విపక్షాలే లక్ష్యంగా ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు

విపక్షాలే లక్ష్యంగా ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు

దేశవ్యాప్తంగా ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా  చేసుకొని ఎన్ఫోర్స్మెంట్  డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ, ఐటీ శాఖ పనిచేస్తున్నాయని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఈ దర్యాప్తు సంస్థలు కేవలం విపక్ష నాయకులపైనే దాడులకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు. ‘‘పవన విద్యుత్ ప్రాజెక్టుల కాంట్రాక్టుల కేటాయింపునకు సంబంధించి శ్రీలంక ప్రభుత్వ సీనియర్ అధికారులు నేరుగా భారత ప్రధానమంత్రి మోడీపైనే ఆరోపణలు గుప్పించారు. అయినా దానిపై ప్రధాని కానీ.. అదానీ కానీ ఉలుకలేదు. పలుకలేదు. మీడియా కూడా మౌనాన్నే పాటిస్తోంది’’ అని వ్యాఖ్యానించారు. ఈమేరకు గురువారం ఉదయం ఆయన ట్వీట్ చేశారు.  

శ్రీలంకలో ఓ విద్యుత్ ప్రాజెక్టును అదానీ గ్రూప్ కు ఇచ్చేలా  దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్సపై  భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఒత్తిడి చేశారంటూ సంచలన ఆరోపణలు చేసిన సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డు (సీఈబీ) చైర్మన్ ఎం.ఎం.సి. ఫెర్డినాండో  ఈనెల 13న  రాజీనామా చేశారు.  జూన్ 10న (శుక్రవారం) శ్రీలంక ప్రభుత్వరంగ సంస్థల పార్లమెంటరీ కమిటీ సమావేశం వేదికగా ఫెర్డినాండో  చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.  ‘‘ఉత్తర శ్రీలంకలోని మన్నార్ పట్టణంలో ఉన్న 500  మెగావాట్ల  పవన విద్యుత్ ప్రాజెక్టును  భారత ప్రధానమంత్రి మోదీ ఒత్తిడి వల్లే అదానీ గ్రూపుకు ఇస్తున్నామని శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స నాతో చెప్పారు. రాజపక్సను మోదీ చాలా ఒత్తిడి చేశారట’’ అని ఆ సమావేశంలో ఫెర్డినాండో  వ్యాఖ్యానించారు.