47 లక్షల మంది స్టూడెంట్లకే అపార్ ఐడీ.. ఆధార్ ఇష్యూతో రిజిస్ట్రీలో ఆలస్యం

47 లక్షల మంది స్టూడెంట్లకే అపార్ ఐడీ.. ఆధార్ ఇష్యూతో రిజిస్ట్రీలో ఆలస్యం
  • రాష్ట్ర వ్యాప్తంగా 73 లక్షల మంది విద్యార్థులు
  •     64 శాతం మందికే ఐడీ క్రియేట్
  •     జగిత్యాల జిల్లాలో 85 శాతం నమోదు కంప్లీట్

హైదరాబాద్, వెలుగు: విద్యార్థులందరి రికార్డులు ఒకే చోట చేర్చేందుకు ప్రతి స్టూడెంట్​కు ఒక పర్మినెంట్ నంబర్ ఉండాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అపార్ ఐడీ’నమోదు ప్రక్రియ రాష్ట్రంలోఆలస్యం అవుతున్నది. ఏడాది దాటినా కేవలం 64 శాతం మంది స్టూడెంట్లకే ఐడీ క్రియేట్ చేశారు. మిగిలిన వారి నమోదుకు ‘ఆధార్’ లోపాలు పెద్ద అడ్డంకిగా మారాయి. 

రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు సుమారు 73,86,881 మంది స్టూడెంట్లు చదువుతున్నారు. వీరిలో 46,98,112 మందికి మాత్రమే ఇప్పటివరకు ఆటోమేటెడ్‌‌‌‌ పర్మినెంట్‌‌‌‌ అకడమిక్‌‌‌‌ అకౌంట్‌‌‌‌ రిజిస్ట్రీ (అపార్‌‌‌‌) ఐడీని క్రియేట్ చేశారు. మిగిలిన వారి వివరాలను అప్​డేట్ చేసేందుకు సమగ్ర శిక్ష సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. అపార్ ఐడీకి ఆధార్ తప్పనిసరి. అయితే, స్కూళ్లలోని విద్యార్థులు, తల్లిదండ్రుల పేర్లకు.. ఆధార్ కార్డుల్లోని పేర్లకు తేడాలు ఉన్నాయి. ఆధార్ అప్​డేట్ కష్టంగా మారడంతో.. అపార్ ఐడీ క్రియేట్ చేయడమూ ఆలస్యం అవుతున్నది. 

ప్రతి స్టూడెంట్​కు ఐడీ

సర్కారు, గవర్నమెంట్ బడుల్లో చదివే ప్రతి విద్యార్థికి యూడైస్ ద్వారా పెన్ నంబర్ కేటాయిస్తారు. దీనిద్వారా అపార్ కార్డులు ఇస్తున్నారు. ఒక విద్యార్థి ఇతర ప్రాంతాల్లో చదివేందుకు వెళ్లినప్పుడు ఈ నంబర్ కొడితే.. ఆ విద్యార్థి పూర్తి డేటా వారికి తెలస్తుంది. దీనికితోడు సర్టిఫికేట్లూ డీజీ లాకర్​లో భద్రపర్చుకునే అవకాశం ఉంటుంది. తద్వారా దొంగ సర్టిఫికెట్లకు చెక్ పడే చాన్స్ ఉంది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న అపార్ ఐడీ నమోదుపై ఇబ్బందులు తప్పడం లేదు.

మహబూబ్ నగర్​లో సగం కూడా కాలే..

అపార్ ఐడీ జనరేట్ చేయడంలో పలు జిల్లాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఒక్క జిల్లా కూడా 90శాతం మంది విద్యార్థులకు ఐడీని జనరేట్ చేయకపోవడం దీనికి నిదర్శనం. మహబూబ్ నగర్​లో అయితే 1.73 లక్షల మందికి గానూ కేవలం 82వేల మంది (47.22%)కి మాత్రమే అపార్ ఐడీ క్రియేట్ చేశారు. 

అత్యధికంగా జగిత్యాల జిల్లాలో 85 శాతం ఉండగా, ఆ తర్వాత రాజన్న సిరిసిల్లలో 78.15%, ఖమ్మంలో 74.36%, నిజామాబాద్ లో 73.14%, సిద్దిపేటలో 72.38% మంది స్టూడెంట్లకు అపార్ ఐడీ జనరేట్ చేశారు. అత్యల్పంగా మహబూబ్ నగర్ తర్వాత కుమ్రంభీం ఆసిఫాబాద్​లో 50.32%, జోగులాంబ గద్వాలలో 51.50%, నారాయణపేటలో 52.94%, హైదరాబాద్​లో 56.04% ప్రక్రియ పూర్తయింది. అయితే, ఉన్నతాధికారుల నుంచి నిత్యం డీఈవోలు, ఎంఈవోలకు ఆదేశాలు వెళ్తున్నా.. సిబ్బందికి ఇతర పనుల నేపథ్యంలో ఈ ప్రక్రియ ఆలస్యమవుతోందని అధికారులు చెప్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, ఆధార్ కార్డుల్లోని సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటే.. ఈ ప్రక్రియ త్వరితగతిన పూర్తవుతుందని సిబ్బంది చెప్తున్నారు.