జాబ్స్ కోల్పోయిన యువతులతో ఆన్ లైన్లో వ్యభిచారం

జాబ్స్ కోల్పోయిన యువతులతో ఆన్ లైన్లో వ్యభిచారం
  • ట్రాప్ చేసి.. ఉచ్చులోకి దింపారు
  • అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన బాలాపూర్ పోలీసులు
  • పరారీలో ప్రధాన నిందితుడు శివ
  • ఎంత మందిని ట్రాప్ చేశారనేది దర్యాప్తు చేస్తున్నాం: రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్

హైదరాబాద్: లాక్ డౌన్ ప్రభావంతో ఉద్యోగాలు కోల్పోయిన అమ్మాయిలను ట్రాప్ చేసి.. వారిని వ్యభిచారం రొంపిలోకి దింపుతున్న ముఠాను బాలాపూర్ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారి ఆధీనంలో ఉన్న ఇద్దరు అమ్మాయిలను విడిపించి కూకట్ పల్లిలోని రెస్క్యూ హోమ్ కు తరలించారు.  ముగ్గురు నిందితులను పట్టుకున్నామని.. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడి శివ కోసం గాలింపు కొనసాగుతోందని రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. నిందితులు ఇంకా ఎంత మందిని ట్రాప్ చేసి ఉచ్చులోకి దింపారనే విషయంపై విచారణ చేస్తున్నామని ఆయన చెప్పారు.

హైదరాబాద్ నగర శివార్లలోని జల్ పల్లి నక్షత్ర విలాస్ ను తమ కార్యకలాపాలకు కేంద్రంగా ఉంచుకున్నారు ముఠా సభ్యులు. పట్టుపడిన ముగ్గురులో పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలానికి చెందిన ఓబిలిషెట్టి సతీష్ అలియాస్ నాని(28), సూర్యాపేట జిల్లా పాల్కిపాడు మండలానికి చెందిన రమావత్ నాగేశ్వరరావు అలియాస్ చరణ్ నాయక్ (30), మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలానికి చెందిన కరిడిగి మహేష్ గౌడ్ అలియాస్ మహేష్ (31), పరారీలో ఉన్న శివ నేతృత్వంలో ఆన్ లైన్ ద్వారా వ్యభిచారం చేయిస్తున్నారు. దీని కోసం ప్రత్యేకంగా యాప్ క్రియేట్ చేసి.. దాని ద్వారా ఆన్ లైన్ లో డబ్బులు చెల్లించిన వారికి యువతులను పంపిస్తున్నారు.

ముఠా గురించి తెలుసుకున్న పోలీసులు విటుల మాదిరిగా ఆన్ లైన్ లో సంప్రదించగా.. డబ్బులు చెల్లిస్తే కావాల్సిన అమ్మాయిని పంపిస్తామన్నారు. యువతి కోసం బేరం కుదుర్చుకున్న అనంతరం యువతిని తన ముఠా సభ్యులతో కారులో చెప్పిన చోటుకు పంపిస్తున్నారు. బాలాపూర్ పోలీసులు నిఘా పెట్టి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరి హెడ్ క్వార్టర్ అయిన నక్షత్ర విలాస్ కు వెళ్లి అక్కడ ఉన్న ఇద్దరు యువతులను రక్షించారు. వారిని విచారించగా.. తాము కాల్ సెంటర్లలో పనిచేసేవారమని.. లాక్ డౌన్ వల్ల తమ ఉద్యోగాలు పోవడంతో.. ఆర్ధికంగా ఇబ్బందులు పడుతుంటే.. మేం ఇప్పిస్తామంటూ వీరు ట్రాప్ చేసి వ్యభిచారంలోకి దింపారని తెలిపారు. కుటుంబ సభ్యులకు దూరంగా ఉద్యోగం ఉందనే ధీమాతో బతకడానికొస్తే.. ఉన్న ఉద్యోగం పోయి వీరి ట్రాప్ లో చిక్కుకున్నామని.. బయటపడే మార్గం లేక.. ఏం చేయాలో తెలియక రోజులు గడిపేస్తున్నామని యువతులు తెలియజేశారు. తమ లాంటి వారిని వీరు ఎంత మందిని ట్రాప్ చేసి వ్యభిచారం ఉచ్చులోకి దింపారో తెలియదని.. వారు తెలిపారు. ఈ యువతులిద్దరినీ  కూకట్ పల్లిలోని రెస్క్యూ హోం కు తరలించారు.