దోపిడీ దవాఖాన్లకు నోటీసులే తప్ప చర్యల్లేవ్​

దోపిడీ దవాఖాన్లకు నోటీసులే తప్ప చర్యల్లేవ్​
  • హైకోర్టు కోసమే సర్కార్‌‌ స్టంట్లు
  • తాజాగా  64 దవాఖాన్లకు నోటీసులు
  • తప్పు చేసినట్టు తేలితే చర్యలుంటాయన్న డీహెచ్‌
  • ఫస్ట్‌ వేవ్‌లోనూ నోటీసులతోనే సరి
  • అప్పట్లో రెండే హాస్పిటళ్లపై బ్యాన్‌.. ఆ వెంటనే ఎత్తివేత
  • జనం నుంచి లక్షలకు లక్షలు ఫీజులు గుంజుతున్న దవాఖాన్లు

హైదరాబాద్, వెలుగు: కరోనా పేషెంట్లను అడ్డగోలుగా దోచుకుంటున్న ప్రైవేట్, కార్పొరేట్​ హాస్పిటళ్లపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ యాక్షన్ తీసుకోలేదు. తాజాగా ఒకేసారి 64 హాస్పిటళ్లకు నోటీసులు ఇచ్చామంటూ హెల్త్ ఆఫీసర్లు హడావుడి మొదలు పెట్టారు. అయితే ఇదంతా హైకోర్టులో విచారణ కోసమేనన్న విమర్శలు వస్తున్నాయి. అడ్డగోలు చార్జీలు వసూలు చేస్తున్న హాస్పిటళ్లపై తీసుకున్న చర్యలేమిటని హైకోర్టు పదే పదే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే హాస్పిటళ్లకు షోకాజ్ నోటీసులు ఇచ్చినట్టు సమాచారం. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలోనూ సర్కార్ ఇదే తీరుగా వ్యవహరించింది. అప్పుడు ప్రైవేటు హాస్పిటళ్లపై వెయ్యికిపైగా కంప్లైంట్​ నమోదవగా.. సుమారు యాభై హాస్పిటళ్లకు మాత్రమే నోటీసులు ఇచ్చింది.  కానీ, ఒక్క హాస్పిటల్‌పై కూడా సీరియస్ యాక్షన్ తీసుకోలేదు. విరించి, డెక్కన్ హాస్పిటళ్లకు సంబంధించిన రెండు కేసులు మీడియాలో హైలెట్ అవడంతో ఆ రెండు హాస్పిటళ్ల కరోనా ట్రీట్‌మెంట్ పర్మిషన్‌ను రద్దు చేసింది. ఆ తర్వాత కొన్ని రోజులకే వాటి పర్మిషన్‌ను కూడా పునరుద్ధరించారు.  ఆ హాస్పిటళ్లు ఇప్పుడు యథావిధిగా దోపిడీని కొనసాగిస్తున్నాయి. ఆధారాలతో పాటు బాధితులు ఫిర్యాదు చేస్తున్నా ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరని ఆఫీసర్లను ప్రశ్నించగా..  ప్రభుత్వ పెద్దల నుంచి ఉన్న ఆదేశాల మేరకే తాము నడుచుకుంటున్నామని వాళ్లు చెప్తున్నారు. 

సెకండ్​ వేవ్​లో 88 ఫిర్యాదులు
ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా 64 హాస్పిటళ్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. కోఠిలోని తన చాంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డీహెచ్ గురువారం మీడియాతో మాట్లాడారు. సెకండ్‌‌‌‌‌‌‌‌ వేవ్‌‌‌‌‌‌‌‌ మొదలైనప్పటి నుంచి అధిక చార్జీలు వేస్తున్న 64 హాస్పిటళ్లపై మొత్తం 88 ఫిర్యాదులు వచ్చాయని ఆయన తెలిపారు. ఈ ఫిర్యాదుల్లో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు సంబంధించి 39, మేడ్చల్‌‌‌‌‌‌‌‌కు సంబంధించి 22, రంగారెడ్డికి సంబంధించి 15, వరంగల్ అర్బన్‌‌‌‌‌‌‌‌కు సంబంధించి  7, సంగారెడ్డికి సంబంధించి  2, మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్, నిజామాబాద్, యాదాద్రి జిల్లాకు సంబంధించి ఒక్కోటి చొప్పున ఉన్నాయన్నారు. అత్యధికంగా హైదరాబాద్ కూకట్ పల్లిలోని ఓ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌పై 6 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఈ 64 హాస్పిటళ్లకు నోటీసులు ఇచ్చామని, 48 గంటల్లోగా వివరణ అడిగామని చెప్పారు. ఆ వివరణ, తదుపరి విచారణ ఆధారంగా నిబంధనలు అతిక్రమించినట్టు తేలిన హాస్పిటళ్లపై చర్యలు తీసుకుంటామన్నారు. గతంలోనే మూడు హాస్పిటళ్లకు షోకాజ్​ నోటీసులు ఇచ్చామన్నారు. ఇంకా ఎవరైనా ఫిర్యాదు చేయాలనుకుంటే, 915417960 నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వాట్సప్ చేయాలని డీహెచ్ సూచించారు.

జగిత్యాలలో హెచ్ఆర్​సీ నోటీసులు 
జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన ఫర్జానా అనే మహిళకు కరోనా సోకడంతో వారం కింద జిల్లా కేంద్రం లోని సూర్య హాస్పిటల్​లో అడ్మిట్​చేశారు. 4 రోజుల ట్రీట్​మెంట్​కు రూ. 1.06 లక్షలు బిల్లు వేయడంతో, రూల్స్​కు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని హెల్త్​ ఆఫీసర్లకు ఆమె కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. కానీ హెల్త్​ డిపార్ట్​మెంట్​ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో సామాజిక కార్యకర్త మీర్ ఖాజీ అలీ అధిక ఫీజులపై హెచ్​ఆర్​సీలో ఫిర్యాదు చేయగా.. బుధవారం సదరు ఆస్పత్రికి హెచ్​ఆర్​సీ నోటీసులు జారీ చేసింది.

సెకండ్‌ వేవ్‌ మొదలైనప్పటి నుంచి అధిక చార్జీలు వేస్తున్న 64 హాస్పిటళ్లపై మొత్తం 88 ఫిర్యాదులు వచ్చాయి. ఈ 64 హాస్పిటళ్లకు నోటీసులు ఇచ్చాం. 48 గంటల్లోగా వివరణ అడిగాం. విచారణలో రూల్స్​అతిక్రమించినట్టు తేలితే హాస్పిటళ్లపై చర్యలు తీసుకుంటాం.  
- శ్రీనివాసరావు, పబ్లిక్​ హెల్త్​ డైరెక్టర్​