హైదరాబాద్‎లో ‘ఆపరేషన్ కవచ్’.. అర్థరాత్రి సిటీలో 5 వేల మంది పోలీసుల తనిఖీలు

హైదరాబాద్‎లో ‘ఆపరేషన్ కవచ్’.. అర్థరాత్రి సిటీలో 5 వేల మంది పోలీసుల తనిఖీలు

బషీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాగ్, వెలుగు: హైదరాబాద్ నగర భద్రతను పటిష్టం చేయడంతోపాటు, అసాంఘిక శక్తుల కదలికలను ముందస్తుగా నిరోధించే లక్ష్యంతో సిటీ పోలీసులు శుక్రవారం రాత్రి ఆపరేషన్ కవచ్ పేరుతో ముమ్మర తనిఖీలు చేపట్టారు. 5 వేల మంది సిబ్బంది రాత్రి 11 గంటల నుంచి 1 గంట వరకు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మొత్తం 562 హోటళ్లు, లాడ్జీల్లో సోదాలు నిర్వహించారు. హోటళ్లలో రిజిస్టర్లను పరిశీలించి, బస చేయడానికి వచ్చిన విజిటర్ల గుర్తింపు కార్డులను తనిఖీ చేస్తున్నారా లేదా అని తెలుసుకున్నారు. 

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ.సజ్జనార్ దగ్గరుండి పర్యవేక్షించారు. నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని, అమీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేటలోని పలు లాడ్జీలకు వెళ్లి, గదుల కేటాయింపు ప్రక్రియ, విజిటర్ల వివరాల నమోదు తదితర అంశాలపై ఆరా తీశారు. పలువురు విజిటర్లతో మాట్లాడి, ఏ ప్రాంతం నుంచి వచ్చారు, రావడానికి గల కారణాలు అడిగారు. 

జోన్ల వారీగా లాడ్జీలు, హోటళ్లు..

జోన్ల వారీగా తనిఖీలు జరిగిన లాడ్జీలు, హోటళ్ల వివరాలు చూస్తే.. అత్యధికంగా ఖైరతాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 119, శంషాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 92, జూబ్లీహిల్స్, గోల్కొండలలో 86 చొప్పున, సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 82, రాజేంద్రనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 53, చార్మినార్ జోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 44 చోట్ల ఈ ఆపరేషన్ కొనసాగింది. నిర్వాహకులు నిబంధనలు పాటించాలని, సీసీ కెమెరాలు నిరంతరం పని చేసేలా చూసుకోవాలని సీపీ సజ్జనార్ సూచించారు.

అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడమే ఈ తనిఖీల ఉద్దేశమని తెలిపారు. లాడ్జీకి వచ్చే ప్రతి ఒక్కరి నుంచి గుర్తింపు కార్డుల ఒరిజనల్ ప్రతిని పరిశీలించి, దాని స్పష్టమైన జిరాక్స్ కాపీని తీసుకోవాలన్నారు. రిజిస్టర్లలో విజిటర్ల పూర్తి సమాచారం, ఫోన్ నంబర్లు, చెక్ ఇన్, చెక్ అవుట్ సమయాలను కచ్చితంగా నమోదు చేయాలని చెప్పారు. మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ గదులను ఇవ్వొద్దని, గుర్తింపు కార్డుల్లో ఉన్న వయసును ధ్రువీకరించుకోవాలన్నారు. 

త్వరలో నూతన డిజిటల్ విజిటర్ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ సిస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. రూల్స్​పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏసీపీ క్రైమ్స్ శ్రీనివాసులు, ఏసీపీ లా అండ్ ఆర్డర్ తఫ్షీర్ ఇక్బాల్, జాయింట్ సీపీ ట్రాఫిక్ జోయల్ డేవిస్, జాయింట్ సీపీ లా అండ్ ఆర్డర్ నార్త్ జోన్ శ్వేత, డీసీపీ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ వెంకటేశ్వర్లు, డీసీపీ క్రైమ్స్ చైతన్య కుమార్ తదితరులు పాల్గొన్నారు.