కేరళలో భారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ

కేరళలో భారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ

కేరళలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.. భారీ వర్షాల కారణంగా పలు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. జనజీవనం స్తంభించిపోయింది. గత 24 గంటల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో 200 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. రుతుపవనాల రాక కంటే ముందే.. కేరళలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మే 24వ తేదీ శుక్రవారం మూడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.రాష్ట్రంలోని పతనంతిట్ట, కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.

ఈరోజు  కొచ్చి,  ఎర్నాకులం, త్రిసూర్‌తో సహా ప్రధాన నగరాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. వర్షపు నీరంతా రోడ్లపైకి చేరుకోవడంతో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి.  దీంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడి.. వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. త్రిసూర్‌లోని సెయింట్ థామస్ రోడ్ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా చెట్టు కూలడంతో వాహనాలు దెబ్బతిన్నాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది.

ALSO READ | గంటకు 102 కి.మీటర్ల వేగంతో రెమల్.. ఈ రాష్ట్రాలకు తుఫాన్ హెచ్చరిక

భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కె రాజన్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో గత 24 గంటల్లో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం పడిందని చెప్పారు. కోజికోడ్ జిల్లాలోని కున్నమంగళంలో గత 24 గంటల్లో 226.2 మిల్లీమీటర్ల వర్షం,  అలప్పుజా జిల్లాలోని చెర్తలలో 215 మిమీ, కొట్టాయం జిల్లాలోని కుమరకోమ్‌లో 203 మిల్లీమీటర్లు, కోజికోడ్ జిల్లాలోని తామరస్సేరిలో 200.7 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని  ఆయన తెలిపారు.

తక్కువ వ్యవధిలో ఇంత భారీ వర్షాలు కురవడం వల్ల పలు సంఘటనలు చోటుచేసుకుంటాయని, ప్రజలకు ఎలాంటి ఇంబ్బందులు కలగకుండా.. అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా ఎదుర్కొనేందుకు స్థానిక అధికారులు, అగ్నిమాపక దళం, పోలీసు, రెవెన్యూ శాఖలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఎన్‌డిఆర్‌ఎఫ్‌కి చెందిన రెండు బృందాలు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నాయని మంత్రి రాజన్ చెప్పారు.