ఓన్లీ చర్చలు..నో సస్పెన్షన్స్.. అసెంబ్లీలో నయా ట్రెండ్

ఓన్లీ చర్చలు..నో సస్పెన్షన్స్.. అసెంబ్లీలో నయా ట్రెండ్
  • సమావేశాలను హుందాగా నడుపుతున్న ప్రభుత్వం
  • గతంలో మాదిరి ప్రతిపక్ష సభ్యుల గెంటివేతల్లేవ్
  • అర్ధరాత్రి దాటినా సభ కొనసాగింపు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగుతున్నాయి. గత పదేండ్లలో జరిగిన మాదిరి ప్రతిపక్ష సభ్యులపై సస్పెన్షన్ వేటు వేయడం, మార్షల్స్ తో వాళ్లను బయటకు గెంటించడం లాంటి వాటికి తావులేకుండా.. సమావేశాలను ప్రభుత్వం హుందాగా కొనసాగిస్తున్నది. చర్చలే ప్రధానంగా సభను నడుపుతున్నది. 

ఈ క్రమంలో ఈ నెల 29న ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 3 గంటల వరకు ఏకబిగిన 18 గంటల పాటు సభను కొనసాగించింది. ‘‘గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏ చిన్న అవకాశం దొరికినా సభా నిబంధనలు ఉల్లంఘించారనే నెపంతో ప్రతిపక్ష పార్టీల సభ్యులపై సస్పెన్షన్ వేటు వేసేవారు. ఒకవేళ ఆ సస్పెన్షన్ ను నిరసిస్తూ సభ్యులు బైఠాయిస్తే, బలవంతంగా మార్షల్స్ తో బయటకు పంపించిన సంఘటనలు కూడా జరిగాయి. కానీ గత పదేండ్లకు భిన్నంగా ఇప్పుడు సమావేశాలు జరుగుతున్నాయి” అని లాబీల్లో వివిధ పార్టీల సభ్యులు చర్చించుకుంటున్నారు. సభను హుందాగా నడిపిస్తున్న తీరుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

 సీఎం రేవంత్ చెప్పినట్టే.. 

సభ నుంచి సస్పెండ్ కావాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ సభ్యులు రూల్స్ ఉల్లంఘిస్తున్నా, అధికార పార్టీ సభ్యులు మాత్రం వాళ్లు చర్చలో పాల్గొనేలా చేస్తున్నారు. రాష్ట్రంలో ఎవరి పాలనలో? ఏం జరిగిందో? ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని.. అందుకోసం అందరూ సభలోనే ఉండాలని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ప్రస్తుత అసెంబ్లీ సెషన్ లో అధికార, ప్రతిపక్ష సభ్యులు ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసుకున్నారు. 

వ్యక్తిగత దూషణలకు కూడా దిగారు. ఈ క్రమంలో పలు సందర్భాల్లో బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద నిరసన వ్యక్తం చేశారు. వెల్ లోకి దూసుకెళ్లారు. కానీ అధికార పార్టీ సభ్యులు వాళ్లను ఒప్పించి తిరిగి వాళ్ల సీట్లలో కూర్చోబెట్టి చర్చను కొనసాగిస్తున్నారు. అంతే తప్ప సస్పెన్షన్ వేటు వేయడం లాంటి చర్యలు తీసుకోవడం లేదు. ‘‘మేం బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చెయ్యం. చర్చ నుంచి వారు తప్పించుకోవాలని చూసినా, ఆ అవకాశం ఇవ్వం. బలవంతగానైనా సరే వారిని సభలోనే కూర్చోబెట్టి, వాళ్ల భాగోతాన్ని తెలంగాణ సమాజానికి వివరిస్తం” అని పలు సందర్భాల్లో  సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఆయన చెప్పిన తీరుగానే సభ కొనసాగుతున్నది.