ఉస్మానియా ఆస్పత్రిపై తమిళిసై వర్సెస్ హరీశ్

ఉస్మానియా ఆస్పత్రిపై తమిళిసై వర్సెస్ హరీశ్
  • కొత్త బిల్డింగ్ కట్టాలని డాక్టర్ల ట్వీట్ 
    ​​​​​దాన్ని రీట్వీట్ చేస్తూ ఆస్పత్రి  దుస్థితిపై గవర్నర్ ఆవేదన 
  • ఆమె కోడిగుడ్డుపై ఈకలు పీకినట్టు వ్యవహరిస్తున్నారని మంత్రి కామెంట్  
  • కోర్టు నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని వెల్లడి 
  • కోర్టులో అఫిడవిట్ వేయకుండా సర్కారే జాప్యం చేస్తున్నదని డాక్టర్లు 

హైదరాబాద్, వెలుగు:  ఉస్మానియా హాస్పిటల్ దుస్థితిని తెలియజేస్తూ డాక్టర్లు పెట్టిన ఓ ట్వీట్ గవర్నర్‌‌‌‌ తమిళిసై, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌‌రావు మధ్య విమర్శలకు దారి తీసింది. ఉస్మానియా కొత్త బిల్డింగ్‌‌ నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఉస్మానియా జాయింట్ అసోసియేషన్ మంగళవారం ట్వీట్ చేసింది. హాస్పిటల్‌‌లో బెడ్లు చాలక పేషెంట్లను కింద పడుకోబెట్టిన ఫొటోను, అపరిశుభ్ర వాతావరణానికి సంబంధించిన మరో ఫొటోను ట్వీట్‌‌కు జత చేసింది. 

బెడ్లు సరిపోవడం లేదని, పేషెంట్లతో హాస్పిటల్ కిక్కిరిసిపోతోందని ట్వీట్‌‌‌‌లో పేర్కొంది. ఈ ట్వీట్‌‌‌‌ను గవర్నర్‌‌‌‌, హరీశ్‌‌‌‌రావు, సీఎంవో తదితరులకు ట్యాగ్ చేసింది. ఇదే ట్వీట్‌‌‌‌ను గవర్నర్‌‌‌‌‌‌‌‌ మంగళవారం రాత్రి రీట్వీట్ చేశారు. ‘‘వందేండ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా హాస్పిటల్‌‌‌‌ను కూలిపోయే స్థితిలో చూస్తుండడం బాధాకరం. ఎంతో మందికి విద్య నేర్పే, చికిత్స అందించే ఈ దవాఖానను త్వరగా పునర్నిర్మించాలి” అని తన ట్వీట్‌‌‌‌లో గవర్నర్‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నారు.  

రాజకీయంగా బురదజల్లే  ప్రయత్నం: హరీశ్ 

బుధవారం ఆరోగ్యశాఖకు సంబంధించిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న హరీశ్‌‌‌‌రావు.. గవర్నర్ లక్ష్యంగా విమర్శలకు దిగారు. ఉస్మానియాపై ఆమె చేసిన ట్వీట్, వ్యాఖ్యలు దురదృష్టకరం అన్నారు. ‘‘ఉస్మానియా హాస్పిటల్‌‌‌‌పై అందరికంటే ముందే కేసీఆర్‌‌‌‌‌‌‌‌ 2015లో స్పందించారు. కొత్త బిల్డింగ్ నిర్మాణానికి రూ.200 కోట్లు కేటాయిస్తామని అప్పుడే ప్రకటించారు. అయితే పాత బిల్డింగ్ కూల్చివేతపై కోర్టులో కేసులు పడ్డాయి. దీంతో బిల్డింగ్ నిర్మాణం ముందుకు పడలేదు. కోర్టు ఆదేశాల మేరకు ఐఐటీ హైదరాబాద్ నిపుణులు,  ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌తో ఇండిపెండెంట్ కమిటీ వేశాం. వారు కూడా పాత భవనం హాస్పిటల్ నిర్వహణకు పనికిరాదని స్పష్టం చేశారు. 

ప్రభుత్వం కూడా కోర్టుకు ఇదే విషయం చెప్పింది. కోర్టు నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని భావిస్తున్నాం” అని చెప్పారు. గవర్నర్ ఈ విషయాలన్నీ పక్కనపెట్టి కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు, భూతద్దం పెట్టి వెతికినట్టు రాజకీయంగా బురదజల్లే వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. కంటివెలుగు, మెడికల్ కాలేజీల ఏర్పాటు, కేసీఆర్ న్యూట్రిషనల్ కిట్లు, బస్తీ దవాఖాన్ల ఏర్పాటు సహా అనేక మంచి పనులు చే స్తున్నా గవర్నర్ ఎప్పుడూ తమను ప్రశంసించడం లేదని ఫైర్ అయ్యారు. ‘‘మంచి కనబడదు, మంచి వినబడదు, మంచి మాట్లాడను అన్నట్టుగా వ్యవహరిస్తే ఎలా? చెడు మాత్రమే చూస్తాం. చెడు మాత్రమే వింటాం. చెడు మాత్రమే మాట్లాడతాం.. అన్నట్టు వ్యవహరించడం రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న గవర్నర్ కు తగదు” అని హరీశ్​ అన్నారు.

జాప్యానికి సర్కారే కారణం: డాక్టర్లు 

మంత్రి హరీశ్‌‌‌‌రావు వ్యాఖ్యలను హెల్త్ రిఫార్మ్స్‌‌‌‌ డాక్టర్స్ అసోసియేషన్ తప్పుబట్టింది. ఉస్మానియా పాత బిల్డింగ్‌‌‌‌ను కూల్చే విషయంలో ప్రభుత్వం స్టాండ్ ఏంటో చెప్పాలని హైకోర్టు అడిగిందని అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ మహేశ్‌‌‌‌ తెలిపారు. బిల్డింగ్‌‌‌‌ కూల్చి కొత్త బిల్డింగ్ కడ్తారా? కూల్చ కుండా అలాగే ఉంచి, దానికి పక్కన కొత్త బిల్డింగ్ కడ్తారా? చెప్పాలని కోర్టు ప్రశ్నించి ఆరు నెలలవుతున్నా.. ఇప్పటివరకు ప్రభుతం తరఫు నుంచి హైకోర్టుకు సమాధానం ఇవ్వలేదని ఆయన చెప్పారు. ఈ విషయంలో అఫిడవిట్ దాఖలు చేయకుండా జాప్యం చేస్తున్న ప్రభుత్వం.. కేసు కోర్టులో ఉందని తప్పించుకునేందుకు ప్రయత్నిస్తోందని ఫైర్ అయ్యారు. ఉస్మానియా హాస్పిటల్‌‌‌‌ కొత్త బిల్డింగ్ కోసం 2009లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయించిందని.. కేసీఆర్ సర్కార్ వచ్చాక పాత బిల్డింగ్‌‌‌‌ మరమ్మతుల కోసం తప్పితే, కొత్త బిల్డింగ్ నిర్మాణం కోసం కేటాయింపులేమీ చేయలేదని వెల్లడించారు.