మోదీ సిస్టమ్ తో లబ్ధి కొందరికే : రాహుల్ గాంధీ

మోదీ సిస్టమ్ తో లబ్ధి కొందరికే : రాహుల్ గాంధీ

రాయ్‌‌పూర్: దేశంలో ప్రస్తుతమున్న సిస్టమ్ వల్ల కొంతమంది మాత్రమే లబ్ధి పొందుతున్నారని..మరికొందరు జీఎస్టీ చెల్లించి ఆకలితో చనిపోతున్నారని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపిన వారిని ఈడీ, సీబీఐ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలతో భయపెడుతున్నారని మండిపడ్డారు. భారత్​ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా మంగళవారం ఆయన చత్తీస్‌‌గఢ్‌‌లోని సుర్గుజా జిల్లా ఉదయపూర్ చేరుకున్నారు. రామ్‌‌గఢ్ చౌక్‌‌లో నిర్వహించిన సభలో ప్రసంగించారు. " ప్రజలారా మీరు రోజుకు మూడుసార్లు ఒక ప్రశ్న వేసుకోవాలి. దేశ ఖజానా నుంచి ప్రతిరోజు మీకు ఎంత డబ్బు వస్తోంది?  రోజంతా కష్టపడి పనిచేస్తే మీకొచ్చేదెంత? మోదీ నాయకత్వం వహిస్తున్న ఈ సిస్టమ్ మిమ్మల్ని మోసం చేస్తున్నది. మోదీ వ్యవస్థలో కేవలం 1000 నుంచి -2000 మంది మాత్రమే లబ్ధి పొందుతున్నారు. మిగిలిన 73% మంది పన్నులు చెల్లిస్తూ ఆకలితో చనిపోతున్నారు.

ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నరు..

 ప్రస్తుతం ఉన్న సిస్టమ్ వల్ల  ప్రజలు ఎలా బాధలను అనుభవిస్తున్నారో  రాహుల్ ఓ ఉదాహరణతో  చెప్పారు. అందుకు ఓ వ్యక్తిని తన వెహికల్ పైకి పిలిపించుకుని పక్కన నిలబెట్టుకున్నారు. "ఈ వ్యక్తి మార్కెట్‌‌కి వెళ్లినప్పుడు.. ముగ్గురు దొంగలు అతని పర్సును దొంగిలించాలని నిర్ణయించుకున్నారు. అందుకు ఫస్ట్ ఏమి చేయాలి. మొదటి దొంగ వెళ్లి వ్యక్తి దృష్టిని మరల్చివేస్తాడు. ఇంతలో మరో దొంగ వచ్చి పర్సును దొంగిలిస్తాడు. అతను తన పర్సుపోయిందని అరిస్తే మూడో దొంగ వచ్చి రెండు చెంపదెబ్బలు కొడతాడు. ఇప్పుడు దేశంలో ఇదే జరుగుతున్నది. ప్రజలను మోదీ సర్కార్ పక్కదోవ పట్టిస్తున్నది. జీఎస్టీ వంటి వాటితో దోచుకుంటున్నది. ప్రశ్నిస్తే సీబీఐ, ఐటీ, ఈడీలతో బెదిరింపులకు పాల్పడుతున్నది" అని రాహుల్ పేర్కొన్నారు.