
న్యూఢిల్లీ: ఇండియా రక్షణ వ్యవస్థను మరింత మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ అన్నారు. ఇయ్యాల్టి యుద్ధాలను.. నిన్నటి ఆయుధాలతో జయించలేమని తెలిపారు. బలగాలకు అత్యాధునిక ఆయుధాలు, డిఫెన్స్ సిస్టమ్స్ అందించాలన్నారు.
రేపటి టెక్నాలజీని వినియోగించి ఇయ్యాల్టి యుద్ధ రంగంలో పోరాడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఢిల్లీలోని మనేక్షా సెంటర్లో యూఏవీ, కౌంటర్ అన్ మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్‌పై బుధవారం నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. వ్యూహాత్మక మిషన్ల విషయంలో విదేశాలపై ఆధారపడటం తగ్గించుకోవాలని సూచించారు.
►ALSO READ | జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరించాలె..రాహుల్ గాంధీ
ఆపరేషన్ సిందూర్ గురించి ఆయన ప్రస్తావించారు. ‘‘పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లు, ఆయుధాలను మన అధునాతన రక్షణ వ్యవస్థలతో గాల్లోనే కూల్చేశాం. విదేశీ డ్రోన్, కౌంటర్ – డ్రోన్ టెక్నాలజీపై ఆధారపడటం మనల్ని బలహీనంగా మార్చేస్తుంది. విదేశీ టెక్నాలజీలకు సంబంధించిన స్పెసిఫికేషన్స్ శత్రువులకు తెలిసే అవకాశం ఉంది. ఇది ఇండియాను దెబ్బతీస్తుంది’’ అని అనిల్ చౌహాన్ అన్నారు.