
న్యూఢిల్లీ, వెలుగు: ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా వినియోగదారులు కొనుక్కున్న వస్తువులకు బదులుగా, ఇటుకలను ఉంచుతూ వారిని మోసం చేస్తున్నారని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. వినియోగదారుల పరిరక్షణ చట్టం 2019పై చర్చలో భాగంగా టీఆర్ఎస్ తరపున ఆయన మాట్లాడారు. ఆన్ లైన్ షాపింగ్‌లో పగిలిన వస్తువులు, నాణ్యత లేని ఉత్పత్తులు కూడా అందుతున్నాయని చెప్పారు. ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం వినియోగదారుల పరిరక్షణ చట్టాన్ని తీసుకురావడంపై హర్షం వ్యక్తం చేశారు.
అయితే బిల్లులో ఆన్ లైన్ షాపింగ్, ఉత్పత్తుల ప్రకటనలు, పలు అంశాలపై స్పష్టత లేదన్నారు. ఈ- కామర్స్ కొనుగోళ్లలో సమస్యలు రెట్టింపు అయ్యాయని, కూల్‌డ్రింకుల వంటి వాటిపై సీజనల్ వారీగా ధరలు పెంచుతున్నారని చెప్పారు. ఉత్పత్తుల ప్రకటనలోనూ స్పష్టత ఇవ్వకుండా మోసం చేస్తున్నారని తెలిపారు. వినియోగదారుడికి నాణ్యత, స్వచ్చత, వస్తువు ధర వంటివాటిపై స్పష్టత ఇవ్వకపోతే కొత్త చట్టం తెచ్చినా ఉపయోగం లేదన్నారు. తాము సూచించిన అంశాలపై కేంద్రం ఆలోచించాలని కోరారు.