- ఏడాది కిందట ఓఆర్ఆర్ పరిధిలోని మున్సిపాలిటీల్లో 51 జీపీల విలీనం
- ఇప్పుడు గ్రేటర్లోకి..తరువాత విభజనేనా?
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ విస్తరణకు సంబంధించి తొలి అడుగు పడింది. ఔటర్ రింగ్ రోడ్ పరిధితో పాటు దానిని ఆనుకుని ఉన్న 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు జీహెచ్ఎంసీ కౌన్సిల్ ఆమోదం తెలిపింది.
జీహెచ్ఎంసీ చట్టం–1955 ప్రకారం ఈ ప్రతిపాదనపై పరిశీలన చేసి, అవసరమైన అధ్యయనం నిర్వహించి, అభిప్రాయాలను తెలియజేయాలని ప్రభుత్వం కోరింది. ఈ మేరకు సర్కార్ మెమో నంబర్5924/ఎంఏ(1)/2024, 21–11–2025 ప్రకారం ప్రియాంబుల్ను జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం ముందు టేబుల్ ఐటమ్ 2 గా మేయర్ ప్రవేశపెట్టారు. దీనిపై స్టడీ చేసి సమగ్రమైన రిపోర్టుని కౌన్సిల్ ప్రభుత్వానికి అందివ్వనుంది.
గతేడాది మున్సిపాలిటీల్లోకి..
గతేడాది డిసెంబర్ 6న ఓఆర్ఆర్ పరిధిలోని 51 గ్రామ పంచాయతీలను ఆయా మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఇందులో రంగారెడ్డి జిల్లా పరిధిలో 12 గ్రామాలను నాలుగు మున్సిపాలిటీల్లో కలపగా, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పరిధిలోని 28 గ్రామాలను ఏడు మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. సంగారెడ్డి జిల్లా పరిధిలో 11 గ్రామాలను అక్కడి రెండు మున్సిపాలిటీల్లో కలిపారు.
ఇప్పుడు ఈ మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీంలో విలీనం చేసేందుకు అడుగు పడింది. నగర విస్తరణ ఉద్దేశం అభివృద్ధి కోసమేనని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండగా, విలీనం జరిగితే 2,040 చదరపు కిలోమీటర్ల మేర పెరగనుంది.
విలీనం తర్వాత విభజన?
ప్రస్తుతం జీహెచ్ఎంసీలో150 డివిజన్లుండగా కొత్తగా 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు విలీనంతో.. జీహెచ్ఎంసీలో డివిజన్ల సంఖ్య మరింత పెరుగుతుంది. విస్తీర్ణం కూడా పెరుగుతుండడంతో అడ్మినిస్ట్రేషన్లో భాగంగా జీహెచ్ఎంసీని మూడు, లేదా నాలుగు కార్పొరేషన్లుగా విభజించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత కౌన్సిల్ గడువు వచ్చే ఏడాది ఫిబ్రవరి 10తో ముగియనున్న నేపథ్యంలో ఆ తర్వాతే ఈ ప్రక్రియ మొదలవుతుందని సమాచారం.
గ్రేటర్లో మూడు పోలీసు కమిషనరేట్ల తరహాలోనే మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిగాయి. అయితే, నాలుగు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే నాలుగు వైపులా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలిసింది. మూడా, నాలుగా అన్నది నిర్ణయం తీసుకున్న తర్వాతే కార్పొరేషన్ల వారీగా వార్డుల విభజన చేసి ప్రభుత్వం ఎన్నికలకు వెళ్తుందని ప్రచారం జరుగుతోంది.
చర్చ లేకుండా విలీనం చేస్తరా? : ఎమ్మెల్యే జుల్ఫీకర్ అలీ
జీహెచ్ఎంసీ విలీనంపై చార్మినార్ ఎమ్మెల్యే జుల్ఫికర్ అలీ నిరసన వ్యక్తం చేయగా మేయర్సముదాయించేందుకు ప్రయత్నించారు. ఆయన వినకపోగా, పోడియం వద్ద టేబుల్ పై కొట్టడంతో సమావేశాన్ని నిరవధిక వాయిదా వేస్తున్నట్లు మేయర్ ప్రకటించారు. సమావేశంలో 46 అజెండాలపై సభ్యులు చర్చించి అమోదం తెలిపారని, రెండు టేబుల్ ఐటమ్స్కు ఆమోదం తెలిపినట్లు మేయర్ ప్రకటించారు.
విలీనం కానున్న మున్సిపాలిటీలివే..
మేడ్చల్ జిల్లాలోనివి: మేడ్చల్, బోడుప్పల్, పీర్జాదిగూడ ,జవహర్నగర్, నిజాంపేట్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్కేసర్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, దుండిగల్, కొంపల్లి.
రంగారెడ్డి జిల్లాలోనివి: బడంగ్‌పేట్, మీర్‌పేట్, బండ్లగూడ జాగీర్, పెద్ద అంబర్‌పేట్, తుర్కయాంజల్, ఆదిబట్ల, జల్పల్లి, శంషాబాద్, మణికొండ, తుక్కుగూడ, నార్సింగి.
సంగారెడ్డి జిల్లాలోనివి: బొల్లారం, తెల్లాపూర్, అమీన్పూర్
