లాక్‌డౌన్ అంశాన్ని పరిశీలిస్తున్న కేంద్రం

లాక్‌డౌన్ అంశాన్ని పరిశీలిస్తున్న కేంద్రం

న్యూఢిల్లీ: దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకీ వైరస్ పాజటివ్‌‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. నిన్న ఒక్క రోజే 4 లక్షల పైచిలుకు కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో వైరస్ కట్టడికి లాక్‌డౌన్ పెట్టాల్సిందేనని అమెరికా పబ్లిక్ హెల్త్ ఎక్స్‌పర్ట్ డాక్టర్ ఆంథోనీ ఫౌసీ సహా  పలువురు నిపుణులు సూచిస్తున్నారు. ఈ విషయంపై నీతి అయోగ్ సభ్యుడు వీకే పాల్ స్పందించారు. దేశవ్యాప్తంగా లాక్‌‌డౌన్ విధించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. 

కరోనా కట్టడికి సంబంధించి సరైన సూచనల అమలుతో ముందుకు పోవాల్సి ఉంటుందని పాల్ స్పష్టం చేశారు. అదే సమయంలో నిబంధనల విషయంలో ఏమైనా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినా వెనకడుగు వేయబోమన్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాలు స్వయంగా లాక్‌డౌన్ విధించుకున్నాయని.. ఆయా స్టేట్స్‌లో రాత్రిపూట కర్ఫ్యూను అమలు చేస్తున్నారని తెలిపారు. పరిస్థితి తీవ్రతను బట్టి దేశవ్యాప్త లాక్‌‌డౌన్ పెట్టే అంశం మీద చర్చలు జరుపుతున్నాయని పేర్కొన్నారు. లాక్‌డౌన్ అనేది చివరి ఆప్షన్ అని పలు రోజుల కింద ముఖ్యమంత్రులతో జరిగిన మీటింగ్‌‌లో ప్రధాని మోడీ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్ విధించడం వల్ల దేశ ఎకానమీతోపాటు పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావం పడుతుందని పేర్కొన్నారు.