
- మీరొస్తే ఇంకా అద్భుతాలు చేద్దాం
- జహీరాబాద్ సభలో సీఎం రేవంత్ రెడ్డి
సంగారెడ్డి/జహీరాబాద్: ప్రతిపక్ష రాజకీయ నాయకుడు కేసీఆర్ అసెంబ్లీకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తన 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని తమకు చెప్పాలన్నారు. పదవి ఉంటేనే వస్తా అంటే ఎలా? అని ప్రశ్నించారు. ఇవాళ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. బీఆర్ఎస్ ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి.. తన ఇంట్లో మాత్రం ఉద్యోగాలు ఇచ్చుకొని నిరుద్యోగులను ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశామని సీఎం అన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ప్రధాన మంత్రిని ఎన్ని సార్లయినా కలుస్తామని చెప్పారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేస్తామని, మిగతా వేళల్లో అందరినీ కలుపుకొని పోతామని చెప్పారు.
ALSO READ | సైలెంట్ మోడ్! కవిత లేఖపై బీఆర్ ఎస్ నేతల మౌనం ఎందుకో!
కేసీఆర్ అసెంబ్లీకి రావాలని సీఎం పునరుద్ఘాటించారు. శాసన సభలో ప్రజా సమస్యలపై చర్చించాలని అన్నారు. తాము ఏదైనా తప్పను చేస్తే సూచనలు, సలహాలు ఇవ్వాలని సరిదిద్దుకుంటామని అన్నారు. అధికారంలో ఉంటేనే అసెంబ్లీకి వస్తామని అనుకుంటే ప్రజలు మరోమారు బుద్ధి చెబుతారని అన్నారు. ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజల్లో ఉండాలని సూచించారు. గెలించినా ఓడినా తాను ఎప్పుడూ ప్రజల్లోనే ఉన్నానని అన్నారు.
సీఎం అయ్యాక కూడా తాను ఏనాడూ అహంభావాన్ని ప్రదర్శించలేదని చెప్పారు. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరినీ కలుస్తూనే ఉన్నానని అన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నామని సీఎం చెప్పారు.
నిమ్జ్ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇండ్లు
నిమ్జ్ నిర్మాణంలో భూములు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నిర్వాసితులైన 5612 కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ఈ వేదిక నుంచి ప్రకటిస్తున్నట్టు సీఎం చెప్పారు. నిర్వాసిత కుటుంబాలకు భోజనాలు పెట్టి ఇండ్ల పట్టాలు ఇచ్చే బాధ్యత జగ్గారెడ్డికి అప్పగిస్తున్నామని చెప్పారు. ఇండ్లు మంజూరు చేసేందుకు అవసరమైన కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశిస్తున్నానని సీఎం చెప్పారు. జహీరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని తెలిపారు.