చెడ్డీ-బనియన్ గ్యాంగ్ వర్సెస్ లుంగీ గ్యాంగ్.. మహా అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం..

చెడ్డీ-బనియన్ గ్యాంగ్ వర్సెస్ లుంగీ గ్యాంగ్.. మహా అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం..

ఇటీవల ఒక క్యాంటీన్ లో పప్పు వాసన చూపించి మరీ క్యాంటీన్ మేనేజర్ పై ఓ ఎమ్మెల్యే దాడి చేసిన విషయం తెలిసిందే. రుచి బాలేదని చెంప పగలగొట్టి.. బాక్సర్ మాదిరిగా పిడిగుద్దులు గుద్దటంపై దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇదే అంశం ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాలలో వేడి రాజేస్తోంది. సదరు ఎమ్మెల్యే వ్యవహారంపై అసెంబ్లీలో ప్రతిపక్ష నేతలు చిత్రమైన వేషధారణతో ఆందోళనకు దిగటం చర్చనీయాంశంగా మారింది. 

మహారాష్ట్ర అసెంబ్లీలో బుధవారం (జులై 16) ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య చెడ్డీబనియన్ గ్యాంగ్.. లుంగీ గ్యాంగ్ అంటూ స్లోగన్లు మారుమోగాయి. చెడ్డీ బనియన్ గ్యాంగ్ గూండాయిజం నశించాలని మరో వర్గం నిరసనలకు దిగింది. నిరసనల్లో లుంగీ, వెస్ట్ (వంట చేస్తున్నపుడు కిచెన్ లో వేసుకునేది) ధరించి ఆందోళనకు దిగటం చర్చనీయాంశంగా మారింది. 

ఇటీవల శివసేన (షిండే వర్గం) ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ క్యాంటీన్ మేనేజర్ ను కొట్టిన విషయం తెలిసిందే. బీజేపీ-శివసేన గూండాయిజం నశించాలని ఆందోళనకు దిగారు ప్రతిపక్ష శివసేన (ఉద్ధవ్ వర్గం), ఎన్సీపీ (శరద్ పవార్) నేతలు. మేనేజర్ పై దాడి చేస్తున్న సమయంలో గైక్వాడ్ ఎలాంటి డ్రెస్ వేసుకుని ఉన్నారో అలాంటి వేషధారణతో ఆందోళనకు దిగారు. లుంగీ, వెస్ట్ ధరించి అసెంబ్లీ ఆవరణలో ధర్నాకు దిగారు. చెడ్డీబనియన్ గ్యాంగ్ అరాచకాలు నశించాలని ఆందోళన చేశారు. 

దాడి సమయంలో ఎమ్మెల్యే వేషధారణను పోలిన డ్రెస్సింగ్ తో.. ఆయన లాగే నటిస్తూ.. వెక్కిరిస్తూ ఆందోళనలో పాల్గొన్నారు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు. చెడ్డీ బనియన్ గ్యాంగ్ గ్యాంగ్ అరాచకాలను ఖండిస్తున్నాం.. అంటూ స్లోగన్లు చేశారు. ప్రజాప్రతినిధి అయ్యుండి ఒక వీధిరౌడీ మాదిరిగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గైక్వాడ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

ఏంటి వివాదం:

మహారాష్ట్రలో ఒక ఎమ్మెల్యే పప్పు క్వాలిటీ బాలేదని క్యాంటీన్ నిర్వాహకుడి చెంప చెళ్లుమనిపించాడు. పిడి గుద్దులతో ముఖం పగలగొట్టాడు. పైగా.. తాను అలా ప్రవర్తించడంతో తప్పే లేదని ఈ ఘటన జరిగిన తర్వాత తనను తాను సమర్థించుకున్నాడు.ఈ దాడికి పాల్పడింది మహారాష్ట్రలోని బుల్ధానా నియోజకవర్గ శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్. 

ఆకాశవాణి ఎమ్మెల్యే క్యాంటీన్కు వెళ్లి సదరు ఎమ్మెల్యే థాలీ ఆర్డర్ చేశాడు. క్యాంటీన్ సిబ్బంది ఎమ్మెల్యేకు థాలీ వడ్డించారు. అయితే ఆ థాలీలోని పప్పు దుర్వాసన వస్తున్నట్లు ఎమ్మెల్యే గుర్తించారు. కోపంతో శివాలెత్తిపోయిన ఎమ్మెల్యే వెంటనే అక్కడున్న వాళ్లను పిలిచి ఆ పప్పు ప్యాకెట్ వాసన చూడమని చెప్పారు. ‘‘ఇది నాకు ఇచ్చింది ఎవరు..? ఒక్కసారి వచ్చి ఈ పప్పు వాసన చూడండి.. ఒక ఎమ్మెల్యేకు మీరు ఇలాంటిది ఇస్తున్నారంటే.. కామన్ పబ్లిక్కు ఏం ఇస్తున్నారు..?’’ అని క్యాంటీన్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

క్యాంటీన్ ఆపరేటర్ను పిలవండని సిబ్బందికి చెప్పగా.. అతనికి సిబ్బంది కాల్ చేశారు. క్యాంటీన్ ఆపరేటర్ రాగానే అతనికి ఆ పప్పు వాసన చూపించిన ఎమ్మెల్యే ఆ క్యాంటీన్ నిర్వాహకుడి చెంప చెళ్లుమనిపించాడు. ఎమ్మెల్యే కొట్టిన దెబ్బలకు క్యాంటీన్ నిర్వాహకుడు దెబ్బకి ఫ్లోర్పై పడ్డాడు. ఆ క్యాంటీన్ ఫుడ్ క్వాలిటీ లేదని ఎమ్మెల్యే నిలదీయడంలో తప్పేం లేదని.. ఫుడ్ సేఫ్టీ అధికారులకు చెప్పి క్యాంటీన్ను సీజ్ చేయించాలని.. అంతే కానీ ఇలా భౌతిక దాడులకు పాల్పడటం మంచి పద్ధతి కాదని ఈ ఘటనపై నెటిజన్లు అభిప్రాయపడ్డారు