ఓఆర్ఎస్ లేబులింగ్ లోపాలపై పోరాటం చేస్తున్న హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ చిన్న పిల్లల డాక్టర్ శివరంజని సంతోష్‌కు ఫార్మా కంపెనీలు జారీ చేసిన లీగల్ నోటీసును ఇవ్వడాన్ని పలు వైద్య సంస్థలు, ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ (FAIMA) తీవ్రంగా ఖండించాయి. ఇది పిల్లల ఆరోగ్యానికి మంచిదికాదు అని సాక్ష్యాధారిత వైద్య అభిప్రాయాన్ని అణచివేసే ప్రయత్నమని తక్షణమే నోటీసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి.
డాక్టర్ శివరంజని లేవనెత్తిన అంశాలు పూర్తిగా రోగుల భద్రత, శిశువుల ఆరోగ్యానికి సంబంధించినవని ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ ( FAIMA ) పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం ఉండాల్సిన ఓఆర్ఎస్‌కు బదులుగా.. కేవలం గ్లూకోజ్ కలిపిన ఉత్పత్తులను విక్రయించడం వల్ల అనర్థాలు జరుగుతాయని హెచ్చరించటం ఒక వైద్యురాలిగా ఆమె బాధ్యత అని ఫైమా స్పష్టం చేసింది. ఇలాంటి నోటీసుల ద్వారా వైద్యులను భయపెట్టాలని చూడటం ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడింది.
చాలా డ్రింక్స్ ఓఆర్ఎస్ తరహాలోనే ప్యాక్ చేసి మార్కెట్‌లోకి వస్తున్నాయి. దీంతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. ఈ క్రమంలో ఓఆర్‌ఎస్ పేరున జరుగుతున్న విచ్చలవిడి దందాపై డాక్టర్ శివరంజిని సంతోష్ ఎనిమిదేండ్లుగా పోరాటం చేస్తున్నారు. ఓఆర్‌ఎస్ పేరిట జరుగుతున్న అమ్మకాలపై తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు వేశారు. ప్రధాని మోదీ, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి నడ్డాకు లేఖ రాశారు. దీంతో ఇక నుంచి ఆయా బ్రాండ్లు ఓఆర్‌ఎస్ అనే పదాన్ని తమ ఉత్పత్తులపై ఫ్రింట్ చేయకూడదని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఇండియా(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ఆదేశించింది.
