
- లడఖ్‌ను 6వ షెడ్యూల్ చేర్చండి
- ప్రధానికి ఖర్గే, రాహుల్ లేఖ
- ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్
న్యూఢిల్లీ:జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బుధవారం ఉమ్మడిగా లేఖ రాశారు. రానున్న వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో దీనికి సంబంధించి చట్టం చేయాలని కోరారు. అదేవిధంగా లడఖ్‌ను రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ కింద చేరుస్తూ చట్టం తీసుకురావాలని అన్నారు.
జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఐదేండ్లుగా తమ రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కోరుతూ డిమాండ్ చేస్తున్నారని లేఖలో ప్రస్తావించారు. జమ్మూ, లడఖ్ ప్రజల డిమాండ్ రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్య హక్కులకు అనుగుణంగా ఉందని వారు పేర్కొన్నారు. గతంలో కేంద్ర పాలిత ప్రాంతాలకు రాష్ట్ర హోదా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు. జమ్మూ కాశ్మీర్ విషయంలో మాత్రం ఆలస్యం చేస్తున్నారని చెప్పారు. ఇతర కేంద్ర పాలిత ప్రాంతాల విభజన సమయంలో ఇలా ఎప్పుడూ జరగలేదన్నారు.
వీలైనంత త్వరగా జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని ఆర్టికల్ 370 రద్దు సందర్భంగా సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం తెలిపిందని గుర్తు చేశారు. ‘‘2024, మే 19న ఓ ఇంటర్వ్యూలో మీరు (మోదీ) రాష్ట్ర హోదా పునరుద్ధరణపై హామీ ఇచ్చారు. 2024, సెప్టెంబర్ 19న శ్రీనగర్‌లో నిర్వహించిన ర్యాలీలోనూ ఇదే ప్రస్తావించారు. పలు సభలు, సమావేశాల్లోనూ ప్రామిస్ చేశారు. ఇచ్చిన హామీని మీరు నెరవేర్చాలి. రానున్న వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే చట్టం చేయాలి.
జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రజలకు న్యాయం చేయాలి’’అని లేఖలో ఖర్గే, రాహుల్ పేర్కొన్నారు. లడఖ్‌ను 6వ షెడ్యూల్ కింద చేరిస్తే.. గిరిజన ప్రాంతాల అడ్మినిస్ట్రేషన్‌కు సంబంధించిన నిబంధనలను కలిగి ఉంటుందని తెలిపారు. ఇది లడఖ్ ప్రజల సాంస్కృతిక, అభివృద్ధి, రాజకీయ ఆకాంక్షలను నెరవేర్చడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అదేవిధంగా, వారి హక్కులు, భూమి, గుర్తింపును కాపాడుతుందన్నారు. కాగా, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ అస్సాం పర్యటనలో ఉన్నారు.
గువాహటిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సమావేశం అయ్యారు. పార్టీ బలోపేతంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీ, పీసీసీ ఆఫీస్ బేరర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ ప్రెసిడెంట్లు ఈ భేటీకి హాజరైనట్లు కాంగ్రెస్ స్టేట్ చీఫ్ గౌరవ్ గొగొయ్ తెలిపారు. గిరిజనులతో రాహుల్, ఖర్గే భేటీ అయ్యారని, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు. హింస, అడవి నుంచి వెళ్లగొట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలను రాహుల్, ఖర్గేకు గిరిజనులు వివరించారన్నారు.
మృతురాలి కుటుంబానికి అండగా ఉంటాం..
ఒడిశాలో ఒంటికి నిప్పటించుకుని ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడుతామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. అమ్మాయి తండ్రితో బుధవారం ఫోన్లో మాట్లాడినట్లు సోషల్ మీడియా వేదికగా రాహుల్ తెలిపారు.