- ఆధార్ వివరాలు స్వచ్ఛందం.. 8 అంకెలు మాస్కింగ్
- నకిలీలకు చెక్.. ఒరిజినల్ సర్టిఫికెట్ల తనిఖీ
- పట్టభద్రుల ఓటరు నమోదుపై సీఈవో స్పష్టత
హైదరాబాద్, వెలుగు: త్వరలో ఎన్నికలు జరగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటరు నమోదు ప్రక్రియపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) కార్యాలయం గైడ్‌లైన్స్ విడుదల చేసింది. విద్యార్హతలు, అర్హత తేదీలు, దరఖాస్తు విధానం, ధ్రువీకరణపై తరచుగా అడిగే ప్రశ్నలు–సమాధానాల (ఎఫ్‌ఏక్యూ) రూపంలో వివరాలు వెల్లడించింది. ప్రజాప్రాతినిధ్య చట్టం–1950 ప్రకారం ప్రతిసారీ పాత ఓటర్ల జాబితా రద్దవుతుందని, గతంలో ఓటు వేసినవారు సైతం కొత్తగా నమోదు చేసుకోవాలని స్పష్టం చేసింది.
ఈ ఎన్నికల్లో అర్హత కలిగిన పట్టభద్రులకు మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. ఓటరు నమోదుకు 2026 నవంబర్ 1ని క్వాలిఫైయింగ్ డేట్‌గా నిర్ణయించారు. ఈ తేదీకి మూడేండ్ల ముందే.. అంటే 2023 నవంబర్ 1 కంటే ముందుగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ లేదా తత్సమాన డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. స్నాతకోత్సవ తేదీతో సంబంధం లేకుండా మార్కుల మెమో లేదా ప్రొవిజనల్ సర్టిఫికెట్‌లోని ఉత్తీర్ణత తేదీనే పరిగణనలోకి తీసుకుంటారు. 2024లో డిగ్రీ పాసైనవారు అర్హులు కారు. ఉన్నత విద్యార్హతలు ఉన్నవారూ అర్హులే. అయితే సంబంధిత నియోజకవర్గ పరిధిలో నివసిస్తుండాలి. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలోని పట్టభద్రులు ఒక నియోజకవర్గానికి, ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పరిధిలోని వారు మరో నియోజకవర్గానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర జిల్లాల్లో నివసించేవారికి ఈ నియోజకవర్గాల్లో ఓటరు నమోదుకు అవకాశం లేదు.
ఫారం-18తోనే దరఖాస్తు
తెల్ల కాగితాలపై రాసే దరఖాస్తులు చెల్లవని, 2022 ఆగస్టు 1 నుంచి అమల్లో ఉన్న ఫారం–18నే ఉపయోగించాలని సీఈవో కార్యాలయం స్పష్టం చేసింది. 2026 సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. నవంబర్ 25న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించి, డిసెంబర్ 10 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. డిసెంబర్ 30న తుది జాబితా విడుదల చేస్తారు. సుప్రీంకోర్టు, బొంబాయి హైకోర్టు తీర్పుల ఆధారంగా 2016 సెప్టెంబర్ 5న జారీ చేసిన సర్క్యులర్ నంబర్ 37 ప్రకారం ధ్రువీకరణ చేపడతారు. దరఖాస్తుదారులు ఒరిజినల్ సర్టిఫికెట్లను సహాయ ఓటరు నమోదు అధికారులకు (ఏఈఆర్వో) లేదా గెజిటెడ్ అధికారులకు చూపించి, ‘వెరిఫైడ్ విత్ ఒరిజినల్’ అని సంతకం చేయించుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయవాదులు, వైద్యులు తమ సర్వీస్ రికార్డులు లేదా బార్ కౌన్సిల్, మెడికల్ కౌన్సిల్ రికార్డుల కాపీలతో దరఖాస్తు చేయవచ్చు. ఆధార్ నంబర్ ఇవ్వడం తప్పనిసరి కాదు. స్వచ్ఛందంగా ఇస్తే మొదటి ఎనిమిది అంకెలను మాస్క్ చేసి గోప్యత పాటిస్తామని సీఈవో కార్యాలయం తెలిపింది.
ధ్రువీకరణకు పటిష్ట యంత్రాంగం
ఓటర్ల జాబితా రూపకల్పనను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులను నియమించారు. సంబంధిత జిల్లాల కలెక్టర్లు లేదా అదనపు కలెక్టర్లు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులుగా (ఈఆర్వో) వ్యవహరిస్తారు. ఆర్డీవోలు, సబ్ కలెక్టర్లు, తహసీల్దార్లు ఏఈఆర్వోలుగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. దరఖాస్తుల పరిశీలనకు డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులను డిసిగ్నేటెడ్ అధికారులుగా, ఎంపీడీవోలు, ఇతర అధికారులను అదనపు అధికారులుగా నియమించారు. ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌వో) దరఖాస్తుదారుల స్థానిక నివాసాన్ని క్షేత్రస్థాయిలో ధ్రువీకరిస్తారు.
