అక్కడ వస్తువులను డబ్బుతో కాదు, ఉల్లిపాయలతో కొనొచ్చు

అక్కడ వస్తువులను డబ్బుతో కాదు, ఉల్లిపాయలతో కొనొచ్చు

ఫిలిప్పీన్స్ లో ఉల్లిపాయల రేట్లు ఆకాశాన్నంటాయి. దీంతో అక్కడి ఒక షాపు ఉల్లిపాయలను కరెన్సీగా తీసుకుంటోంది. ఉల్లిపాయలు ఇచ్చి ఎయిర్ ఫ్రెషనర్లు, ఫ్యాన్లు, షవర్ కేడీలు, సిరామిక్ కుండీలు, క్యాండిల్ హోల్డర్ల వంటి వస్తువులను కొనుక్కోవచ్చని ప్రకటించింది. దీంతో చాలా మంది ప్రజలు మనీలాలోని ఈ దుకాణానికి క్యూ కడుతున్నారు. మనీలాలోని క్యూజోన్ సిటీలోని జపాన్ హోమ్ సెంటర్ (జేహెచ్ సీ) బ్రాంచులో అన్ని వస్తువుల ధర 88 పెసోలు (దాదాపు రూ.135). అంటే 88 పెసోలు లేదా అంతకంటే తక్కువ ధర ఉన్న అన్ని వస్తువులను శనివారం ఉల్లిపాయతో కొనుగోలు చేయవచ్చు. 

ఒక్కో ఉల్లిపాయకు రెండు సిరామిక్ కుండీలు, క్యాండిల్ హోల్డర్ ఇస్తున్నారు. ఉల్లితో ఇక్కడ గరిష్టంగా మూడు వస్తువులను తీసుకువెళ్లవచ్చు. ఉల్లిపాయలతో చెల్లింపులను ఎంచుకునే వినియోగదారుల కోసం షాపులో ప్రత్యేక లైన్ ఉంది. ఫిలిప్పీన్స్ లో కిలో ఉల్లి ధర రూ.135కి చేరడంతో జనం ఇబ్బందిపడుతున్నారు. చికెన్, ఇతర ఆహార పదార్థాల కంటే ఉల్లి ఖరీదుగా మారింది. కొంతమంది కొత్త జంటలకు కానుకలుగా ఉల్లిపాయలు ఇస్తున్నారు.