
- ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆపరేషన్ హరీశ్
- కాంగ్రెస్ లీడర్ల దూకుడుతో రంగంలోకి దింపిన బీఆర్ఎస్ హైకమాండ్
- కాంగ్రెస్ బలంగా ఉండడంతో స్పెషల్ ఫోకస్
- కొద్దిరోజులుగా అభివృద్ధి కార్యక్రమాలు, ఆత్మీయ సమ్మేళనాల్లో ఫైనాన్స్ మినిస్టర్
- మిర్యాలగూడ, హుజూర్నగర్మీటింగుల్లో కాంగ్రెస్ నేతలపై ఎటాక్
- ‘అభివృద్ధి అస్త్రం’ తో ముందుకెళ్లాలని గులాబీ లీడర్లు, క్యాడర్‌కు పిలుపు
నల్గొండ, వెలుగు : ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ దూకుడును అడ్డుకునేందుకు బీఆర్ఎస్ హైకమాండ్ ‘ఆపరేషన్ హరీశ్’ కార్యక్రమాన్ని షురూ చేసింది. కొద్దిరోజులుగా అభివృద్ధి కార్యక్రమాలు, ఆత్మీయ సమ్మేళనాలతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పర్యటించిన ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి టి. హరీశ్‌రావు ఫోకస్ ఇప్పుడు నల్గొండ జిల్లాపై పడింది. శుక్రవారం మిర్యాలగూడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో జరిగిన ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్న మంత్రి హరీశ్ కాంగ్రెస్ లక్ష్యంగా ఎదురుదాడికి దిగారు. నల్గొండలో రేవంత్ రెడ్డి నిరుద్యోగ సభ, ఆలేరు, భువనగిరిలో భట్టి విక్రమార్క పాదయాత్ర సక్సెస్ కావడంతో కాంగ్రెస్ క్యాడర్లో జోష్ పెరిగింది. దీనికి కర్నాటక ఎన్నికల ఫలితాలు తోడవడంతో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ సీనియర్లు ఎన్నికల ప్రచారాన్ని స్పీడప్ చేశారు.
ముఖ్యంగా ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి వచ్చే ఎన్నికల్లో 12 సీట్లు గెలుస్తామని చాలెంజ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వైఖరి వల్ల ఉమ్మడి జిల్లాలో పార్టీ బలహీన పడిందని, దాంతోనే కాంగ్రెస్ సీనియర్లు కామెంట్లు చేస్తున్నారని బీఆర్ఎస్ హైకమాండ్ భావించింది. ఫలానా ఎమ్మెల్యే ఓడిపోతడు.. వచ్చే ఎన్నికల్లో టికెట్ కష్టమంటూ సర్వేల పేరిట సోషల్ సోషల్ మీడియాలో పోస్టులు చక్కర్లు కొడ్తున్నాయి. పైగా ఎమ్మెల్యేలపై పార్టీ క్యాడర్లో, ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోవడంతోనే కాంగ్రెస్ లీడర్లు దూకుడు పెంచారని పసిగట్టిన ఇంటెలిజెన్స్ వర్గాలు ఆ మేరకు హైకమాండ్‌కు రిపోర్ట్ పంపాయి. ఈ పరిణామాలతో హరీశ్‌రావును పార్టీ అధిష్ఠానం రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది.
అభివృద్ధి అస్త్రాన్ని ప్రయోగించండి..
అభివృద్ధి అస్త్రాన్ని ప్రయోగించి కాంగ్రెస్ నాయకులపైన ఎదురుదాడికి దిగాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పదేండ్ల పాలనలో, బీఆర్ఎస్ తొమ్మిదేండ్ల పాలనలో జరిగిన అభివృద్ధి తేడాను ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి వివరించారు. ఉత్తమ్, కోమటిరెడ్డి, జానారెడ్డి హయాంలో కనీసం బత్తాయి, నిమ్మ మార్కెట్లు కూడా ఏర్పాటు చేసుకోలేకపోయారని, కానీ బీఆర్ఎస్ వచ్చాక నల్గొండలో బత్తాయి, నకిరేకల్‌లో నిమ్మ మార్కె ట్లు ఓపెన్ చేయడంతో పాటు వేల కోట్ల రూపాయలతో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలు చేపట్టినట్లు చెప్పారు. రాష్ట్రంలో కేసీఆర్ 24 గంటలు కరెంట్ ఇస్తే నిజంగా చమత్కారమేనని అసెంబ్లీలో జానారెడ్డి చేసిన వ్యాఖ్యలను హరీశ్‌రావు ఈ సందర్భంగా ప్రస్తావించారు. పార్టీలో నెలకొన్న భేదాభిప్రాయాలను పక్కన పెట్టి వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
మంత్రి జగదీశ్ రెడ్డితో జాయింట్ ఆపరేషన్...
హరీశ్‌రావు ఎంట్రీ ఇవ్వడంతో బీఆర్ఎస్ ఎన్నికల స్ట్రాటజీ మారినట్లు కనిపిస్తోంది. రాబోయే రెండు, మూడు నెలల్లో వరుసగా కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటనలు కూడా ఉంటాయని ఎమ్మెల్యేలు చెప్తున్నారు. పార్టీ గెలుపు బాధ్యతలు మాత్రం జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి, హరీశ్‌రావు జాయింట్ ఆపరేషన్‌లో జరిగే చాన్స్ ఉంది. హుజూర్నగర్, నాగార్జున సాగర్, మునుగోడు ఉప ఎన్నికల ఇన్చార్జిగా మంత్రి జగదీశ్ రెడ్డి వ్యవహరించారు. కానీ ఈసారి ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ బలపడే అవకాశం ఉందని సర్వేలు చెప్తున్నాయి. దీంతో అసెంబ్లీ ఎన్నికల బాధ్యతలు జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డికి తోడుగా, హరీశ్‌రావుకు అప్పగించ వచ్చని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మిర్యాలగూడ సభలో ఇద్దరు మంత్రులు కాంగ్రెస్ సీనియర్లపై తీవ్రస్థాయిలో చేసిన ఆరోపణలు దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.
కాంగ్రెస్ కరిగిపోయిన మంచుకొండని.. జిల్లా చరిత్రలో 12 స్థానాలు గెలిచిన పార్టీ ఏదీ లేదని, టీడీపీ, కాంగ్రెస్ సైతం ఆరు స్థానాలకే పరిమితమయ్యాయని చెప్పిన మంత్రి.. వచ్చే ఎన్నికల్లో మరోసారి ప్రజల్ని మోసం చేసేందుకు తండ్రి, కొడుకులు, భార్య,భర్తలు, అన్నదమ్ములు సిద్ధమయ్యారని ఎద్దేవా చేశారు. తమ ఎమ్మెల్యేలు రోజుకూ 1 8 గంటలు ప్రజల కోసం కష్టపడుతుంటే, ఆనాడు కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్‌కే పరిమితమయ్యారు తప్పా ఏనాడు ప్రజల మధ్యలో లేరని మంత్రి జగదీశ్ రెడ్డి కాంగ్రెస్ నేతల పైన ఫైర్ అయ్యారు.