తెలంగాణ పచ్చగా ఉంటే కొంతమందికి నచ్చడం లేదు.. అందుకే కేసీఆర్ను బద్నాం చేయాలని చూస్తున్నరు: కేటీఆర్

తెలంగాణ పచ్చగా ఉంటే కొంతమందికి నచ్చడం లేదు.. అందుకే కేసీఆర్ను బద్నాం చేయాలని చూస్తున్నరు: కేటీఆర్

మెదక్: ఎర్రవల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్లో చేరికల సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కవిత ఎపిసోడ్పై కేటీఆర్ ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం కొసమెరుపు. తెలంగాణలో ఎవరిని అడిగినా కేసిఆర్ పాలననే బాగుందని అంటున్నరని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని చాలా మంది చెప్పారని, ఎన్నికల ముందు హామీల జాతర.. ఎన్నికల తరువాత చెప్పుల జాతర అన్నట్లుగా కాంగ్రెస్ పాలన ఉందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఆనాటి కాంగ్రెస్ పాలన రోజులను మళ్ళీ రేవంత్ గుర్తు చేశారని కేటీఆర్ వ్యంగ్యాస్త్రం సంధించారు.

దేశ చరిత్రలోనే కేసీఆర్ పదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి ఎక్కడా జరగలేదని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రం రాక ముందు గోదావరి, కృష్ణ నీటి కోసం ఎన్నో గొడవలు జరిగాయని.. కానీ నీళ్లు రాలేదని చెప్పారు. 2014లో మన వ్యవసాయం ర్యాంక్ దేశంలో 14వ ర్యాంక్ అని కానీ స్వరాష్ట్రం వచ్చాక 2022లో నెంబర్ వన్ స్థానానికి వచ్చామని తెలిపారు. ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ మన తెలంగాణలో ఉందని, అదే కాళేశ్వరం అని కేటీఆర్ చెప్పారు.

హైదరాబాద్ అనే మహానగరానికి తాగు నీటికి ఇబ్బంది లేకుండా మల్లన్నసాగర్, కొండపోచమ్మను కేసీఆర్ నిర్మించారని.. అట్లాంటి కేసీఆర్పై సీబీఐ ఎంక్వయిరీ వేశారని తెలిపారు. సీబీఐ మోదీ జేబు సంస్థ అని రాహుల్ అంటాడని, రేవంత్ మాత్రం సీబీఐ మంచి సంస్థ అంటున్నాడని కేటీఆర్ దుయ్యబట్టారు.

ALSO READ : కాంగ్రెసా.. బీజేపీనా..? ఏ పార్టీలో చేరుతారో క్లారిటీ ఇచ్చిన కవిత

తెలంగాణ పచ్చగా ఉంటే కొంతమందికి నచ్చడం లేదని, అందుకే కేసీఆర్ను బద్నాం చేయాలని చూస్తున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పాలనలో డైలాగ్లు తప్ప ఏం జరగడం లేదని, ఎన్నికల ముందు వేలం పాట లాగా 420 హామీలు ఇచ్చారని విమర్శించారు. ఇక్కడ ఉన్న వారికి ప్రభుత్వం నడపడం చేత కాదని, 21 నెలల్లో ప్రజలకు, రాష్ట్రానికి పనికొచ్చే ఒక్క పని చేయలేదని కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ విమర్శలు చేశారు.