మున్సి‘పోల్స్‘ నోటిఫికేషన్ ఇప్పుడే వద్దు

మున్సి‘పోల్స్‘ నోటిఫికేషన్ ఇప్పుడే వద్దు

హైదరాబాద్, వెలుగుమున్సిపల్‌‌  ఎలక్షన్లకు సంబంధించి తాము అనుమతించేవరకు నోటిఫికేషన్​ జారీ చేయవద్దని హైకోర్టు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఎలక్షన్ల కోసం అవసరమైన ముందస్తు ప్రక్రియ మాత్రం చేసుకోవచ్చని సూచించింది. ఈ అంశంలో దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలపై వాదనలు ముగిసినట్టు ప్రకటించింది. తీర్పును తర్వా త వెలువరిస్తామని తెలిపింది. మున్సిపల్​ ఎలక్షన్ల ప్రక్రియ అంతా తప్పులతడకగా సాగిందని, ఎన్నికల ప్రక్రియ పూర్తికి అవసరమైన గడువు కుదిస్తూ విడుదల చేసిన ఆర్డినెన్స్‌‌ సరికాదని పేర్కొంటూ నిర్మల్‌‌ జిల్లాకు చెందిన అన్జుకుమార్‌‌రెడ్డి, న్యాయవాది ఎస్‌‌.మల్లారెడ్డి తదితరులు దాఖలు చేసిన పిల్స్​పై మంగళవారం హైకోర్టులో తుది వాదనలు జరిగాయి. తొలుత ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ జె.రామచందర్‌‌రావు వాదనలు వినిపించారు. వార్డుల వారీ ఓటర్ల గణనను జులై 7 నాటికి పూర్తిచేసి మున్సిపల్‌‌ డైరెక్టరేట్‌‌కు పంపామని కోర్టుకు తెలిపారు.

రాజ్యాంగం ప్రకారం గడువులోగా ఎన్నికలు నిర్వహించాలని, అందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. తర్వాత అన్జుకుమార్‌‌రెడ్డి తరఫున లాయర్‌‌  సిన్నోళ్ల నరేష్‌‌రెడ్డి, మల్లారెడ్డి తరఫున లాయర్‌‌ సూర్యకిరణ్‌‌రెడ్డి తమ వాదనలు వినిపించారు. ప్రభుత్వం వార్డుల విభజన, రిజర్వేషన్ల ఖరారుపై అభ్యంతరాలు చెప్పడానికి ఒకే ఒక్క రోజు గడువు ఇచ్చి తంతు పూర్తి చేసిందని కోర్టుకు వివరించారు. వాస్తవానికి అందుకు కనీసం ఐదారు రోజుల సమయం పడుతుందని చెప్పారు. మున్సిపాల్టీల్లో వార్డుల వారీగా ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళా ఓటర్ల లెక్కలు తేల్చాలని, ఆ లెక్కలకు అనుగుణంగా రిజర్వేషన్లు ఖరారు చేయాలని స్పష్టం చేశారు. చట్టసభలకు వాడిన ఓటర్ల లిస్ట్‌‌ ఆధారంగా మున్సిపోల్స్‌‌ నిర్వహించకూడదని, మున్సిపల్​ యాక్ట్​లో ఈ విషయాన్ని స్పష్టంగా ఉందని తెలిపారు. తర్వాత ఎలక్షన్‌‌  కమిషన్‌‌ తరఫున సీనియర్‌‌ లాయర్‌‌ జి.విద్యాసాగర్‌‌  అభిప్రాయాన్ని వెల్లడించారు. ఎన్నికలు నిర్వహించేందుకు 27 రోజుల సమయం కావాలన్నారు. ముందస్తు ప్రక్రియ పూర్తికి ఏడు రోజులు కావాలని, తర్వాత 20 రోజుల్లో ఎన్నికలు నిర్వహించగలమని చెప్పారు. కొత్త మున్సిపల్​ చట్టం తెస్తామని సర్కారు చెప్పడం వల్ల ఓటర్ల జాబితా ప్రచురించలేదని, ఎన్నికల ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేయకపోవడం వల్లే హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని వివరించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఆర్ఎస్​ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్​ ఎ.అభిషేక్​రెడ్డిలతో కూడి బెంచ్  ఈ అంశాలన్నింటినీ నోట్​ చేసుకుంది.

తీర్పు రిజర్వ్..

రాజ్యాంగంలోని 243 జెడ్‌‌-జి ప్రకారం, ఆర్టికల్‌‌ 329 ప్రకారం స్థానిక సంస్థల పాలకవర్గాల గడువు ముగియగానే ఎన్నికలు నిర్వహించాలని బెంచ్​ గుర్తు చేసింది. ప్రభుత్వం పిటిషనర్ల అభ్యంతరాలపై చర్యలు తీసుకున్నామని చెబుతోందని పేర్కొంది. ఆర్టికల్‌‌ 243 ప్రకారం ఎన్నికల విధుల్లో కోర్టులు జోక్యం చేసుకోడానికి వీల్లేదని, దీనిపై సుప్రీంకోర్టు రూలింగ్స్‌‌ ఉన్నాయని తెలిపింది. ఈ పిటిషన్లలో బెంచ్​ ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని వివరించింది. జనాభా లెక్కల్లోనే అన్ని వివరాలు ఉంటాయని, వాటి ఆధారంగా వార్డుల రిజర్వేషన్లు చేయవచ్చని పేర్కొంది. ఈ పిల్స్​లో వాదనలు ముగిశాయని ప్రకటించింది. తీర్పును వాయిదా వేస్తున్నామని, తాము అనుమతించేవరకు ఎలక్షన్​ నోటిఫికేషన్​ విడుదల చేయవద్దని ఆదేశించింది. అయితే ఎలక్షన్ల కోసం అవసరమైన ముందస్తు పనులను పూర్తి చేసుకోవచ్చని తెలిపింది.