- ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో జోరుగా దందా
- ప్రీమియం, మీడియం బ్రాండ్లను కల్తీ చేస్తున్న ముఠాలు
- వైన్స్ లు, బెల్టు షాపులకు తక్కువ రేట్లకు అమ్మకం
- తప్పించుకుంటున్న వ్యాపారులు.. పట్టుబడ్తున్న నౌకర్లు
- ఇటీవల మూడు జిల్లాల్లో పది కేసులు నమోదు
నల్గొండ, వెలుగు: బ్లెండర్స్ప్రైడ్, టీచర్స్, బ్లాక్ లేబుల్, జానీ వాకర్, బ్లాక్ డాగ్.. ఇలాంటి బ్రాండెడ్ లిక్కర్ తాగుతున్నప్పుడు ఎక్కడో తేడా కొడుతోందా? బహుశా మీ బాటిల్ బ్రాండెడ్ అయినప్పటికీ లోపల ఉన్న లిక్కర్ ఛీప్క్వాలిటీ కావచ్చు. ఎందుకంటే నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో లిక్కర్కల్తీ దందా జోరుగా సాగుతోంది. లిక్కర్ సేల్స్‌లో ప్రీమియం, మీడియం బ్రాండ్లదే పైచేయి. దీనిని ఆసరాగా తీసుకున్న కొన్ని ముఠాలు బ్రాండెడ్ బాటిళ్లలో ఛీప్‌లిక్కర్ నింపి మార్కెటింగ్ చేస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల ఈ కల్తీ ముఠాల్లోని కొందరు నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఎన్ఫోర్స్మెంట్, టాస్క్‌ఫోర్స్ పోలీసులకు పట్టుబడడంతో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. వీరికి పలువురు లిక్కర్వ్యాపారులు, బెల్టుషాపుల నిర్వాహకులు సహకరిస్తున్నట్లు తేలింది. కొత్తటెక్నిక్తో బ్రాండెడ్ లిక్కర్‌ను కల్తీ చేస్తున్న ఈ ముఠాలు, వాటిని వైన్స్, బెల్టుషాపులకు తక్కువ ధరకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నాయి. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు వైన్స్‌షాపుల్లో పనిచేస్తున్న నౌకర్ల పేర్లు తప్ప తెరవెనుక ఉన్న అసలు సూత్రధారులెవరో ఆఫీసర్లు బయటపెట్టకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇలా కల్తీ చేస్తున్నరు
కల్తీ కోసం ప్రీమియం, మీడియం బ్రాండ్ల బాటిళ్లను ఎంచుకుంటున్నారు. బ్లెండర్స్ప్రైడ్, టీచర్స్, బ్లాక్ లేబుల్, జానీ వాకర్, బ్లాక్ డాగ్ లాంటి ఖరీదైన లిక్కర్ బాటిళ్లను వైన్స్, బార్ల నుంచి సేకరిస్తున్నారు. ముందుగా బాటిళ్ల పైన ఉండే మూత తొలగించి సూది, గుండు పిన్నుల సాయంతో సీసా లోపలికి లిక్కర్ పోయేలా సీల్‌ను గట్టిగా ప్రెస్ చేస్తున్నారు. ఆ తర్వాత ఆర్డినరీ లిక్కర్‌తో నింపేస్తున్నారు. ఆర్డినరీ లిక్కర్ అని తెలియకుండా కలర్ సెట్ చేసేందుకు సరిపడా వాటర్మిక్స్ చేస్తున్నారు. కల్తీ చేయడానికి ఫుల్బాటిల్స్నే ఎక్కువగా వాడుతున్నారు. ఈ విధంగా తయారు చేసిన కల్తీ లిక్కర్‌ను ముందుగా ఖాళీ బాటిళ్లు సప్లై చేసిన లిక్కర్వ్యాపారుల ద్వారా వైన్స్‌లకు, బెల్టు షాపులకు సప్లై చేస్తున్నారు. రూ.1,200 విలువైన లిక్కర్ బాటిల్‌ను ఈ ముఠా కేవలం రూ. 700కు, 2వేలు ఖరీదు చేసే బాటిల్‌ను కేవలం రూ.1200 కే అందిస్తుండడంతో లిక్కర్ వ్యాపారులు, బెల్టుషాపుల నిర్వాహకులు ఆ మేరకు సొమ్ము చేసుకుంటున్నారు.
వ్యాపారులను వదిలి నౌకర్లపై కేసులు
సూర్యాపేటలో పట్టుబడ్డ కల్తీ లిక్కర్‌కు సంబంధించి ఆఫీసర్లు ఇప్పటివరకు రెండు వైన్స్‌లకు రూ.6లక్షల ఫైన్ వేసి, సీజ్ చేశారు. దీంతో పాటు ఆ షాపుల్లో పనిచేసే నౌకర్లను తొలగించారు. ఈ రెండు వైన్స్షాపుల్లోనూ కల్తీ లిక్కర్అమ్ముతూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికారు. ఐబీ, రాయల్స్టాగ్బాటిళ్ల మూతలు ఓపెన్ చేసి ఉండటంతో కల్తీ జరిగినట్లు నిర్ధారించారు. రూల్ ప్రకారం షాపుల్లో బాటిళ్లు ఓపెన్ చేసి పెట్టడానికి వీల్లేదు. ఈ కోణంలో దర్యాప్తు జరిపి, కల్తీ నిజమేనని తేలడంతో కేసులు పెట్టారు. నల్గొండ జిల్లాలోని నల్గొండ, కట్టంగూరు వైన్స్‌షాపుల్లో కల్తీ లిక్కర్‌కు సంబంధించి అక్కడి నౌకర్లపై కేసులు పెట్టారు తప్ప షాపులు, వాటి నిర్వాహకులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ షాపుల్లో పనిచేస్తున్న నలుగురు నౌకర్లు ఒక ముఠాగా ఏర్పడి నల్గొండ పట్ట ణ శివారు ప్రాంతంలో ఓ పాత ఇంటిని అద్దెకు తీసుకుని కల్తీ దందా చేస్తున్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. వాళ్లు పనిచేస్తున్న షాపుల నుంచే లిక్కర్ బయటకు తెచ్చి కల్తీ చేసి, తిరిగి అవే వైన్స్‌లకు, వాటి పరిధిలోని బెల్టుషాపులకు చేరవేస్తున్నారని ఆఫీసర్లు అంటున్నారు. షాపుల్లో కల్తీ లిక్కర్ దొరకనందున వాటి పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదని కేవలం నౌకర్ల పై నే కేసులు పెట్టామని చెబుతున్న ఆఫీసర్ల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యాపారుల హస్తం లేకుండా నౌకర్లు లిక్కర్‌ను బయటకు తేవడం, తిరిగి లోనికి తీసుకెళ్లడం సాధ్యం కాదని, సూత్రధారులను కావాలనే తప్పిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
ఖమ్మంలోనూ కల్తీ ముఠాలు
ఖమ్మం పట్టణానికి చెందిన ఓ వ్యక్తి కల్తీ లిక్కర్ తయారు చేసి కోదాడ పరిసర ప్రాంతాల్లోని బెల్టుషాపులకు విక్రయిస్తున్నట్లు ఇటీవల వెలుగుచూసింది. కొద్ది రోజులుగా తమ పరిధిలోని బెల్టుషాపుల్లో సేల్స్ తగ్గిపోవడంతో లిక్కర్ వ్యాపారులు ఎక్సైజ్ ఆఫీసర్లను ఆశ్రయించారు. దీంతో బెల్టుషాపుల పైన నిఘా పెట్టిన ఎక్సైజ్ సిబ్బంది కోదాడలో కల్తీ మద్యం అమ్మే బెల్టుషాపు నుంచి ఖమ్మంకు చెందిన వ్యక్తికి కాల్ చేసి లిక్కర్ కోసం ఆర్డర్ పెట్టారు. దీంతో తన వద్ద బ్లెండర్స్ప్రైడ్ స్టాక్ లేదని, టీచర్స్ మాత్రమే ఉన్నాయని చెప్పాడు. దీని ఆధారంగా టాస్క్‌ఫోర్స్ టీమ్స్ ఆ వ్యక్తి కోసం చాలాచోట్ల గాలించాయి. చివరకు ఖమ్మంలో అతని అడ్డా తెలుసుకుని రెండు రోజుల క్రితం పట్టుకున్నాయి. ఛీప్ లిక్కర్లో నీళ్లు కలిపి ఖరీదైన బాటిళ్లలో మద్యం ఎలా నింపుతున్నాడో టాస్క్‌ఫోర్స్ ఆఫీసర్లు స్వయంగా వీడియో రికార్డింగ్ చేశారు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకొని కోదాడలోని బెల్టుషాపులన్నింటిలో తనిఖీలు ముమ్మరం చేశారు.
