రిమోట్  ఓటింగ్ మెషీన్ల తరలింపుపై ప్రతిపక్షాల అభ్యంతరం

రిమోట్  ఓటింగ్ మెషీన్ల తరలింపుపై ప్రతిపక్షాల అభ్యంతరం
  • ముందు సిటీ ఓటర్లకు అవగాహన కల్పించండి
  • ఆర్ వీఎంల డెమోలో ఈసీకి ప్రతిపక్షాల విజ్ఞప్తి
  • ఆ మెషీన్లపై అభ్యంతరాలను ఈ నెలలోపు తెలియజేయాలని ఈసీ సూచన

న్యూఢిల్లీ : రిమోట్  ఓటింగ్ మెషీన్ల (ఆర్ వీఎంలు) తరలింపుపై ప్రతిపక్షాలు అభ్యంతరం తెలిపాయి. ఆర్ వీఎంలను తరలించే ముందు.. ఓటుహక్కు విషయంలో నిర్లక్ష్యంగా ఉండే సిటీ ఓటర్లకు ఆ హక్కుపై అవగాహన కల్పించాలని ఎలక్షన్  కమిషన్ కు సూచించాయి. ఆర్ వీఎంల పనితీరుపై ఈసీ నిర్వహించిన కార్యక్రమానికి ప్రతిపక్ష నేతలు హాజరయ్యారు. డెమో తర్వాత కాంగ్రెస్  నేత దిగ్విజయ్  సింగ్..  మీడియాతో మాట్లాడారు. ఆర్ వీఎం డెమోను ప్రతిపక్ష నేతలు చూడాలనుకోవడం లేదని ఆయన తెలిపారు. ముందుగా అలాంటి మెషీన్ల సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు. ప్రతిపక్ష నేతల మధ్య ఏకాభిప్రాయం ఏర్పడే వరకూ ఆర్ వీఎంల డెమో ఉంటుందని తాను అనుకోవడం లేదన్నారు. అసలు అలాంటి డెమోను చూసేందుకు ఏ రాజకీయ పార్టీ కూడా సిద్ధంగా లేదన్నారు. ‘‘ఆర్వీఎంల ఐడియానే ఆమోదయోగ్యం కాదు. ఇప్పటికే ఉన్న ఈవీఎంలపై పలువురు ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు. ముందుగా అలాంటి వారి ఆందోళనను దూరం చేసే ప్రయత్నం చేయాలి. వారికి తగిన జవాబివ్వాలి.

ఇక ఓటింగ్  విషయంలోనూ పట్టణ ప్రజల్లో నిర్లక్ష్యం ఎక్కువ. వారికి ఓటుహక్కుపై అవగాహన కల్పించాలి” అని దిగ్విజయ్  పేర్కొన్నారు. కాగా, ఆర్ వీఎంలు స్టాండ్ అలోన్  డివైజ్​లని, ఇంటర్ నెట్​కు వాటిని కనెక్ట్ చేయబోమని ఈసీ స్పష్టంచేసింది. ఆర్ వీఎంలను అమల్లోకి తెస్తే వలసవెళ్లిన వారు తాము ఉన్న పోలింగ్  బూత్  నుంచే ఓటు వేయవచ్చని ఈసీ పేర్కొంది. ఆర్ వీఎంల వాడకంపై ఉన్న అభ్యంతరాలు, అభిప్రాయాలను ఈ నెలలోపు రాసివ్వాలని ప్రతిపక్షాలకు ఈసీ సూచించింది. ఎనిమిది జాతీయ, 57 ప్రాంతీయ పార్టీలను ఆర్ వీఎంల డెమో కార్యక్రమానికి ఈసీ ఆహ్వానించింది. జేడీయూ, శివసేన, సీపీఎం, సీపీఐ, నేషనల్  కాన్ఫరెన్స్, జార్ఖండ్ మూక్తి మోర్చా, పీపుల్స్  డెమోక్రటిక్  పార్టీ, ఇండియన్  ముస్లిం లీగ్  తదితర పార్టీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యాయి.