ఉస్మానియా ఆస్పత్రి తిరిగి కట్టాల్సిందే     

ఉస్మానియా ఆస్పత్రి తిరిగి కట్టాల్సిందే     
  •  నిపుణుల నివేదిక వచ్చిందనిహైకోర్టుకు చెప్పిన ఏజీ
  • విచారణ వచ్చే నెల 12 కు వాయిదా

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌‌‌లోని చారిత్రక ఉస్మానియా హాస్పటల్‌‌‌‌ భవనం శిథిలావస్థకు చేరిందని, దానిని తొలగించి తిరిగి కొత్త బిల్డింగ్స్‌‌‌‌ కట్టాలని నిపుణుల కమిటీ రిపోర్టు ఇచ్చినట్లు ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్‌‌‌‌రెడ్డి హైకోర్టుకు తెలిపారు. ఇద్దరు నిపుణుల కమిటీ రిపోర్టులోని అంశాలను చీఫ్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ అనిల్‌‌‌‌ అరాధే ఆధ్వర్యంలోని డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌కు మంగళవారం వివరించారు. ఉస్మానియా ఆస్పత్రి భవనాన్ని కూల్చొద్దని కొందరు, ప్రమాదకరంగా ఉన్నందున కూల్చి తిరిగి నిర్మాణం చేయాలని మరికొందరు వేసిన వేర్వేరు పిల్స్‌‌‌‌పై విచారణను ఫిబ్రవరి 12కు వాయిదా వేసింది.

వెయ్యి బెడ్స్‌‌‌‌ ఉన్న ఆస్పత్రిని 1800 బెడ్స్‌‌‌‌కు పెంచాల్సి ఉందని, బిల్డింగ్‌‌‌‌ ప్రమాదకరంగా ఉన్నందున కొత్త బిల్డింగ్‌‌‌‌ కట్టేందుకు ప్రభుత్వం నిధులను కూడా మంజూరు చేసిందని ఏజీ చెప్పారు. దీనిపై పిటిషనర్‌‌‌‌ లాయర్‌‌‌‌ స్పందిస్తూ.. కమిటీలో మెంబర్స్‌‌‌‌ అందరూ ప్రభుత్వ అధికారులేనని, స్వచ్ఛందంగా స్పందించేలా సభ్యులు ఉండేలా చేయాలని కోరారు. దీంతో తుది విచారణను ఫిబ్రవరి 12న జరుపుతామని బెంచ్‌‌‌‌ ప్రకటించింది.