తెలుగు మీడియం చదువుతున్నది కేవలం 24 శాతమే..

తెలుగు మీడియం చదువుతున్నది కేవలం 24 శాతమే..
  • 73% ఇంగ్లిష్ మీడియం స్టూడెంట్లే..
  • 2019-20 యూడైస్ లెక్కలు రిలీజ్ చేసిన అధికారులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో స్కూల్ స్టూడెంట్లు ఇంగ్లిష్​ మీడియం వైపే అడుగులేస్తున్నారు. తెలంగాణలో మొత్తం 73.60 శాతం స్టూడెంట్లు ఇంగ్లిష్​మీడియంలో చదువుతుండగా, కేవలం 23.84 శాతమే తెలుగు మీడియంలో చదువుతున్నారు. దీంతో మీడియం తేడా ఏటా పెరుగుతూ పోతోంది. మరో ఐదేండ్లలో తెలుగు మీడియం పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడింది. సోమవారం యూడైస్​2019–20 లెక్కలను విద్యాశాఖ అధికారులు రిలీజ్ చేశారు. రాష్ట్రంలో 40,898 స్కూళ్లుండగా, వీటిలో 60,06,344 మంది స్టూడెంట్లు చదువుతున్నారు. వీరిలో ఇంగ్లిష్ మీడియంలో 44,21,111 (73.60%) మంది, తెలుగు మీడియంలో 14,32,098 (23.84%) మంది చదువుతున్నారు. ఆ తర్వాతి స్థానంలో 1,45,545 (2.42%) మంది ఉర్దూ మీడియం, 3,229 మంది హిందీ, 2,515 మంది మరాఠీ, 1,441 మంది కన్నడ, 250 మంది బెంగాలీ, 155 మంది తమిళ మీడియంలో చదువుతున్నారు. ఇక ఫస్ట్ క్లాస్​లో  6.55 లక్షల మంది చేరితే, దాంట్లో 4.63 లక్షల(76 శాతం) మంది ఇంగ్లిష్​మీడియం స్టూడెంట్లే ఉన్నారు. ఇటు సర్కారు, ప్రైవేటు స్కూళ్ల సంఖ్య పెరుగుతోంది. 2018–19లో 40,597 బడులుంటే, 2019–20లో 40,898కి పెరిగాయి. విద్యాహక్కు చట్టం అమల్లో ఉన్న డ్రాపౌట్స్ రేట్  తగ్గడం లేదు. అధికారిక లెక్కల ప్రకారమే ఫస్ట్ క్లాస్ లో చేరిన స్టూడెంట్లు పదో తరగతి వచ్చేసరికి 31 శాతం మంది డ్రాపౌట్స్ అవుతున్నారు. 2010–11లో ఫస్ట్​ క్లాసులో 7,94,207 మంది చేరితే, 2019–20లో టెన్త్ లో 5,46,865 మంది చదివారు.