టర్కీ, సిరియాలో తిండి, నీరు లేక తల్లడిల్లుతున్రు

టర్కీ, సిరియాలో తిండి, నీరు లేక తల్లడిల్లుతున్రు

టర్కీ, సిరియాలో భూకంప మృతుల సంఖ్య 21 వేలు దాటింది. ప్రకృతి విపత్తులో ఇప్పటి వరకు 21,051 మంది మరణించినట్లు టర్కీ ప్రభుత్వం వెల్లడించింది. టర్కీలో 17,674, సిరియాలొ 3377 మంది చనిపోయారు. టర్కీ, సిరియాలో దయనీయమైన పరిస్థితులు నెలకొన్నాయి. బాధితులుగా మిగిలినవారిని చలి చంపేస్తోంది. ఎముకలు కొరికచే చలి, మంచుతో బాధితులు అల్లాడుతున్నారు. కనీసం తినడానికి తిండి, తాగడానికి నీరు కూడా దొరకం లేదు. భూకంపం నుంచి బయటపడినా..చలితో చనిపోయేలా ఉన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

టర్కీ, సిరియాలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా అనేక మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. మరోవైపు భూకంపంలో ఏడునగరాల్లోని ప్రభుత్వాసుపత్రులు సహా 3వేల భవనాలు కూలిపోయాయి. 

భూకంపాల అనంతరం టర్కీ, సిరియాలకు సహాయం చేసేందుకు భారత్‌ ‘ఆపరేషన్‌ దోస్త్‌’ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్ కింద భారత్ ప్రత్యేకంగా రెండు విమానాల్లో రెస్క్యూ టీమ్‌లు, వైద్య బృందాలు, ఇతర సామాగ్రిని పంపింది. భారత సైన్యం హటేలో ఒక ఫీల్డ్ హాస్పిటల్‌ను కూడా ఏర్పాటు చేసింది, 

సోమవారం రాత్రి భూకంపం సంభవించినప్పటి నుంచి దాదాపు 1,117 సార్లు ప్రకంపనలు నమోదయ్యాయి. వేలసంఖ్యలో ప్రజలు తాత్కాలిక శిబిరాల్లో, స్టేడియాల్లో తలదాచుకుంటున్నారు. సహాయక చర్యల్లో 1,10,000 మందికి పైగా పాల్గొంటున్నారు. దాదాపు 5 వేల ట్రాక్టర్లు, బుల్డోజర్లు, క్రేన్లు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి.