V6 News

వడ్ల స్కామ్ నిందితులు పరారీలో ఉన్నారా..! పట్టుకుంటలేరా..!

వడ్ల స్కామ్ నిందితులు పరారీలో ఉన్నారా..! పట్టుకుంటలేరా..!
  • 21 మంది నిందితుల్లో ఐదుగురు మాత్రమే అరెస్ట్
  • ఫేక్ రైతులను, ట్రక్ షీట్లను సృష్టించి రూ.1.86 కోట్లు కొట్టేశారు 
  • విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ తనిఖీల్లో వెలుగులోకి అక్రమాలు 
  • కొందరు ఆఫీసర్లు, మిగతా నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు 
  • ఎంక్వైరీని పోలీసులు లైట్ తీసుకుంటున్నారని తీవ్ర విమర్శలు

ఫేక్ రైతుల పేరిట ఫేక్ ట్రక్ షీట్లు సృష్టించి ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టిన కేసులో విచారణ ముందుకు కదలట్లేదు. నిందితులు పరారీలో ఉన్నారా..! పోలీసులే పట్టించుకుంటలేరా..! అనే అనుమానాలు వస్తున్నాయి.  ఇటీవల విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ ఆఫీసర్లు చేపట్టిన తనిఖీల్లో సీఎంఆర్ లెక్క తేలకపోవడంతో హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలో వడ్ల స్కామ్ బయటపడిన విషయం తెలిసిందే. గత రబీ సీజన్ లో మిల్లులకు వడ్లు కేటాయించినట్లు రికార్డులు సృష్టించి రూ. 1.86 కోట్లు కొట్టేసినట్టు తేలింది. 

మిల్లరుతో పాటు ఐకేపీ సెంటర్ నిర్వాహకులు, అగ్రికల్చర్ ఆఫీసర్లు, నకిలీ రైతులుగా నమోదైన మొత్తం 21 మందిపై విజిలెన్స్ ఆఫీసర్ల ఫిర్యాదుతో పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. నిందితుల్లో ఐదుగురిని అరెస్ట్ చేశారు. స్కామ్ బయటపడి 20 రోజులైనా ప్రధాన నిందితుడు చిక్కకపోవడం, అగ్రికల్చర్ ఆఫీసర్లపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. నిందితులు పరారీలో ఉన్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. మరోవైపు ఆఫీసర్లు కావాలనే లైట్ తీసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

నకిలీ రైతుల పేరుతో కొట్టేసి.. 

హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని సాంబశివ మినీ మోడ్రన్ రైస్ మిల్ ఓనర్ బెజ్జంకి శ్రీనివాస్ శాయంపేట, కాట్రపల్లి ఐకేపీ సెంటర్ల నిర్వాహకులు, అగ్రికల్చర్ ఆఫీసర్లు, ఓపీఎంఎస్ ప్రైవేటు ట్యాబ్ ఆపరేటర్ సాయంతో 12 మంది ఫేక్ రైతులను సృష్టించారు. వీరు 278 ఎకరాల్లో 8,049 క్వింటాళ్ల వడ్లను పండించినట్లు ఓపీఎంఎస్ లో వివరాలు నమోదు చేయించారు.

వడ్లను కమలాపూర్ లోని సాంబశివ రైస్ మిల్లుకు తరలించినట్లు 27 ఫేక్ ట్రక్ షీట్లు క్రియేట్ చేశారు. వాటి వివరాల ఆధారంగా నకిలీ రైతులుగా చూపినవారి బ్యాంకు ఖాతాల్లో రూ.1,86,63,088 జమ కాగా, వాటిని మిల్లర్ శ్రీనివాస్ డ్రా చేశాడు. అనంతరం డబ్బును నిందితులు వాటాలుగా పంచుకోవడం 
గమనార్హం. 

21 మందిపై క్రిమినల్ కేసులు

ఇటీవల సివిల్ సప్లై విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ ఆఫీసర్ల తనిఖీల్లో  శాయంపేట వడ్ల స్కామ్ బయటపడింది. దీంతో ప్రధాన నిందితుడు మిల్లర్ బెజ్జంకి శ్రీనివాస్ తో పాటు మధ్యవర్తి బండ లలిత, అగ్రికల్చర్ ఆఫీసర్ కె.గంగా జమున, ఏఈవోలు బి.అర్చన, ఎం.సుప్రియ, అగ్రికల్చర్ డిపార్ట్ మెంట్  ఓపీఎంఎస్ ప్రైవేటు ట్యాబ్ ఆపరేటర్ వాంకుడోతు చరణ్, శాయంపేట, కాట్రపల్లి ఐకేపీ సెంటర్ల నిర్వాహకులు బి.హైమావతి, అనిత, నకిలీ రైతులు బెజ్జంకి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు బెజ్జంకి శోభారాణి, శివకుమార్, చందు, పున్నంచారి, వీరి బంధువుల పరిచయస్తులు వడ్లూరి నవత, కల్యాణ్, శ్రీచరణ్, రాజేందర్, వేమునూరి శ్రీనవ్య, శ్రీనివాసచారి, ఉదయలక్ష్మి, చిర్ల నేహసింధు, ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్ సుధాటి రాజేశ్వర్ పై విజిలెన్స్ ఆఫీసర్ల ఫిర్యాదుతో పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. నిందితుల అకౌంట్లలోని రూ.70 లక్షల  ఫ్రీజ్ చేయగా..  క్లెయిమ్ చేసిన రవాణా చార్జీలు రూ.4 లక్షలు రికవరీ చేశారు.

ఆఫీసర్లపై చర్యలేవి..?

స్కామ్ లోని ఐదుగురు కాట్రపల్లి వీవోఏ అనిత, ట్యాబ్ ఆపరేటర్ చరణ్, మధ్యవర్తి బండ లలిత, ప్రైవేటు వ్యక్తులు వడ్లూరి రాజేందర్, శాయంపేట వీవోఏ బలబద్ర హైమావతిని మాత్రమే అరెస్ట్ చేశారు.  స్కామ్ లో కీలకంగా వ్యవహరించిన ఏవో, ఏఈవోలతో పాటు మిగతా నిందితులను అరెస్ట్ చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో ఏ1 నిందితుడు బెజ్జంకి శ్రీనివాస్ ఇతర రాష్ట్రాల్లో తలదాచు కుంటున్నట్లు తెలిసింది.  

అగ్రికల్చర్ ఆఫీసర్లు డ్యూటీ లు చేస్తుండడం గమనార్హం. పోలీస్ ఆఫీసర్లు మాత్రం నిందితులు పరారీలో ఉన్నట్లు చెబుతుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. వడ్ల స్కామ్ నిందితులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.