
- బహిరంగ మార్కెట్లో రూ.25కు పైగా ధరలు
- రైతులకు నష్టం, వినియోగదారులకు భారం
- రేట్లు పెంచి లాభపడుతున్న మధ్యవర్తులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఉల్లి రైతుకు సరైన గిట్టుబాటు ధర దక్కడం లేదు. ఒకవైపు రైతులు మార్కెట్‌కు వచ్చి అమ్ముకుంటే కిలోకు కనిష్టంగా రూ.5 నుంచి గరిష్టంగా రూ.16 వరకు మాత్రమే పొందుతుండగా, మరోవైపు వినియోగదారులు రూ.25 నుంచి రూ.30 వరకు చెల్లించాల్సి వస్తోంది. మధ్యలో మధ్యవర్తులు మాత్రం భారీగా లాభాలు ఆర్జిస్తున్నారు. రాష్ట్రంలో ఉల్లి ఉత్పత్తి తక్కువ కావడంతో ఇతర రాష్ట్రాల దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోంది.
హైదరాబాద్‌లో మలక్‌పేటలోని ఉస్మాన్ గంజ్, సికింద్రాబాద్ మోండా మార్కెట్, బోయిన్‌పల్లి మార్కెట్‌తో పాటు పలు రైతుబజార్లకు భారీగా ఉల్లి వస్తోంది. వచ్చే నెలాఖరులోనే రాష్ట్రంలో వానాకాలం సాగైన పంట చేతికి రానుంది. అప్పటికి ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో ఏటా 5 లక్షల టన్నుల ఉల్లి వినియోగం జరుగుతోంది. కానీ, ఉత్పత్తిలో సగం కూడా మన రాష్ట్రంలో పండడంలేదు. చాలా వరకు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతోంది. ప్రధానంగా ఏపీలోని కర్నూలు, మహారాష్ట్ర నుంచి రోజూ భారీగా ఉల్లి లారీలు రాష్ట్రానికి వస్తున్నాయి.
ధరలు తగ్గడంతో ఫలితం లేకుండా పోయింది
మహారాష్ట్రలో ధరలు పడిపోవడంతో (లాసల్‌గావ్‌లో రూ.12.75/కిలో) తెలంగాణకు దిగుమతులు పెరిగాయి. ఇతర రాష్ట్రాల నుంచి ఈ నెల 1 నుంచి మార్కెట్ అరైవల్స్ పెరిగాయి. మలక్‌పేటలోని ఉస్మాన్ గంజ్ హోల్‌సేల్ మార్కెట్‌కు శుక్రవారం 18 వేల బస్తాల ఉల్లి మార్కెట్ కు రాగా మహారాష్ట్ర, కర్నాటక రకాలు క్వింటాల్‌కు రూ.1600 నుంచి రూ.1800 వరకు ధర పలికాయి. కిలో గరిష్టంగా రూ.20 వరకు పలికింది. అదే కర్నూలు నుంచి 5 లారీలు మార్కెట్‌కు రాగా క్వింటాల్ రూ.800 నుంచి రూ.1000 వరకు పలికింది. క్వాలిటీ తక్కువ ఉన్న రకాలు కిలో రూ.3 నుంచి రూ.5లే పలికాయి.
బోయిన్‌పల్లి మార్కెట్‌లో ఈ నెల 7న ధరలు కిలో రూ.5 నుంచి రూ.16 వరకు ఉన్నాయి. మహారాష్ట్ర, కర్నాటక నుంచి దిగుమతి అయ్యే ఉల్లిగడ్డలు అధిక ధరలు పలుకుతుండగా కర్నూలు రైతులకు తక్కువ పలుకుతోంది. కిలో రూ.8 నుంచిరూ.10లే పలుకుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నరు. కొన్నైతే కిలో రూ.3 నుంచి రూ.5కే అడుగుతున్నారని రైతులు వాపోతున్నారు. సగటున రూ.15 నుంచి రూ.20 వరకు ధర పలకాలని, అది కూడా దక్కడం లేదని చెబుతున్నారు. ఉత్పత్తి ఖర్చులు పెరిగినా, ధరలు తగ్గడంతో ఫలితం లేకుండా పోయిందని మలక్‌పేట్ మార్కెటుకు వచ్చిన కర్నూలు రైతులు వాపోతున్నరు.
లోకల్ ఉల్లి వస్తే మరింత తగ్గే అవకాశం..
రాష్ట్రం నుంచి ఉల్లిపంట దిగుమతి వచ్చే నెల నుంచి రానుండడంతో ధరలపై ప్రభావం చూపనుంది. వికారాబాద్ జిల్లా పరిధిలోని తాండూరు, మెదక్ జిల్లాలోని నారాయణఖేడ్, మహబూబ్‌నగర్‌లోని కొల్లాపూర్, జోగుళాంబ గద్వాలలోని అలంపూర్, నల్గొండ తదితర ప్రాతాల్లో 40 వేల ఎకరాల్లో ఉల్లి సాగవుతోంది. వచ్చే నెలాఖరులో లోకల్ ఉల్లిగడ్డలు మార్కెట్‌కు రావడం ప్రారంభం కానుంది. హైదరాబాద్ మహానగరానికి రోజుకు 15 వేల నుంచి 18 వేల బస్తాలు వస్తున్నాయి. అలాగే గుడిమల్కాపూర్ మార్కెట్, బోయిన్‌పల్లి మార్కెట్‌కూ పోటెత్తుతున్నాయి.
వినియోగదారులకు అధిక ధరలు
మరోవైపు వినియోగదారులు ఉల్లిగడ్డలను అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కూరగాయల మార్కెట్‌లో పెద్ద ఉల్లి రూ.30 కిలో, చిన్న ఉల్లి రూ.52 కిలోగా ఉంది. సగటు రిటైల్ ధర కిలో రూ.25గా ఉంది. ఇది గత ఏడాది కన్నా తక్కువే అయినా, రైతుల ధరతో పోలిస్తే రెట్టింపు కంటే ఎక్కువ. మధ్యవర్తులు రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి, వినియోగదారులకు అధిక ధరకు అమ్ముతున్నారు. దీంతో మధ్యవర్తులకే లాభాలు దక్కుతున్నాయి, మరోవైపు రైతులు, వినియోగదారులు మాత్రం నష్టపోతున్నారు.