
- పరిశోధనలను ప్రోత్సహించేందుకు రీసెర్చ్ అవార్డులు ఇస్తం
- టీజీసీహెచ్ఈ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి వెల్లడి
- పీజీ సిలబస్‌లో మార్పులు అవసరమని కామెంట్
హైదరాబాద్, వెలుగు: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంజినీరింగ్ బీ కేటగిరి సీట్ల కౌన్సెలింగ్‌ను ఆన్ లైన్ లో నిర్వహిస్తామని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి తెలిపారు. ఈ ఏడాదే ఆన్‌లైన్‌లో చేయడానికి ప్రయత్నించినా సాధ్యం కాలేదని చెప్పారు. కొన్ని పీజీ కోర్సులతో ఎలాంటి ఉపయోగం లేకుండా పోతోందని, అలాగే పీజీ ఇంజినీరింగ్, జనరల్ పీజీ కోర్సుల సిలబస్‌లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన నేపథ్యంలో వైస్ చైర్మన్ ఇటిక్యాల పురుషోత్తం, సెక్రెటరీ శ్రీరామ్ వెంకటేశ్ తో కలిసి శనివారం టీజీసీహెచ్ఈ ఆఫీసులో మీడియాతో బాలకిష్టారెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో ఉత్తమ పరిశోధనలు చేసిన ప్రొఫెసర్లకు రీసెర్చ్ అవార్డులు ఇస్తామని, రీసెర్చ్‌ను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని చైర్మన్ వెల్లడించారు. దీంతో పాటు రీజినల్ ఇన్నొవేషన్ క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
విద్యా వ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) గవర్నెన్స్‌ను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. భవిష్యత్తులో ‘రైజింగ్ తెలంగాణ’ లో యువత భాగస్వామ్యం అయ్యేలా చూస్తామన్నారు. ఈ ఏడాది వివిధ ప్రవేశ పరీక్షలను త్వరగా ముగించి, జూన్ 30 నాటికే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకున్నామన్నారు. తొలిసారిగా డిగ్రీ ఫస్టియర్‌లో చేరే విద్యార్థులకు ఒరియంటేషన్ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. అలాగే, ఈ ఏడాది తొలిసారిగా సర్కారు డిగ్రీ కాలేజీల్లోనూ స్పాట్ అడ్మిషన్లు చేపట్టామని వెల్లడించారు. పరిశ్రమలతో విద్యా సంస్థల అనుసంధానంపై దృష్టి పెట్టి, ప్లేస్‌మెంట్స్ కోసం ప్రత్యేకంగా ఎంవోయూలు చేసుకున్నామని వివరించారు. ‘అవసరం ఉన్నవారి వద్దకే ఆంగ్ల విద్య’ పేరుతో విద్యార్థులకు అవసరమైన సిలబస్‌ను అందుబాటులోకి తెచ్చామని, ఉన్నత విద్యా మండలి వెబ్‌సైట్‌లో దీనిని పొందుపరిచామని వెల్లడించారు.