దారి తప్పుతున్న యువత!.. బెట్టింగ్, మద్యానికి బానిసలై జీవితం నాశనం చేసుకుంటున్రు

దారి తప్పుతున్న యువత!.. బెట్టింగ్, మద్యానికి బానిసలై జీవితం నాశనం చేసుకుంటున్రు
  • అప్పులపాలై కొందరు ఆత్మహత్యలు, హత్యలకు పాల్పడుతున్రు
  • కంట్రోల్ చేసేందుకు పోలీసుల ప్రయత్నం

గద్వాల, వెలుగు : ఆన్‌‌‌‌లైన్ బెట్టింగ్, మద్యం మత్తులోపడి యువత దారి తప్పుతున్నది. అప్పులపాలై కొందరు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మరికొందరు హత్యలు, నేరాలకు పాల్పడుతున్నారు. స్నేహితులతో కలిసి వందలతో మొదలయ్యే బెట్టింగ్ లక్షల వరకూ వెళ్తున్నాయి.పెట్టిన సొమ్ముకు రెట్టింపు వస్తుందనే ఆశతో అడ్డగోలుగా అప్పులు చేస్తున్నారు. కన్న బిడ్డలు చేసిన అప్పులు కట్టలేక తల్లిదండ్రులు ఆర్థికంగా నలిగిపోతున్నారు. అంతేకాకుండా కన్నవారికి కడుపుకోతను మిగులుస్తున్నారు. 

మత్తులో వికృత చేష్టలు..

యువత మత్తులో వికృత చేష్టలకు పాల్పడుతున్న సంఘటనలు ఇటీవల జిల్లాలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పలు పోక్సో, రేప్ కేసుల్లో అరెస్ట్ అయిన యువకులను పరిశీలిస్తే విస్తుపోయే నిజాలు బయటకొస్తున్నాయి. గంజాయి మత్తులో అంబేద్కర్ నగర్ లో మాజీ కౌన్సిలర్ తోపాటు మున్సిపల్ ఎంప్లాయ్ పై దాడి చేశారు. కొత్త బస్టాండ్ సమీపంలో ఫుల్​గా తాగి రాష్ డ్రైవింగ్ చేస్తూ సైడ్ ఇవ్వలేదని భార్యాభర్తలను చితకబాదారు. దాన్ని అడ్డుకునేందుకు వెళ్లిన కానిస్టేబుల్ పై కూడా దురుసుగా వ్యవహరించారు.

 మార్కెట్ యార్డ్ సమీపంలో తాగి గొడవ పడుతుండగా, సర్దిచెప్పేందుకు వెళ్లిన పోలీసులపైనే దాడి చేశారు. రీల్స్ కోసం అంటూ హుక్కా పిలుస్తూ తల్వార్లు పట్టుకొని వీధుల్లో తిరుగుతున్న ఘటనలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. మత్తు పదార్థాలకు అలవాటు పడ్డాక డబ్బులు లేకపోవడంతో వైట్నర్ ని పత్తిలో పోసుకొని లేదా కర్చీఫ్ లో పోసుకొని వాసన పీలుస్తూ మత్తులో మునిగిపోతున్నారు. మరికొందరు మెడికల్ స్టోర్లలో దగ్గు సిరప్ లను తీసుకొని తాగుతూ మత్తులో తూగుతున్నారు. గంజాయి తాగుతూ మత్తులోకి జారుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు గద్వాల టౌన్, ధరూర్ మండల కేంద్రంతోపాటు గ్రామాల్లో విచ్చలవిడిగా కొనసాగుతోంది. 

దేనికైనా తెగిస్తున్నారు..

ఆన్ లైన్ బెట్టింగ్ కు అలవాటు పడి డబ్బులు పోగొట్టుకొని ఆ డబ్బులు కోసం ఆస్తులు అమ్ముకుంటున్నారు. కొందరు చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటుండగా, మరికొందరు వాటిని తీర్చలేక హత్యలు చేస్తున్నారు. గద్వాలలో మొన్న జరిగిన మహిళా హత్య కేసులో బెట్టింగ్ లో ఆ యువకుడు డబ్బులు పోగొట్టుకొని వాటిని తీర్చేందుకు అప్పు అడగడానికి వెళ్లి ఓ మహిళను హత్య చేశాడు. 

కంట్రోల్ చేసేందుకు పోలీసుల యత్నం..

యువత చెడు దారిలో వెళ్లకుండా కంట్రోల్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా గ్రామాల్లో మద్యం, గంజాయి, డ్రగ్స్​వల్ల జరిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. తాగి డ్రైవింగ్ చేస్తూ పట్టుబడ్డ వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. అమ్మాయిలను వేధిస్తున్న వారిని రెడ్​హ్యాండెడ్​గా పట్టుకొని కేసులు నమోదు చేస్తున్నారు. 

పిల్లలపై నిఘా పెట్టాలి..

తల్లిదండ్రులు తమ పిల్లలపై నిరంతరం నిఘా పెట్టాలి. ఫోన్ లో ఏ గేమ్స్ ఆడుతున్నారో చూడాలి. స్కూల్, కాలేజీలకు వెళ్లే పిల్లలు ఏం చేస్తున్నారో గమనించాలి. పోలీస్​శాఖ ఆధ్వర్యంలో స్కూల్స్, కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎవరైనా లైంగిక వేధింపులకు పాల్పడితే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. – టంగుటూరి శీను, సీఐ, గద్వాల