
- రూ.10 లక్షలతో ఏర్పాటు చేసిన పరికరాలు
- సద్వినియోగం చేసుకుంటున్న ప్రజలు
- స్థానిక ఎలక్షన్ల నేపథ్యంలో ప్రధాన కూడళ్లలో ఏర్పాటుకు నేతల సమాలోచనలు
ములుగు, వెలుగు : ప్రజారోగ్యం కోసం ములుగు జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేశారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో తొలుత మంత్రి క్యాంప్ ఆఫీస్ ఎదుట ప్రారంభించగా, మరోటి ములుగు శివారులోని తోగుంట కట్టపై ప్రారంభించారు. ఈ జిమ్‌ల కోసం రూ.10 లక్షలు కేటాయించి వ్యాయామానికి అవసరమైన పరికరాలను ఏర్పాటు చేశారు. పులప్స్, హ్యాండ్స్‌ఫ్రీ, లెగ్ ఫ్రీ, హ్యాండ్ పుష్వంటి పరికరాలను ఏర్పాటు చేయగా, నిత్యం యువత, వృద్ధులు, చిన్నారులు ఇక్కడకు వచ్చి వ్యాయామం చేస్తున్నారు.
ఆరోగ్యంపై అవగాహన..
ఆహారపు అలవాట్లతో భారీగా బరువు పెరిగి బీపీ, షుగర్ తదితర రోగాలు వస్తున్నట్లు ఆరోగ్య శాఖ ఇచ్చిన రిపోర్టుల ప్రకారం తెలుస్తోంది. 2020లో వచ్చిన కరోనా పుణ్యమాని ప్రతీ ఒక్కరికీ ఆరోగ్యంపై కొంత అవగాహన పెరిగింది. అందులో భాగంగా ప్రతీరోజు వాకింగ్ కి ప్రాముఖ్యత ఇస్తున్నారు. మహిళలు సైతం గ్రూపులుగా వాకింగ్‌కు వెళ్తున్నారు.
ములుగు జిల్లా కేంద్రంలో ప్రతీ రోజు బండారుపల్లి, పత్తిపల్లి, మదనపల్లి రోడ్లలో వాకింగ్వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఓపెన్జిమ్లు వారికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని ప్రజలు చెబుతున్నారు.
ఎన్నికల వ్యూహంలో ఓపెన్ జిమ్‌లు..
ములుగు నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో ప్రధాన కూడళ్ల వద్ద ఓపెన్ జిమ్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు అధికార పార్టీ నేతలతోపాటు ప్రతిపక్ష పార్టీలు సైతం ఆలోచిస్తున్నాయి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ముఖ్యంగా యువతను ఆకర్షించేందుకు ఈ వ్యూహం పన్నుతున్నట్లు తెలుస్తోంది. ఒక్కో జిమ్‌సెంటర్ ఏర్పాటుకు రూ.5 లక్షల మేర ఖర్చు కానుండగా, ఎక్కువ మంది యువత ఎక్కడ ఉన్నారో ఆ గ్రామానికి ప్రయారిటీ ఇచ్చేందుకు నేతలు ఆలోచిస్తున్నారు. నియోజకవర్గంలో 10 మండలాలు ఉండగా, ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల ఆశావహులు జిమ్‌ల ఏర్పాటు ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఓపెన్జిమ్లతో ఎంతో ఉపయోగం..
ములుగులో ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. బరువు పెరిగి అనారోగ్య కారణాలతో ఇబ్బందులు పడుతున్న వారికి వీటి ద్వారా ఉపశమనం కలుగుతుంది. ప్రతీ రోజు సుమారు 150 మంది తంగేడు స్టేడియంలో వాకింగ్చేసి, తర్వాత జిమ్వద్ద 20 నిమిషాలు పాటు వ్యాయామం చేస్తున్నారు. పిల్లలతో కలిసి కుటుంబ సమేతంగా వచ్చి సేఫ్ గా వ్యాయామం చేసి వెళ్లేందుకు చేసిన ఏర్పాట్లు బాగున్నాయి. తాగునీటి వసతి ఏర్పాటు చేస్తే సౌకర్యంగా ఉంటుంది. జిల్లాలో మరిన్ని జిమ్ సెంటర్లు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. - అంగోతు రాజు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ములుగు