ఆస్తుల వివరాలిచ్చింది ఏడుగురు జడ్జిలే

ఆస్తుల వివరాలిచ్చింది ఏడుగురు జడ్జిలే
  • ఆస్తుల వివరాలు వెల్లడించిన సుప్రీం జడ్జిలు
  • పదేళ్ల తర్వాత పూర్తి బలంతో  సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు జడ్జిల్లో కేవలం ఏడుగురు మాత్రమే వాలంటరీగా తమ ఆస్తుల వివరాలను వెల్లడించారు. మిగతా న్యాయమూర్తులు 1997 రిజల్యూషన్ కు అనుగుణంగా చీఫ్ జస్టిస్ కి మాత్రమే తమ ఆస్తుల వివరాలను వెల్లడించారు. దాదాపు పదేళ్ల తర్వాత సుప్రీం కోర్టు ఇప్పుడే పూర్తి బలంతో(31 మంది జడ్జిల)తో ఉంది. ఇందులో సీజేఐ జస్టిస్ రంజన్ గొగొయ్, సీనియర్ జడ్జి జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఆర్.భానుమతి, జస్టిస్ఏ.ఎం.ఖన్ విల్కర్, జస్టిస్ అశోక్ భూషణ్ లు తమ ఆస్తుల వివరాలను ప్రజలకు వెల్లడించారు. సీనియర్ జడ్జిలు, భవిష్యత్తులో చీఫ్ జస్టిస్ గా సేవలందించనున్న జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ డి.వై.చంద్రచూడ్ లు ఆస్తుల వివరాలను వెల్లడించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఆస్తుల వెల్లడి వాలంటరీ కావడంతో 31 మంది జడ్జిల్లో కేవలం ఏడుగురు మాత్రమే వెల్లడించారని, తప్పనిసరి చేస్తేనే మిగతా వారు ముందుకొస్తారనే వాదన వినిపిస్తోంది. దీనిపై ఆర్టీఐ మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధర్ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు జడ్జీలు కూడా పబ్లిక్ సర్వెంట్లేనన్నారు. ఆస్తుల వెల్లడిని అడ్డుకోవడానికి అధికారులు చూపే కారణాలు లోక్ పాల్ యాక్ట్ స్ఫూర్తికి వ్యతిరేకమని అన్నారు. జడ్జిల ఆస్తుల వెల్లడికి సంబంధించి 1997 మే 7 న చేసిన తీర్మానం ప్రకారం.. సుప్రీం కోర్టు జడ్జిలుగా ప్రమాణం చేసిన నిర్ణీత సమయంలోగా తమ ఆస్తుల వివరాలను చీఫ్ జస్టిస్ కు సమర్పించాలి. ఈ వివరాలను కాన్ఫిడెన్షియల్ గా ఉంచాలి. ప్రస్తుతం ఈ తీర్మానాన్ని జడ్జిలు అందరూ ఫాలో అవుతున్నారని సీజేఐ జస్టిస్ రంజన్ గొగొయ్ చెప్పారు.

సీజేఐ ఆస్తుల వివరాలు..

తన పేరుపై ఎలాంటి ఆస్తులు (ఫ్లాట్లు, బిల్డింగులు) లేవని, వెహికిల్స్  కూడా లేవని జస్టిస్ గొగొయ్ చెప్పారు. తాను ఏ బ్యాంకు నుంచి ఎలాంటి లోనూ తీసుకోలేదని స్పష్టం చేశారు.

సీనియర్ జడ్జి జస్టిస్ ఎస్ఏ బాబ్డే కు వారసత్వంగా వచ్చిన రెండు ఆస్తులతో పాటు రెండు బంగారు ఉంగరాలు ఉన్నాయట. ఆయన పేరుతో ఎలాంటి వెహికిల్స్ లేవని జస్టిస్ బాబ్డే చెప్పారు.