ను ఏర్పాటు చేశారు. బ్యాలెట్ పేపర్లో అభ్యర్థి పేరుతో పాటు ఫొటో మాత్రమే ఉంటుందని.. గుర్తులు ఉండవని అధికారులు చెప్పారు. ఓటింగ్ కు పోలింగ్ అధికారులు ఇచ్చిన పెన్ను మాత్రమే వాడాలని సూచించారు. ఓటు వేయదలచుకున్న వ్యక్తికి ఎదురుగా ఉన్న బాక్సులో ప్రాధాన్యత క్రమంలో నెంబర్ వేయాలన్నారు. బ్యాలెట్ పేపర్లో టిక్కులు పెట్టడం, సంతకాలు చేయడం, వేలిముద్ర వేయటం చేయకూడదని సూచించారు. ఇక ఓటర్ స్లిప్ తో పాటు ఓటర్ ఐడీ కార్డు తీసుకొని పోలింగ్ కేంద్రానికి రావాలన్నారు అధికారులు. లేదంటే ఆధార్ కార్డు.. ఎన్నికల సంఘం గుర్తించిన 9 కార్డుల్లో ఏదైనా ఒకటి తీసుకొస్తే ఓటు వేసే అవకాశం ఉంటుందని వివరించారు. బ్యాలెట్ పద్దతిలో జరిగే ఓటింగ్ కావడంతో ప్రత్యేకంగా జంబో బ్యాలెట్ బాక్సులను ఏర్పాటు చేశారు. అభ్యర్థులు ఎక్కువ మంది కావటంతో... బ్యాలెట్ పేపర్ కూడా న్యూస్ పేపర్ సైజ్ లో ఉంటుందని అధికారులు చెప్పారు.