ఆస్కార్ 2020: అక్కడ బెస్ట్ హీరో జోక్విన్.. ఇక్కడ మోడీ!: వీడియో

ఆస్కార్ 2020: అక్కడ బెస్ట్ హీరో జోక్విన్.. ఇక్కడ మోడీ!: వీడియో

ప్రపంచ సినిమా స్టేజ్ ఆస్కార్ అవార్డుల సంబురంలో మునిగిపోయిన వేళ.. ఇండియన్ పొలిటికల్ స్టేజ్ వేదికగా ‘అకాడమీ’ అవార్డులకు జెరాక్స్ కాపీలా కాంగ్రెస్ సెలబ్రేషన్స్ చేసింది. ఆ పార్టీ ట్విట్టర్ అకౌంట్‌లో బెస్ట్ యాక్టర్ ఇన్ యాక్షన్ రోల్, బెస్ట్ కామెడి రోల్, విలన్ ఇలా పలు విభాగాల్లో నామినేషన్లు, విన్నర్లను ప్రకటించింది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్, విజువల్ ఎఫెక్ట్స్‌తో వీడియోలు చేసి వాటిని పార్టీ అఫిషియల్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. అకాడమీ బెస్ట్ యాక్టర్‌గా జోకర్ సినిమా లీడ్ జోక్విన్ ఫీనిక్స్‌ని ప్రకటించింది. భారత రాజకీయ తెరపై బెస్ట్ హీరో మోడీ అంటూ కాంగ్రెస్ ప్రకటించింది.

యాక్షన్ హీరో మోడీ

బెస్ట్ యాక్టర్ ఇన్ యాక్షన్ రోల్ ఆస్కార్ 2020 అవార్డును ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. ఈ అవార్డుకు ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ప్రధాని మోడీలను ఆ పార్టీ నామినేట్ చేసింది. 56 అంగుళాల ఛాతీ, చమట, కన్నీళ్లు.. ఈ అవార్డు గెలిచేందుకు కావాల్సిన క్వాలిటీస్ అనే క్యాప్షన్‌తో వీడియోను ట్వీట్ చేసింది.

బెస్ట్ విలన్.. అమిత్ షా  
బెస్ట్ యాక్టర్ ఇన్ నెగటివ్ రోల్‌ విన్నర్‌గా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ప్రకటించింది కాంగ్రెస్. ఒకప్పుడు గబ్బర్ సింగ్, మొగామ్బో లాంటి వాళ్లు బెస్ట్ విలన్స్. అది గతం.. ఇప్పుడు నవ భారతంలో కొత్త విలన్లు వచ్చారంటూ నామినేషన్లు, విన్నర్లతో వీడియో ట్విట్టర్లో పెట్టింది. అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్, అనురాగ్ ఠాకూర్‌లలో అమిత్ షా బెస్ట్ విలన్ అని ప్రకటించింది.

బెస్ట్ కమెడియన్

ఆస్కార్ 2020 బెస్ట్ కమెడియన్ అవార్డుకు బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ విన్నర్‌గా ప్రకటించింది కాంగ్రెస్. ఈ కేటగిరీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌లను కూడా నామినేట్ చేసింది. కష్టకాలంలో దాని నుంచి బయటపడేందుకు కొంత కామెడీని కోరుకుంటామంటూ మనోజ్ తివారీ యోగాసనాలు వేస్తున్న వీడియోతో విన్నర్‌గా ప్రకటించింది కాంగ్రెస్. అయితే ఈ పోస్టు కింద విపరీతంగా ట్రోల్స్ నడుస్తున్నాయి. బెస్ట్ కమెడియన్ అవార్డు రాహుల్ గాంధీకే అంటూ సెటైర్లతో కామెంట్లు, మెమ్స్ పోస్ట్ చేస్తున్నారు నెటిజన్లు.

కేజ్రీవాల్‌కీ కాంగ్రెస్ ఆస్కార్ అవార్డు

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కి కూడా కాంగ్రెస్ పార్టీ ఆస్కార్ 2020 అవార్డును ప్రకటించింది.  ఏకపాత్రాభినయం, ఫొటో షూట్స్, కన్నీళ్లు, చిన్న డ్రామా లేనిదే రాజకీయాలు పండవు అంటూ బెస్ట్ డ్రమాటిక్ రోల్‌కి కేజ్రీవాల్‌ని విన్నర్‌గా ప్రకటించింది కాంగ్రెస్. డ్రామా కింగ్ కేటగిరీలో స్మృతీ ఇరానీ మోడీ, కేజ్రీవాల్‌ను నామినేషన్లలో చూపించింది. తాను ఎప్పటికీ ఎన్నికల్లో పోటీ చేయబోనని, ఏ పదవీ చేపట్టబోనని గతంలో కేజ్రీవాల్ చెబుతున్న వీడియోను ఇందులో చేర్చింది కాంగ్రెస్.