ఉల్లి కిలో 70 రూపాయలు.. నెల రోజుల్లోనే డబుల్

ఉల్లి కిలో 70 రూపాయలు.. నెల రోజుల్లోనే డబుల్

ఉల్లి ధరలు మళ్ళీ పెరిగాయి... నెల కిందట రూ. 25 నుండి రూ.30వరకు ఉన్న కిలో ఉల్లి ఇప్పుడు ఏకంగా రూ.70కి పెరిగింది. రైతు బజార్లలో కిలో ఉల్లి రూ. 50 నుండి రూ. 60గా ఉంది. నెలరోజుల్లోనే రెట్టింపైన ఉల్లి ధరలు చూసి సామాన్యుడు ఉల్లిపాయలు కొనాలంటేనే ఆలోచించే పరిస్థితి తలెత్తింది. ఉల్లి ధరలు అమాంతం పెరిగిన క్రమంలో అమ్మకాలు కూడా పడిపోయినట్లు తెలుస్తోంది. పెరిగిన ధరల కారణంగా చాలామంది ఉల్లి కొనుగోలు కూడా తగ్గించారని అంటున్నారు.

ఉల్లి ధరలు పెరగటానికి కారణాలు

ఇటీవల తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు ఉల్లి పంట దెబ్బ తినటం.. సప్లై - డిమాండ్ మధ్య తేడా పెరగటమే ఉల్లి ధరలు పెరగటానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. భారీ వర్షాలకు పంట దెబ్బతినటం వల్ల హైదరాబాద్ లోని మలక్ పేట్, బోయిన్ పల్లి, మూసాపేట్, గుడి మల్కాపూర్ వంటి ప్రధాన మార్కెట్లలో ఉల్లి కొరత ఏర్పడింది.

ఉల్లి ధరలు పెరగటం హోటల్స్, రెస్టారెంట్స్ పై ప్రభావం చూపుతోంది. చాలా రెస్టారెంట్లలో కస్టమర్లకు ఆనియన్స్ ఇవ్వటం ఆపేశారు. " నో ఆనియన్స్.. ప్లీజ్ కో ఆపరేట్ " అన్న పోస్టర్లు చాలా రెస్టారెంట్లలో దర్శనమిస్తున్నాయి. అయితే.. రానున్న రోజుల్లో భారీ వర్షాలు  కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపిన క్రమంలో ఉల్లి ధరలు ఇంకెంత పెరుగుతాయోనని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.