
- అది ప్రభుత్వ చేతుల్లో లేదని సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం
- యెమెన్‌లో రేపే నిమిషకు ఉరి అమలు
న్యూఢిల్లీ:యెమెన్‌లో ఉరి శిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిషా ప్రియాను కాపాడడం తమ చేతుల్లోలేదని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. జులై 16న ఆమెకు ఉరిశిక్ష అమలు చేయనున్నట్టు సమాచారం. యెమెన్‌లో 2017లో తన వ్యాపార భాగస్వామి తలాల్ అబ్దో మహ్దీని హత్య కేసులో నిమిషా ప్రియ మరణ శిక్ష ఎదుర్కొంటోంది.
బ్లడ్ మనీ చెల్లించడం ద్వారా ఆమెను కాపాడే చాన్స్ ఉన్నప్పటికీ యెమెన్‌లోని సంక్లిష్ట రాజకీయ పరిస్థితుల వల్ల అది సాధ్యం కాకపోవచ్చని కేంద్రం వెల్లడించింది. ఆమె మరణశిక్షను కేంద్ర ప్రభుత్వం ఆపాలంటూ దాఖలైన పిటిషిన్పై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి వాదిస్తూ.. అక్కడి పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతం భారత్ చేయగలిగింది చాలా తక్కువని తెలిపారు.
‘‘మేం ఆమెను కాపాడేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నం. కానీ, యెమెన్ పరిస్థితులు సంక్లిష్టంగా ఉన్నాయి. భారత్‌కు ఒక పరిమితి ఉంది’’ అని ఆయన వెల్లడించారు. యెమెన్‌లోని కొంతమంది ప్రభావశీల షేక్‌లతో మాట్లాడినట్లు, శిక్షను తాత్కాలికంగా నిలిపివేయాలని అక్కడి పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు రాసినట్లు ఆయన చెప్పారు.
అయితే నిమిష తరపు వాదిస్తున్న ‘‘సేవ్ నిమిషా ప్రియా – ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్’’ అడ్వకేట్.. మరణ శిక్ష తప్పించడానికి బ్లడ్ మనీ ఒక్కటే మార్గమని తెలిపారు. ‘‘ప్రభుత్వాన్ని డబ్బు అడగడం లేదు. బ్లడ్ మనీని మేమే సమకూర్చుకుంటాం’’ అని న్యాయవాది చెప్పారు. వాదనలు విన్న సుప్రీంకోర్టు ఈ కేసును జులై 18కి వాయిదా వేసింది.