ప్రతిపక్షాలు నిరుద్యోగులను రెచ్చగొట్టుడు మానుకోవాలె: ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్

ప్రతిపక్షాలు నిరుద్యోగులను రెచ్చగొట్టుడు మానుకోవాలె: ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్

హైదరాబాద్, వెలుగు: ప్రతిపక్షాలు నిరుద్యోగులను రెచ్చగొట్టుడు మానుకొని.. సరైన సలహాలు, సూచనలు ఇవ్వాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కోరారు. ఓవైపు ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదని విమర్శలు చేస్తూనే.. మరోవైపు పరీక్షలను పోస్ట్ పోన్ చేయాలని కోరడం ఎంతవరకు కరెక్ట్​అని ఆయన ప్రశ్నించారు. వారిది నిరుద్యోగులపై ప్రేమ కాదని, కేవలం రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు. 

తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా పర్ఫెక్ట్ బడ్జెట్ పెట్టారని, గత పదేండ్ల బడ్జెట్ తో పోలిస్తే వందశాతం రియాలిటీకి దగ్గరగా ఉందని చెప్పారు. ఇది రాష్ట్ర ప్రజలు, రైతులు, విద్యార్థులు, మహిళలు, నిరుద్యోగుల బడ్జెట్ అని చెప్పొచ్చన్నారు. గత ప్రభుత్వం యూనివర్సిటీలను రాజకీయాల కోసమే వాడుకున్నదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తోందన్నారు.  

మోడల్ స్కూల్ టీచర్లకు ఒకటో తేదీనే జీతాలివ్వాలి: రఘోత్తంరెడ్డి 

రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లలో కొందరికి ఇప్పటికీ జీతాలు రాలేదని టీచర్ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి తెలిపారు. అందరు ఉద్యోగుల మాదిరిగానే  010 పద్దు కింద వారికి కూడా ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మోడల్ స్కూళ్లలో ఇప్పటి వరకు 26 మంది చనిపోయారని, వారి కుటుంబ సభ్యులకు కారుణ్యనియామకాల ద్వారా ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరారు. 

వాస్తవానికి దగ్గరగా ఉన్న బడ్జెట్: అలుగుబెల్లి నర్సిరెడ్డి 

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వాస్తవానికి దగ్గరగా ఉన్నదని టీచర్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. పట్టణ, ప్రాథమిక హాస్పిటల్స్ ను బలోపేతం చేసిన తర్వాత, బస్తీ దవాఖానాలపై దృష్టి పెట్టాలని సూచించారు. గురుకులాలకు కొత్త బిల్డింగ్​లు నిర్మించాలన్నారు. పాత గురుకులాలకు సొంత భవనాలున్నాయని, కొత్తగా ఏర్పాటు చేసిన వాటికే భవనాల్లేవన్నారు. గురుకులాలు, మోడల్ స్కూళ్లలోని టీచర్లకు, కాంట్రాక్టు సిబ్బందికి హెల్త్ కార్డులివ్వాలని ఆయన కోరారు. 

బీఆర్ఎస్ ​సపోర్ట్​తోనే బీజేపీకి 8 సీట్లు

రేవంత్ రెడ్డి చదువు మీద రఘునందన్ రావు అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. ప్రధాని మోదీ ఏం చదువుకున్నారో ఆయన చెబుతారా.? మోదీ చదువుపై పార్లమెంట్ లో చర్చ జరిగిన విషయం గుర్తులేదా. పదేండ్లు పాలించి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిన బీఆర్ఎస్ సహకారంతో 8సీట్లు తెచ్చుకున్నారు. హరీశ్ రావుకు నీకు  మధ్య ఉన్న చీకటి ఒప్పందం తెలియదనుకుంటున్నవా..? కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేకపోయిన విషయాన్ని డైవర్ట్ చేయడానికి సీఎంపై ఏది పడితే అది మాట్లాడితే ప్రజలే బుద్ధి చెబుతారు.–విప్ ఆడ్లూరి లక్ష్మణ్

ఎంపీ రఘునందన్ నోరు అదుపులో పెట్టుకోవాలి

బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మతిభ్రమించి మాట్లాడుతున్నరు. సీఎం రేవంత్ పై చేసిన కామెంట్లను తీవ్రంగా ఖండిస్తున్నం. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు నిధులు తేలేని దద్దమ్మలు సీఎంపై విమర్శలు చేస్తరా. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ.. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎంపై  విమర్శలు చేస్తరా. రాష్ట్రం నుంచి రూపాయి కేంద్రానికి వెళ్తే.. 43 పైసలు మాత్రమే వస్తున్నాయి. అదే గుజరాత్ నుంచి ఒక్కరూపాయి కేంద్రానికి వెళ్తే.. 6 రూపాయలు, ఉత్తర ప్రదేశ్ నుంచి కేంద్రానికి ఒక్క రూపాయి వెళ్తే.. 6 రూపాయలు చొప్పున ఆ రాష్ట్రాలకు తిరిగి వస్తున్నాయి.  రఘునందన్ ఇకనైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. 
                                         - బీర్ల ఐలయ్య, ప్రభుత్వ విప్