హంతకులకు కూడా అప్పీల్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది:వార్నర్

హంతకులకు కూడా అప్పీల్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది:వార్నర్

క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు తీరుపై ఆ జట్టు ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఆవేదన వ్యక్తం చేశాడు. బాల్ ట్యాంపరింగ్ అంశంలో  కెప్టెన్ కాకుండా తనపై విధించిన జీవితకాల నిషేధం అన్యాయమని  వార్నర్ అన్నాడు. తాను క్రిమినల్ కాదని..హంతకులకు కూడా అప్పీల్ చేసుకునే ఛాన్స్ ఉంటుందని అసహనం వ్యక్తం చేశాడు. తనపై విధించిన జీవితకాల కెప్టెన్సీ నిషేధాన్ని తొలగించాలని చాలా సార్లు క్రికెట్ ఆస్ట్రేలియాను కోరినట్లు వార్నర్ వెల్లడించాడు. ఈ విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా  జాప్యం చేస్తోందన్నాడు. ఏదో ఒక స్టేజీ దాటిన ప్రతీ ఒక్కరికీ అప్పీలు చేసుకునే అవకాశం ఉండాలన్నాడు. చేసిన తప్పుకు కొంతకాలం పాటు నిషేధం విధిస్తే తప్పులేదని..అయితే జీవితకాలం కెప్టెన్సీకు దూరం చేయడం సరైంది కాదన్నాడు. చాలా రోజుల నుంచి తనపై విధించిన బ్యాన్ ఎత్తివేస్తారని ఎదురుచూస్తున్నట్లు వార్నర్ చెప్పుకొచ్చాడు.

కెప్టెన్సీ దక్కుతుందని ఆశించా.. కానీ

బాల్ టాంపరింగ్ అనేది తనతో పాటు..తన కుటుంబానికి చాలా కష్టంగా ఉందని వార్నర్ తెలిపాడు. గతంలో జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు మరోసారి చెప్పాల్సిన పనిలేదన్నాడు. అయితే 2018లో జరిగిన దాన్ని సాకుగా చూపించి కెప్టెన్సీకి అర్హుడు కాదని చెప్పడం సరికాదన్నాడు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలోనే తనపై నిషేధం ఎత్తేస్తారని అనుకున్నానని..అయితే అలా జరగలేదన్నాడు. ఫించ్ రిటైర్ అయ్యాక..కెప్టెన్సీ దక్కుతుందని ఆశించానన్నాడు. కానీ అప్పుడు కూడా నిరాశే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశాడు. 

అప్పీలకు అవకాశం...

ఈ ఏడాది సెప్టెంబర్ లో న్యూజిలాండ్ తో సిరీస్ అనంతరం ఆరోన్ ఫించ్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ సమయంలో వార్నర్‌కే వన్డే నాయకత్వ బాధ్యతలు దక్కుతాయని అంతా అనుకున్నారు. కానీ వార్నర్ కు షాకిస్తూ... క్రికెట్ ఆస్ట్రేలియా ప్యాట్ కమ్మిన్స్‌కి వన్డే కెప్టెన్సీని అప్పగించింది. అయితే తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా వార్నర్‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసే ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తోంది.  వార్నర్‌కే వన్డే కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వాలని ఆ దేశ మాజీలతో పాటు..ఇతర మాజీ క్రికెటర్లు సూచించడంతో....క్రికెట్ ఆస్ట్రేలియా ఆ దిశగా అడుగులు వేస్తోంది. జీవిత కాల నిషేధంపై  ముగ్గురు సభ్యుల ప్యానెల్‌కు వార్నర్ అప్పీల్ చేసుకునే అవకాశం కల్పిస్తూ సీఏ తాజాగా నిర్ణయం తీసుకుంది. 

2018లో బాల్ టాంపరింగ్..

2018లో  సౌతాఫ్రికా పర్యటనలో యువ క్రికెటర్ బెన్ క్రాఫ్ట్‌తో కలిసి వార్నర్, అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్ బాల్ ట్యాంపరింగ్‌ పాల్పడ్డారు. ఈ అంశం ప్రపంచ క్రికెట్ లో ఆస్ట్రేలియాకు మాయని మచ్చగా నిలిచిపోయింది. ప్రపంచ క్రికెట్ ముందు ఆస్ట్రేలియాను చీటర్స్‌గా నిలబెట్టింది. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా వార్నర్, స్మిత్, బెన్ క్రాఫ్ట్ పై కఠిన చర్యలు తీసుకుంది. ఓ ఏడాది పాటు పూర్తిగా క్రికెట్ నుంచి నిషేధించింది. దీనికి  ప్రధాన కారకుడైన వార్నర్‌ ను.. కెప్టెన్ కాకుండా జీవితం కాలం నిషేధం విధించింది.