స్మోక్​ అటాక్​పై పార్లమెంట్​లో ఆందోళన.. 14 మంది ఎంపీల సస్పెన్షన్​

స్మోక్​ అటాక్​పై పార్లమెంట్​లో ఆందోళన.. 14 మంది ఎంపీల సస్పెన్షన్​
  • స్మోక్​ అటాక్​పై పార్లమెంట్​లో ఆందోళన.. 14 మంది ఎంపీల సస్పెన్షన్​
  • భద్రతా వైఫల్యంపై ప్రతిపక్ష ఎంపీల నిరసనలు
  • ప్రభుత్వం ప్రకటన చేయాలని వెల్​లోకి దూసుకొచ్చి నినాదాలు
  • పార్లమెంట్ లో భద్రతా వైఫల్యంపై ప్రతిపక్ష ఎంపీల నిరసనలు 
  • ప్రభుత్వం ప్రకటన చేయాలని వెల్ లోకి దూసుకెళ్లి ఆందోళన 

న్యూఢిల్లీ : పార్లమెంట్ లో భద్రతా వైఫల్యంపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలంటూ ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. గురువారం అటు లోక్ సభలో, ఇటు రాజ్యసభలో ఆందోళనకు దిగారు. దీంతో సభా కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగించారని14 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. లోక్ సభలో 13 మందిపై, రాజ్యసభలో ఒకరిపై పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిసే వరకూ సస్పెన్షన్ వేటు వేశారు. 

మొదట పొరపాటున లోక్ సభలో లేని డీఎంకే ఎంపీ ఎస్ఆర్ పార్థిబన్ ని కూడా సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించి, ఆ తర్వాత ఆయన పేరు తొలగించారు. గురువారం లోక్ సభ ప్రారంభమవగానే ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. వెల్ లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు.  దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమయ్యాక భద్రతా వైఫల్యంపై ప్రభుత్వం తరఫున పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటన చేశారు. 

పార్లమెంట్ అంతర్గత భద్రత స్పీకర్ పరిధిలోకి వస్తుందని తెలిపారు. ఆ తర్వాత ఐదుగురు ఎంపీలు టీఎన్ ప్రతాపన్, హిబీ ఈడెన్, జ్యోతిమణి, రమ్యా హరిదాస్, డీన్ కురియాకోస్ లను సస్పెండ్ చేస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి ఆమోదం తెలిపిన తర్వాత సభను మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమయ్యాక మరో 8 మంది ఎంపీలు వీకే శ్రీకంధన్, బెన్నీ బెహనన్, మహమ్మద్ జావెద్, పీఆర్ నటరాజన్, కనిమొళి, కె.సుబ్బరాయన్, ఎస్.వెంకటేశన్, మాణిక్కం ఠాగూర్ ను సస్పెండ్ చేస్తూ జోషి తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి ఆమోదం తెలిపాక సభ శుక్రవారానికి వాయిదా పడింది. సస్పెన్షన్ కు గురైన ఎంపీల్లో కాంగ్రెస్ నుంచి 9 మంది, సీపీఎం నుంచి ఇద్దరు, సీపీఐ,  డీఎంకే నుంచి ఒక్కొక్కరు ఉన్నారు.   

రాజ్యసభ చైర్మన్ తో ఒబ్రెయిన్ వాగ్వాదం 

రాజ్యసభలోనూ ప్రతిపక్ష ఎంపీలు ఆందోళకు దిగారు. పార్లమెంట్ లో భద్రతా వైఫల్యంపై చర్చించాలని ప్రతిపక్ష ఎంపీలు 28 నోటీసులు ఇవ్వగా, చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ అనుమతించలేదు. టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్.. చైర్మన్ సీటు ముందుకు వెళ్లి వాగ్వాదానికి దిగారు. దీంతో చైర్మన్ సీరియస్ అయ్యారు. ఇది తీవ్రమైన ఉల్లంఘన అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సభ నుంచి బయటకు వెళ్లిపోవాలని చెప్పారు. అనంతరం ఒబ్రెయిన్ ను సస్పెండ్ చేస్తూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తీర్మానం ప్రవేశపెట్టగా, సభ ఆమోదించింది.   

లలిత్ ఝాకు టీఎంసీతో లింకులు: బీజేపీ

పార్లమెంటు స్మోక్ బాంబ్‌‌ ఘటనపై బీజేపీ, టీఎంసీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది. నిందితులకు తృణమూల్, ఇండియా కూటమి సహకరించిందని బీజేపీ ఆరోపించగా.. ఇద్దరు చొరబాటుదారులకు పాస్‌‌లు జారీ చేయడంలో బీజేపీకి చెందిన మైసూరు ఎంపీ కీలక పాత్ర పోషించారని తృణమూల్ ఎత్తి చూపింది. ఈ నేపథ్యంలో తాజాగా బెంగాల్ బీజేపీ చీఫ్ సుకాంత మజుందార్ చేసిన ట్వీట్ ఇరు పార్టీల మధ్య వాగ్వాదాన్ని మరింత పెంచింది. గురువారం ఆయన.. తృణమూల్ సీనియర్ నేత తపస్ రాయ్‌‌తో  స్మోక్ బాంబ్‌‌ ఘటనలో ఆరవ నిందితుడైన లలిత్ ఝా గతంలో దిగిన ఫొటోను ఎక్స్‌‌లో పోస్ట్ చేశారు. “లలిత్ ఝాకు టీఎంసీకి చెందిన తపస్ రాయ్‌‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దానికి ఈ ఫొటో  రుజువు చాలదా? " అని మజుందార్ తన ట్వీట్ కు యాడ్ చేశారు.