అడిగినంత కడితేనే ఆన్ లైన్ క్లాసు

అడిగినంత కడితేనే ఆన్ లైన్ క్లాసు

ప్రైవేట్ స్కూళ్ల దోపిడీ

కట్టకపోతే పాస్ వర్డ్ ఇవ్వని మేనేజ్ మెంట్లు

ఫీజులు పెంచొద్దని జీవో ఉన్నా.. బేఖాతరు

ఏడాది మొత్తం ఫీజులు ఒకేసారి వసూలు

కట్టడి చేయని సర్కార్

తన కొడుకు వెనకబడిపోతాడని..!

స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్​మెంట్ లో పనిచేస్తున్న ఓ కీలక అధికారి కుమారుడు హైదరాబాద్ లోని పేరున్న కార్పొరేట్ స్కూల్ లో చదువుతున్నాడు. జూన్ లో ఆన్ లైన్ క్లాసులు మొదలయ్యాక ఈ నెల ఫస్ట్​ వీక్ లో ఎగ్జామ్స్ నిర్వహించారు. సదరు ఆఫీసర్ ఫస్ట్​ టర్మ్ ఫీజు కూడా చెల్లించారు. రూల్స్ కు వ్యతిరేకంగా ఆ స్కూల్ మేనేజ్ మెంట్ ముందస్తుగా క్లాసులు ప్రారంభించినా, ఫీజులు పెంచినా.. సదరు ఆఫీసర్ సగటు పేరెంట్ గా వ్యవహరిం చారే తప్ప.. ఎడ్యుకేషన్ డిపార్ట్​మెంట్ ఆఫీసర్ హోదాలో మాత్రం చర్య తీసుకోలేకపోయారు. ఆన్ లైన్ క్లా సులకు హాజరు కాకపోతే మిగతా స్టూడెంట్స్ కంటే తన కుమారుడు వెనకబడి పోతాడన్న భావనే దీనికి కారణం. తమ పిల్లల విషయంలో పేరెంట్స్ కు ఉండే ఈ బలహీనతనే ప్రైవేట్ స్కూల్స్ క్యాష్ చేసుకుంటున్నాయి .

హైదరాబాద్, వెలుగు: ఆన్ లైన క్లాసుల పేరిట ప్రైవేటు స్కూల్ల మేనేజ్ మెంట్లు చేస్తున్న ఫీజుల దోపిడీకి రాష్ట్రంలో అడ్డుకట్ట లేకుండాపోయింది. రోజూ చెప్పేవి రెండు, మూడు క్లాసులే అయినా.. ఫీజులు మాత్రం ఫుల్లుగా వసూలు చేస్తున్నాయి. మరికొన్ని స్కూల్లు భారీగా ఫీజులను పెంచేశాయి. ఆన్ లైన్ పాఠాల పేరుతో కొత్త దందాకు తెరలేపాయి. ఒక పక్క కరోనా ఎఫెక్ట్ తో ఉపాధి లేక పేరెంట్స్ అవస్థ పడుతుంటే.. స్కూల్ ఫీజుల పేరుతో వారిని వేధింపులకు గురిచేస్తున్నాయి. ఫీజులు పెంచొద్దని ప్రభుత్వం జీవో నెబర్ 46 ఇచ్చినా.. దాన్ని అమలు చేసే నాథుడే కరువయ్యాడు.

క్లాసులు ఆఫ్ .. ఫీజులు ఫుల్

రాష్ట్రంలో 10,549 ప్రైవేటు, కార్పొరేట్ స్కూల్లు ఉండగా.. వాటిలో 30 లక్షల మంది దాకా చదువుతున్నారు. కరోనా ఎఫెక్ట్​తో మార్చి నుంచే అన్ని స్కూళ్లు మూతపడ్డాయి. జూన్ 12 నుంచి స్కూళ్లు రీ ఓపెన్​ కావాల్సి ఉండగా.. కరోనా వ్యాప్తితో అది సాధ్యం కాలేదు. దీంతో రాష్ట్రంలోని స్కూళ్లలో ఆన్​లైన్ క్లాసులకు సెప్టెంబర్ 1 నుంచి సర్కారు అనుమతించింది. కానీ ప్రభుత్వ అనుమతి లేకుండానే.. జూన్​ నుంచే ఆన్​లైన్ పాఠాలు మొదలుపెట్టిన మెజార్టీ కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లు ఫీజుల దందాకు తెరలేపాయి. పేరెంట్స్​ ఫీజులు కట్టి, పుస్తకాలు కొంటేనే ఈ ఆన్​లైన్ క్లాసులకు, ఎగ్జామ్స్​కు స్కూల్ మేనేజ్మెంట్లు అనుమతిస్తున్నాయి. ఆయా స్కూళ్లు.. స్టూడెంట్​ క్లాసును బట్టి (మొత్తం ఫీజు) రూ. 50 వేల నుంచి రూ. 2 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. ఫీజు లేట్ అయినా, మిస్ అయిన క్లాసులు కావాలన్నా.. అదనంగా 10 శాతం ఫీజులు రాబడుతున్నాయి. పిల్లల చదువు కోసమని ఆ మొత్తమూ కట్టినా మిస్ అయిన క్లాస్​లకు సంబంధించిన రెస్పాన్స్ ఉండటం లేదు. ఫీజులు కట్టనివారి ఐడీలను బ్లాక్ చేయడంతోపాటు వారికి క్లాసులకు సంబంధించిన లింక్ లను మేనేజ్​మెంట్లు పంపించడం లేదు. రోజుకు రెండు, మూడు క్లాసులే జరుగుతున్నాయని, స్కూల్ మెయింటెనెన్స్​ ఖర్చు కూడా మేనేజ్​మెంట్లకు తగ్గిపోయిందని, అయినా ఫీజులు మాత్రం ఫుల్​ గా వసూలు చేయడంపై పేరెంట్స్​  మండి పడుతున్నారు.

సర్కారు జీఓ గాలికి..

కరో నా ఎఫెక్ట్​తో స్టేట్ బోర్డు స్కూల్స్​తోపాటు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ ఇతర ఇంటర్నేషనల్ బోర్డు స్కూల్స్​లో ఫీజుల వసూళ్లపై ఏప్రిల్​లో ప్రభుత్వం జీవో నంబర్ 46ను రిలీజ్ చేసింది. దీని ప్రకారం 2020–21లో ఎలాంటి ఫీజులు పెంచొద్దు. కేవలం ట్యూషన్​ ఫీజులనే నెల వారీగా తీసుకోవాలి. కానీ ఈ జీవోను ప్రైవేటు స్కూల్ మేనేజ్​మెంట్లు లెక్కలోకే తీసుకోలేదు. చాలా స్కూళ్లు గతేడాది కంటే భారీగా ఫీజులు పెంచగా.. నెలవారీగా కాకుండా ఒకేసారి ఫీజులు వసూలు చేస్తున్నాయి. అడ్మిషన్​ ఫీజు, కాషన్ డిపాజిట్, ఫెసిలేషన్​ ఫీజు, మెయిన్​టెనెన్స్​, డెవలప్ మెంట్ ఫీజులు తీసుకోవద్దని సర్కారు చెప్తున్నా.. మేనేజ్​మెంట్లు వినిపించుకోవడం లేదు. వీటి కోసం ఒక్కో స్టూడెంట్​ నుంచి రూ. 10 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నాయి. ఇవన్నీ అధికారిక లెక్కల్లోకి రావు. వీటికి రిసిప్ట్​లూ ఇవ్వరు. ఒక క్లాస్ నుంచి మరో క్లాస్​కు అప్ గ్రేడ్ అయితే.. అలాంటి వాళ్ల నుంచి రూ.5 వేల నుంచి రూ.10వేల వరకు ఎంట్రీ ఫీజు వసూలు చేస్తున్నారు .

ఫిర్యాదు చేస్తే పట్టించుకోరుప్రశ్నిస్తే కేసులు

జీవో నంబర్ 46 ప్రకారం మేనేజ్​మెంట్లు నడుచుకోకపోవడంపై చాలామంది పేరెంట్స్​, స్టూడెంట్స్​ యూనియన్లు ఎడ్యుకేషన్​ డిపార్ట్​మెంట్​ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశారు . అయినా వారు పట్టించుకోలేదు. కోర్టు ఆదేశాలతో గ్రేటర్ హైదరాబాద్​ పరిధిలోని 27 స్కూళ్లను ఆఫీసర్లు తనిఖీ చేశారు. ఆయా స్కూళ్లు జీవోను అమలు చేయడం లేదని తేలింది. అయితే వాటికి ఆఫీసర్లు నోటీసులు ఇచ్చి, వదిలేశారు . రూల్స్​ పాటించకుండా వేల స్కూళ్లున్నా యి. అయినా వాటివైపు ఆఫీసర్లు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఇదిలా ఉండగా ఫీజులు వసూలు చేయడాన్ని ప్రశ్నించేందుకు ఓ స్కూల్​కు వెళ్లిన పేరెంట్స్‌ పై బోయిన్‌ పల్లి పోలీసులు నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదు చేయడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి.

టీచర్లను తగ్గించేసిన స్కూళ్లు

రాష్ట్రంలో గతేడాది సుమారు లక్షన్నర వరకూ ప్రైవేటు స్కూల్​ టీచర్లు ఉండేవారు. కానీ కరోనా ఎఫెక్ట్​తో చాలా స్కూళ్లు టీచర్లను తగ్గించేశాయి. కొన్ని స్కూళ్లు ఐదారుగురితోనే నడుస్తున్నాయి. ఫోన్లు, ల్యాప్ టాప్ ల భారం అదనం మాములు ఫీజులతో పోలిస్తే కరోనా టైంలో ఆన్​లైన్​ స్కూల్ ఫీజులు పేరెంట్స్​కు భారంగా మారాయి. గతంలో ఫీజులు చెల్లిస్తే సరిపోయేది. కానీ ఇప్పుడు ఆన్​లైన్ క్లాసుల కోసం స్టూడెంట్లకు ఫోన్లు, ల్యాప్ టాప్, ట్యాబ్ తో ప్రింటర్ కూడా కొనివ్వాల్సి వస్తోంది. వీటి కోసం ఒక్కో స్టూడెంట్​కు పేరెంట్స్​ రూ. 20 వేలు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఇక, ఆన్​లైన్​ క్లాసులు స్టూడెంట్ల కండ్లపై ప్రభావం చూపుతున్నాయని హెల్త్​ ఎక్స్​పర్స్ట్ చెబుతున్నారు .

క్లాసులు మాన్పించేస్తున్నరు..

హైదరాబాద్​ లోని ఓ ప్రైవేట్ సంస్థలో జాబ్​ చేస్తున్న శేఖర్ తన కుమారుడ్ని దిల్ సుఖ్ నగర్ లోని ఓ స్కూల్​లో ఫోర్త్​ క్లాస్​చదివిస్తున్నారు. ఆ స్కూల్​ మేనేజ్​మెంట్ జూన్​ మొదటి వారంలో ఆన్​ లైన్​ క్లాసులు ప్రారంభించింది. క్లాసులు ప్రారంభించిన నెల రోజులకే స్కూల్​ ఫీజు రూ. 67 వేలు చెల్లించాలని ఫోన్​ చేసి చెప్పారు. పిల్లలు క్లాసులపై అసలు శ్రద్ధ పెట్టడం లేదని, ఇంతదానికి ఫీజు చెల్లించడం కూడా దండుగనే ఉద్దేశంతో ఆయన క్లాసులు మాన్పించేశారు . స్కూల్స్​ ప్రారంభమయ్యాక మరేదైనా స్కూల్​ లో చేర్పించాలని ఆలోచనలో ఉన్నారు .

గాడ్జెట్స్, ఫీజుల భారం

హైదరాబాద్ లోని కొండాపూర్ కు చెందిన త్రీ స్టార్ హోటల్​ ఉద్యోగి శ్రీకాంత్​​ కుమారుడు నవనీత్, కుమార్తె నవ్య ఓ ప్రైవేట్​ స్కూల్​లో ఆరు, 8వ తరగతి చదువుతున్నారు . వీరికి జూన్​లో ఆన్​లైన్​ క్లాస్​లు స్టార్ట్​ కావడంతో ఇద్దరి కోసం రూ.40 వేలు పెట్టి రెండు ట్యాబ్​లు కొన్నారు. ఇద్దరికి గాను రూ. లక్ష ఫీజు చెల్లించాలని స్కూల్ మేనేజ్​మెంట్​ మెసేజ్​  పంపింది. జులై చివరి నాటికి ఫీజు చెల్లించకపోతే క్లాసు లకు అనుమతించమని చెప్పింది. కరోనాతో హోటల్ నడవక సగం జీతంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న శ్రీకాంత్.. అప్పు చేసి మరీ పిల్లల ఫీజు కట్టారు.