ఉస్మానియా మెడికల్ కాలేజిలో అవినీతికి పాల్పడిన హెచ్ వో డీ

ఉస్మానియా మెడికల్ కాలేజిలో అవినీతికి పాల్పడిన హెచ్ వో డీ
  • ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ వసూళ్లు
  • ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు జేసిన జూనియర్ డాక్టర్లు
  • పదవి నుంచి తొలగింపు..విచారణ కమిటీ నియామకం
  • సదరు ప్రొఫెసర్ అక్రమ సంపాదన పైనా ఏసీబీ విచారణ

హైదరాబాద్‌, వెలుగు: ఉస్మానియా మెడికల్‌ కాలేజీలోని ఓ ప్రధాన విభాగం హెచ్ వో డీపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఎంబీబీఎస్‌,పీజీ, రెసిడెంట్‌ డాక్టర్లు సహా తన పరిధిలోని సిబ్బంది ఎవరినీ వదలకుండా రూ.లక్షల్లో వసూలు చేసినట్టు జూనియర్ డాక్టర్లు ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై ఆధారాలతో కాలేజీ ప్రిన్సిపల్ కు జూడాలు  ఫిర్యాదు చేశారు. ప్రాథమిక ఆధారాలు పరిశీలించిన ప్రిన్సిపల్‌, సదరు హెచ్ వో డీని ఆ పదవి నుంచి తప్పించి, మరో డాక్టర్ కు ఆ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ప్రాక్టికల్స్ లో మంచి ప్రతిభ చూపినా ఆయనకు రూ.వేలలో సమర్పించుకుంటేనే తప్ప పాస్‌ చేయరని జూడాలు పేర్కొంటున్నారు. డిపార్ట్ మెంట్‌ ఫండ్‌ పేరిట 2014 బ్యా చ్ లో ఒక్కో విద్యార్థి వద్ద రూ.లక్ష వసూలు చేసినట్టు ఆరోపిస్తున్నారు.

ఇంటర్న్ షిప్‌ ముగింపులో ‘డిపార్ట్ మెంట్‌ ఫండ్‌’ కడితేనే సర్టిఫికెట్‌ ఇస్తారంటున్నారు. ఫార్మా కంపెనీ ప్రతినిధులతో కుమ్మక్కై, వారి కంపెనీ డ్రగ్స్‌ రాసేలా రెసిడెంట్‌ డాక్టర్లపై ఒత్తిడి సదరు హెచ్ వో డీ తెస్తున్నారని ఉస్మానియా మెడికల్ కాలేజ్ వర్గాలు చెబుతున్నాయి. సెలవులు,మెటర్నిటీ లీవ్ లు పెట్టాలంటే రూ.వేలల్లో సమర్పించుకోవాల్సిందేనని వాపోతున్నారు. ఇలా పలు మార్గాల్లో సంపాదిం చిన అవినీతి సొమ్ముతో హైదరాబాద్‌, చెన్నై నగరాల్లో సదరు హెచ్ వో డీ ఆస్తులు కూడబెట్టినట్టు తెలిసింది. ఆయన ఆస్తుల వ్యవహారంపై అవినీతి నిరోధకశాఖ అధికారులు విచారిస్తున్నట్టు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంపై ఉస్మానియా కాలేజీ ప్రిన్సిపల్‌ ఓ కమిటీ వేశారు. వసూళ్ల కార్యక్రమంలో మధ్యవర్తిగా వ్యవహరించిన ఓ క్లర్క్‌ తప్పు ఒప్పుకున్నట్టు సమాచారం.