ఓఆర్ఆర్ పై ఒక్క యాక్సిడెంటూ జరగొద్దు.. చలాన్లే కాదు.. కౌన్సెలింగ్ కూడా  ఇవ్వండి

ఓఆర్ఆర్ పై ఒక్క యాక్సిడెంటూ జరగొద్దు.. చలాన్లే కాదు.. కౌన్సెలింగ్ కూడా  ఇవ్వండి
  • నిద్రమత్తులోనే 33 శాతం ప్రమాదాలు
  • టైర్లు పేలి 14 శాతం యాక్సిడెంట్లు
  • అవగాహన కల్పించడం, ముందస్తు జాగ్రత్తలతోనే నివారణ 
  • ఉన్నత స్థాయి సమావేశంలో హైదరాబాద్​ సీపీ సజ్జనార్​

హైదరాబాద్​సిటీ, వెలుగు:  ఓఆర్ఆర్​పై ఒక్క యాక్సిడెంట్​కూడా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలన్న దానిపై హైదరాబాద్​సీపీ సజ్జనార్.. వివిధ శాఖల ఉన్నతాధికారులతో మంగళవారం టీజీఐసీసీసీలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఔటర్​పై ఏ కారణాలతో ప్రమాదాలు జరుగుతున్నాయో వివరించారు.  

‘మాకున్న నాలుగు నెలల లెక్కల ప్రకారం అర్ధరాత్రిళ్లు నిద్రమత్తు వల్ల జరిగిన ప్రమాదాలే 33 శాతం ఉన్నాయి. ఆ తర్వాత నిర్లక్ష్యపు డ్రైవింగ్ తో జరిగిన యాక్సిడెంట్లు 25 శాతం, ఓవర్​స్పీడ్​తో చేసినవి 15 శాతం, టైర్లు పేలడం వల్ల 14 శాతం ప్రమాదాలు జరిగాయి’ అని వివరించారు. వాహనదారులకు సంపూర్ణ అవగాహన కల్పించడం ద్వారా ఈ ప్రమాదాలను నివారించవచ్చన్నారు.  

ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే, ముందస్తు జాగ్రత్తలతోనే ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చన్నారు. నిత్యం సగటున 2.80 లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తున్న ఓఆర్ఆర్​ పై రోడ్డు భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రస్తుతం సగటున రోజూ ఐదారు ప్రమాదాలు జరుగుతున్నాయని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ వీటిని సున్నాకు తెచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.

చలాన్లే కాదు.. కౌన్సెలింగ్​ ఇవ్వండి 

రూల్స్​బ్రేక్​చేస్తూ వాహనాలు నడిపేవారికి కేవలం చలాన్లు విధించడమే కాకుండా ప్రత్యేక కౌన్సెలింగ్ ఇవ్వాలని, అలాగే ఓఆర్ఆర్ పైకి ప్రవేశించగానే.. వాహనదారుల మొబైల్స్​కు భద్రతా మెసేజ్​లు పంపేలా చర్యలు తీసుకోవాలని సజ్జనార్​ సూచించారు. అత్యవసర సమయాల్లో రెస్పాన్స్ టైమ్ ఇప్పటివరకు 30 నిమిషాలు ఉందని, దాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే ట్రాఫిక్ మార్షల్స్ సేవలు వినియోగించుకోవాలన్నారు. బ్రేక్​డౌన్ మినహా ఇతరత్రా కారణాలతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఓఆర్ఆర్ పై వాహనాలను ఆపకూడదని, అనివార్య పరిస్థితుల్లో ఆపాల్సి వస్తే తక్షణమే హెల్ప్​లైన్​కు సమాచారం ఇచ్చి, తగిన భద్రతా ఏర్పాట్లు చేసుకుని ఎడమ వైపు చివరి లేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాత్రమే ఆపాలన్నారు. 

వాహనాల ఫిట్​నెస్​కు ఆదేశించాం

ప్రమాదాల కట్టడికి ఆర్టీఏ నుంచి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి వెల్లడించారు. ముఖ్యంగా వాహనాల ఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, టైర్ల నాణ్యత తనిఖీలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఓఆర్ఆర్ పైనా రోడ్ సేప్టీపై ప్రతినెలా తప్పనిసరిగా సమీక్షా సమావేశం నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. 

తొలుత ఓఆర్ఆర్ నిర్వహణ సంస్థ ఐఆర్బీ ప్రతినిధుల పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. రోడ్ సేప్టీపై తీసుకుంటున్నచర్యలు గురించి వివరించారు.  హెచ్ఎండీఏ అర్బన్​ఫారెస్ట్రీ డైరెక్టర్​వీఎస్​ఎన్​వి ప్రసాద్, జీహెచ్ఎంసీ, హెచ్​జీసీఎల్ ప్రతినిధులు, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్​సిటీ కమిషనరేట్ల ట్రాఫిక్​ డీసీపీలు, ఐఆర్ బి ఇన్​ఫ్రా ప్రతినిధులు పాల్గొన్నారు.