ఇమ్రాన్ ది మధ్యయుగపు రాక్షసత్వం

ఇమ్రాన్ ది మధ్యయుగపు రాక్షసత్వం

న్యూయార్క్: ఐక్య రాజ్యసమితి వేదికగా భారత్ పై విషం చిమ్మే ప్రయత్నంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తమ కుయుక్తులను బట్టబయలు చేశారు. ప్రపంచ దేశాల ఎదుట తన యుద్ధ కాంక్షను, భారత్ లో రక్త పాతం సృష్టించాలన్న తపనను బయటపెట్టారు. ఈ విషయాన్ని ప్రపంచ దేశాలకు మరోసారి గుర్తు చేస్తూ పాక్ ప్రధాని ప్రసంగానికి రిప్లై ఇచ్చే అవకాశాన్ని భారత్ ఈ రోజు చక్కగా వాడుకుంది. యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశంలో ఇమ్రాన్ విద్వేషపూరిత వ్యాఖ్యల్ని ఖండించింది.

భారత్ తరఫున యూఎన్ పర్మినెంట్ మిషన్ లో ఫస్ట్ సెక్రెటరీ విదిషా మైత్ర ప్రపంచ దేశాల ఎదుట 130 కోట్ల భారతీయుల గళాన్ని వినిపించారు. ‘రక్త పాతం, తుపాకీ పట్టండి, అణు యుద్ధం, సర్వనాశనం’ వంటి మాటలతో పాక్ ప్రధాని తన యుద్ధోన్మాదాని బయటపెట్టుకున్నారు తప్ప స్టేట్స్ మ్యాన్ లా మాట్లాడలేదని అన్నారు. పూర్తి విద్వేషపు ప్రసంగంతో యూఎన్ లాంటి వేదికను దుర్వినియోగం చేసుకున్నారని, ఇది ఐక్య రాజ్య సమితి సర్వసభ్య సమావేశాన్ని అవమానించడమేనని చెప్పారు. ఆయన మైండ్ సెట్ మధ్యయుగపు రాక్షసత్వాన్ని ప్రతిబింబిస్తోందన్నారు మైత్ర. ఇమ్రాన్ విద్వేష ప్రసంగం 21వ శతాబ్దపు ప్రజాస్వామ్య భావనలను నాశనం చేసేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్ లో ఒక్క ఉగ్రసంస్థ కూడా లేదని, కావాలంటే యూఎన్ పరిశీలకులు వచ్చి చూసుకోవచ్చన్న మాటలపై ఇమ్రాన్ నిలబడాలని మైత్ర డిమాండ్ చేశారు. ఉగ్రవాదానికి పాక్ దన్నుగా నిలవడం లేదన్న ఇమ్రాన్ మాటలను ఐదు ప్రశ్నలతో గట్టిగా నిలదీశారామె.

  1. న్యూయార్క్ నగరంలో దాడికి తెగబడిన ఒసామా బిన్ లాడెన్ కు పాక్ బహిరంగంగా రక్షణ కల్పించిందన్న విషయాన్ని ఇమ్రాన్ అవాస్తవమని చెప్పగలరా?
  2. యూన్ గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించిన ఉగ్రవాదులకు పెన్షన్లు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం పాక్ అన్న విషయం నిజం కాదా?
  3. ఉగ్రవాదులకు కోట్ల రూపాయల నిధులు అందించకపోతే న్యూయార్క్ లోని పాక్ ప్రీమియర్ బ్యాంక్ హబీబ్ బ్యాంకు ఎందుకు మూత పడిందో ఇమ్రాన్ చెప్పగలరా?
  4. 27 నిబంధనల్లో 20కి పైగా ఉల్లంఘించినందుకు పాకిస్థాన్ కు ఆర్థిక సాయం అందకుండా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ సంస్థ ఆంక్షలు విధించిన విషయం నిజం కాదా?
  5. 130 మంది యూఎన్ ఉగ్రవాదులుగా ముద్ర వేసిన వాళ్లు, 25 ఉగ్ర సంస్థలకు పాక్ పుట్టినిల్లు కాదని చెప్పగలరా?