
- హైడ్రోపొనిక్స్ విధానంలో ఆకుకూరల పంట
- దేశంలో తొలిసారిగా పండించేందుకు ఏర్పాట్లు
- స్టూడెంట్స్‌లో హిమోగ్లోబిన్,ఐరన్ పెంచేందుకు చర్యలు
- ముందుగా 10 కేజీబీవీల్లో పైలట్ ప్రాజెక్ట్
- రెండేండ్లలో అన్ని బడులకూ విస్తరణ
హైదరాబాద్, వెలుగు: గవర్నమెంట్ స్కూళ్లలో స్టూడెంట్లకు నాణ్యమైన భోజనం అందించేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు మొదలు పెట్టింది. ఇందులోభాగంగా ఎలాంటి కెమికల్స్ వాడని ఆకుకూరలు, కూరగాయలతో ఫుడ్‌ను అందించాలని నిర్ణయించింది. అలాగే తక్కువ ప్లేస్‌లో ఎక్కువ ఆకుకూరలను పండించేందుకు చర్యలు ప్రారంభించింది. పైలట్ ప్రాజెక్టుగా తొలిదశలో పది స్కూళ్లలో అమలు చేయనుంది. రానున్న రోజుల్లో అన్ని బడులకూ విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
హైడ్రోపొనిక్స్ విధానంలో..
రాష్ర్టంలో మొత్తం 28,621 బడుల్లో చదువుకుంటున్న సుమారు 23 లక్షల మంది పిల్లలకు ప్రభుత్వం మధ్యాహ్న భోజనాన్ని అందిస్తోంది. విద్యాశాఖ పరిధిలోని కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, గురుకులాల్లోని స్టూడెంట్లకూ వసతితోపాటు భోజనం అందిస్తోంది. అయితే ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆరోగ్య పరీక్షల్లో స్టూడెంట్లలో ఐరన్, హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉంటుందని తేలుతోంది. దాని ప్రభావంతో పిల్లలు రక్తహీనతతోపాటు పలు వ్యాధుల బారిన పడుతున్నారు. దీంతో ప్రభుత్వం ఇప్పటికీ పిల్లలకు ఉచితంగా ఐరన్ టాబ్లెట్స్ అందిస్తోంది. దీనికి చెక్ పెట్టి, పాఠశాల విద్యాశాఖ కొత్త విధానాన్ని అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. హైడ్రోపొనిక్స్ విధానంలో ఆకుకూరలు పండించేందుకు అర్బన్ కిసాన్ హైడ్రోటెక్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.
ముందుగా 10 స్కూళ్లలో
రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోని పది కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో(కేజీబీవీ) 2019–20 విద్యాసంవత్సరంలో హైడ్రోపొనిక్ సిస్టమ్‌ను విద్యాశాఖ ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం ఈ విధానం యూరప్, అమెరికాతోపాటు పలు దేశాల్లో కొనసాగుతోంది. దేశంలో మొదటిసారిగా ప్రవేశపెడుతున్నారు. రంగారెడ్డి జిల్లాలోని ఆమన్‌గల్, తలకొండపల్లి, కేశంపేట, చేవెళ్ల, ఫారుక్‌నగర్ కేజీబీవీలు, సంగారెడ్డి జిల్లాలోని జిన్నారం, అందోల్, కాశీపూర్, ఉస్మాన్‌నగర్, హత్నూరా కేజీబీవీల్లో ఈ విధానం ప్రారంభిస్తున్నారు. ఇందుకు ఒక్కో స్కూల్‌కు రూ.లక్ష కేటాయించారు. రక్తహీనతతో బాధపడే వారిలో అమ్మాయిలు ఎక్కువగా ఉండటంతో బాలికల విద్యాలయాలను ముందుగా ఎంపిక చేసుకున్నారు. వారంలో 3, 4 రోజులు ఆకుకూరలు ఇవ్వాలని అధికారులు ఇప్పటికే మెనూలో పెట్టారు. అయితే ఆకుకూరలు మార్కెట్లో దొరక్క, వాటిని తక్కువగా కూరల్లో వాడుతున్నారు. హైడ్రోపొనిక్ సిస్టమ్ అమలైన తర్వాత ప్రతి రెండు నెలలకోసారి స్టూడెంట్లను పరీక్షించి, ఐరన్, హిమోగ్లోబిన్ పర్సంటేజీని పరిశీలించాలని భావిస్తున్నారు. మంచిఫలితం కన్పిస్తే, రానున్న రెండేండ్లలో అన్ని బడులకు విస్తరించాలని నిర్ణయించారు.
ఇలా పండిస్తారు
ప్రతి స్కూల్‌లో రెండు స్టాండ్స్ పెట్టి, ఒక్కోదాంట్లో 200 మొక్కలు పెరిగేలా ఏర్పాట్లు చేస్తారు. దాంట్లో మట్టి లేకుండా కొబ్బరిపీచు నింపి, విత్తనాలు వేస్తారు. ఇలా చేయడం వల్ల మామూలు పంటలతో పోలిస్తే 95 శాతం నీటిని ఆదా చేయవచ్చని అధికారులు చెప్తున్నారు. అన్ని రకాల ఆకుకూరలను ఇక్కడ పండిస్తారు. వాటి ఆకులు కట్ చేసిన తర్వాత, మళ్లీ వారానికి ఆకులు పెరుగుతాయి. ఇలా నాలుగుసార్లు ఆకుకూరను కట్ చేసుకోవచ్చు. ఈ మొక్కలను ఎండ వేడి నుంచి తప్పించేందుకు స్టాండ్స్‌కు కప్పులను ఏర్పాటు చేశారు. వీటి పెంపకంపై ఆయా కేజీబీవీల్లోని సిబ్బందితోపాటు కొందరు టీచర్లు, స్టూడెంట్స్‌కు అవగాహన కల్పించారు. భవిష్యత్‌లో వారే వీటిని నిర్వహించుకునేలా శిక్షణ ఇస్తున్నారు.
ఆరోగ్యవంతులను చేసేందుకు
చాలామంది విద్యార్థులు ఐరన్ ,హిమోగ్లోబిన్ లోపంతో బాధపడుతున్నారు.తాజా ఆకుకూరలను తినడం ద్వారా ఈ లోపం తగ్గి , స్టూడెంట్స్ ఆరోగ్యవంతులుగా మారే అవకాశముంది. ఈ విధానంలో ఎలాంటి కెమికల్స్ వాడరు. తక్కువ నీరు, తక్కువ స్థలంలో మంచి ఫలితాలు వచ్చేఅవకాశముంది.- విజయ్ కుమార్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్
మట్టి లేకుండానే మొక్కల పెంపు
హైడ్రోపోనిక్స్ విధానంలో కెమికల్స్ వాడకుండా ఆకుకూరలు పండిస్తాం. తక్కువ స్థలంలో మట్టి లేకుండానే ఆకుకూరలు పండించడం దీని స్పెషల్. కేంద్రం కూడా కిచెన్ గార్డెన్ల పెంపును ప్రోత్సహించడంతో వీటికి డిమాండ్ పెరుగుతోంది. – చాగంటి శ్రీనివాస్, అర్బ న్ కిసాన్ హైడ్రోటెక్ సంస్థ ప్రతినిధి