జీరో బిల్లులపై చట్టప్రకారమే ఉత్తర్వులిచ్చినం: ఈఆర్​సీ

జీరో బిల్లులపై చట్టప్రకారమే ఉత్తర్వులిచ్చినం: ఈఆర్​సీ

హైదరాబాద్‌, వెలుగు : గృహజ్యోతి స్కీంకు సంబంధించి విద్యుత్ చట్టం-–2003 నిబంధనల ప్రకారమే ఉత్తర్వులు జారీ చేశామని తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ ఈఆర్​సీ) తెలిపింది. ఈ మేరకు సోమవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ స్కీంలో భాగంగా ఇచ్చే జీరో బిల్లులకు సంబంధించి విద్యుత్ పంపిణీ సంస్థలకు (డిస్కంలు) రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే సబ్సిడీ సొమ్ము చెల్లించాలని టీఎస్ఈఆర్సీ ఈ నెల 14న ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం నాటి మీట్​ది మీడియా కార్యక్రమంలో సీఎం రేవంత్​రెడ్డి.. టీఎస్ఈఆర్సీపై మండిపడ్డారు.

 కమిషన్ తీరును తప్పుపట్టారు. ఇలాంటి ఉత్తర్వులు గత ప్రభుత్వం వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇచ్చినప్పుడు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. డిస్కంలు అప్పుల కుప్పగా మారుతుంటే కమిషన్ ఏం చర్యలు తీసుకుందని నిలదీశారు. కమిషన్ చైర్మన్​ను ఉద్దేశించి కూడా విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో టీఎస్ఈఆర్సీ పూర్తి వివరణతో కూడిన రెండు పేజీల ప్రకటనను పత్రిక ఆఫీసులకు పంపింది.

 డిస్కంలు వ్యవసాయానికి ఉచిత విద్యుత్, ఎస్సీ ఎస్టీలకు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా, హెయిర్ కటింగ్ సెలూన్లు, దోబీ ఘాట్లకు నెలకు 250 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు సరఫరా చేస్తున్నాయనీ.. అయితే వీటికి ఎక్కడా ‘జీరో’ బిల్లులు ఇవ్వట్లేదని అందులో పేర్కొంది. అందువల్ల ఆ కేటగిరిలో విద్యుత్ చట్టం సెక్షన్ 108 కింద ఉత్తర్వులు ఇచ్చామని తెలిపింది.