ఇంత డబ్బుందా : ఆన్ లైన్ గేమింగ్ కంపెనీలకు లక్ష కోట్ల జీఎస్టీ నోటీసులు

ఇంత డబ్బుందా : ఆన్ లైన్ గేమింగ్ కంపెనీలకు లక్ష కోట్ల జీఎస్టీ నోటీసులు

ఆన్ లైన్ గేమ్స్.. ఇన్నాళ్లు ఇష్టారాజ్యం.. లక్షల కోట్ల లావాదేవీలు.. రీసెంట్ గా జీఎస్టీ పరిధిలోకి వచ్చింది.. 28 శాతం పన్ను విధింపు కిందకు వచ్చింది. కొత్తగా వచ్చిన ఈ రూల్ తో చిన్నా చితక కంపెనీలు మూతపడ్డాయి.. బడా కంపెనీలు మాత్రం ఆఫర్స్, విన్నింగ్ మనీ తగ్గించేశాయి. లేటెస్ట్ గా ఆల్ లైన్ గేమింగ్ కంపెనీలకు జీఎస్టీ నోటీసులు ఇచ్చింది. ట్యాక్స్ కట్టాలని ఆదేశించింది. 

ఆయా గేమింగ్ కంపెనీల లావాదేవీల ఆధారంగా.. అక్షరాల ఒక లక్ష కోట్ల రూపాయల ట్యాక్స్ నోటీసులు పంపించింది జీఎస్టీ.  దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే లక్ష కోట్లకు ట్యాక్స్ నోటీసులు పంపించటం అనేది ఇదే ఫస్ట్ టైం కావటం సంచలనంగా మారింది. అక్టోబర్ 1 నుంచి భారత్‌లో రిజిస్టర్ చేసుకున్న విదేశీ గేమింగ్ కంపెనీల డేటా ఇంకా లేదని అధికారి ఒకరు తెలిపారు.

ఈ క్రమంలోనే డ్రీమ్‌ 11, డెల్టా కార్పొరేషన్‌ వంటి ఆన్‌లైన్‌ గేమింగ్‌ సంస్థలకు 2023 సెప్టెంబర్ నెలలోనే   షోకాజ్‌ నోటీసులు జారీ అయ్యాయి. దీంతో పాటు రూ.21వేల కోట్ల పన్ను ఎగవేతకు సంబంధించి 2022 సెప్టెంబర్‌లో గేమ్స్‌ క్రాఫ్ట్‌కు వేరేగా షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. అయితే, దీనిపై సదరు కంపెనీ కర్ణాటక హైకోర్టును  ఆశ్రయించడంతో అనుకూలంగా తీర్పు వెలువడింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం జులైలో సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. 

కాగా విదేశీ ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలు అక్టోబర్ 1 నుండి భారత్ లో  నమోదు చేసుకోవడం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం జీఎస్టీ చట్టాన్ని సవరించింది.  ఆన్‌లైన్‌ గేమింగ్‌లో పెట్టే మొత్తం విలువపై 28 శాతం జీఎస్టీ విధించేందుకు జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయించింది. ఈ విషయంలోనే గేమింగ్‌ కంపెనీలకు, ప్రభుత్వానికి మధ్య వివాదం నెలకొంది.