
- రోడ్డెక్కి అమ్మాయిల ఆందోళన
- బాత్రూమ్లకు డోర్లు లేవు.. కంపుకొట్టే టాయిలెట్లు
- తాగు నీటి కోసమూ తిప్పలే.. రూమ్స్ లేక అవస్థలు
- వారం రోజులుగా రోడెక్కి నిరసన తెలుపుతున్న స్టూడెంట్లు
- పట్టించుకోని వర్సిటీ అధికారులు
సికింద్రాబాద్, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో స్టూడెంట్లు రోడ్డెక్కారు. అన్నంలో పురుగులొస్తున్నయని.. పెరుగు, కూరలు సరిగా ఉండడంలేదని, బాత్రూమ్లకు డోర్లు, లాక్‌లు లేవని ఓయూ క్యాంపస్ ఆడ బిడ్డలు వారం రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఫుడ్, హాస్టల్ సౌలత్లపై ఏరోజుకారోజు సర్దిచెబుతున్న అధికారులు.. వాటి పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకుంటలేరు. పైగా ప్రశ్నించే అమ్మాయిలను బెదిరించే ప్రయత్నం చేస్తున్నరు. తమ సమస్యలు పరిష్కరించాలని వారం రోజులుగా ఆందోళన చేస్తున్నా.. వారిని పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. సోమవారం కూడా వందలాది మంది అమ్మాయిలు పురుగుల అన్నం, కూరలతో రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపారు.
5 వేల మందికి.. నాలుగు మెస్‌లు
ఓయూ లేడీస్ హాస్టల్లో ప్రస్తుతం సుమారు 5 వేల మంది అమ్మాయిలు చదువుతున్నరు. వారి కోసం నాలుగు మెస్‌లు రన్ చేస్తున్నారు. మెను ప్రకారం రోజూ బ్రేక్‌ఫాస్ట్‌లో కిచిడి, చపాతి, ఊతప్ప, పూరి, దోశ, ఇడ్లీ పెట్టాల్సి ఉన్నా.. ఇడ్లీ, పూరీలతోనే సరిపెడుతున్నారు. వాటి కోసం కూడా గంటల తరబడి క్యూ కట్టాల్సి వస్తోంది. గతంలో వారంలో రెండు సార్లు నాన్‌వెజ్ పెట్టేవారు. ప్రతి బుధవారం150 గ్రాముల మటన్, ప్రతి ఆదివారం 250 గ్రాముల చికెన్ ఇచ్చేవారు. కొంతకాలంగా మటన్ ఆపేసిన అధికారులు.. ప్రస్తుతం చికెన్ మాత్రం ఇస్తున్నారు. అది కూడా100 గ్రాములకు మించడం లేదని అమ్మాయిలు చెబుతున్నారు. ఇదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు.
నీళ్లు లేక తిప్పలు..
ఓయూ క్యాంపస్‌లోని లేడీస్ హాస్టళ్లలో నీళ్ల సౌలత్సక్కగ లేదు. వాష్ రూమ్‌లకు డోర్లు ఊడిపోయినా, వాటికి లాక్‌లు లేకున్నా పట్టించుకునే వారే లేరు. నీటి సరఫరా సరిగా లేకపోవడంతో టాయిలెట్స్ కంపుకొడుతున్నాయి. మెస్‌లు ఉన్నప్పుడు మాత్రమే మంచి నీళ్లు వదులుతుండటంతో తాగునీటికి తిప్పలు తప్పట్లేదు. కిటికీలు సరిగా లేక గదుల్లోకి తరచూ పాములు వస్తున్నాయని అధికారులకు చెబుతున్నా.. ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. క్యాంపస్ నుంచి కోఠి ఉమెన్స్ కాలేజీ, నిజామ్ కాలేజీలకు వెళ్లే అమ్మాయిలకు మధ్యాహ్నం లంచ్ బాక్సు ఇవ్వడం లేదు. దీంతో వారు మధ్యాహ్నం ఆకలితోనే క్లాసులకు అటెండ్ కావాల్సి వస్తోంది.
రూమ్స్ కేటాయించడం లేదు
క్యాంపస్లోఈ ఏడాది అమ్మాయిల సంఖ్య గణనీయంగా పెరిగింది. వారితో మెస్, హాస్టల్‌కు రూ.10 వేలు డిపాజిట్కట్టించుకున్న అధికారులు వారికి ఇప్పటి వరకు రూమ్స్ కేటాయించలేదు. ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరుగుతున్నా.. ఫలితం లేకపోవడంతో కొంత మంది సీనియర్ల గదుల్లో, మరికొంత మంది టీవీ హాల్స్, లైబ్రరీ హాల్లో ఉంటున్నారు.
లేట్ అయితే అన్నం ఉండట్లే..
క్లాసులు, లైబ్రరీకి వెళ్లి కొంచెం లేటుగా వస్తే మెస్‌లో అన్నం ఉండటం లేదని అమ్మాయిలు వాపోతున్నారు. ఉన్న కొద్ది అన్నం కూడా చల్లగా గట్టిపడి రాళ్ల లెక్క ఉంటోందన్నారు. పెరుగు విషయానికొస్తే నీళ్లలెక్క ఉంటోందని.. ఇదేంటని అడిగితే.. ‘మీకు ఇది పెట్టడమే ఎక్కువ. మీరు ఆడవాళ్లేనా’ అని తిడుతున్నారని అమ్మాయిలు కంటతడి పెడుతున్నారు. సమస్యలపై ఆందోళన చేపడితే.. అధికారులు హాస్టళ్లపై పోలీసులను పురమాయిస్తున్నారని, లేడీస్ హాస్టళ్లలోకి మగ పోలీసులు వచ్చి భయబ్రాంతులకు గురిచేస్తున్నారని అమ్మాయిలు ఆరోపిస్తున్నారు.
హెచ్ఆర్సీ చైర్మన్ సందర్శించినా..
ఓయూ క్యాంపస్ హాస్టల్ అమ్మాయిల ఆందోళనపై రాష్ర్ట మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య ఇటీవల స్పందించారు. ఆయన స్వయంగా లేడీస్హాస్టళ్లను సందర్శించి సౌలత్లు పరిశీలించారు. వారం రోజుల్లోగా సమస్యలను పరిష్కరించి, అమ్మాయిలకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని సూచించారు. అయినా అధికారులు ఇంత వరకు స్పందించలేదు.
కేర్ టేకర్లను బదిలీ చేసినం..
అమ్మాయిల హాస్టల్ సమస్యలను వారం రోజుల్లోగా పరిష్కరిస్తం. ఫుడ్ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్న ఇద్దరు కేర్టేకర్లను బదిలీ చేసినం. అన్నంలో పురుగుల లాంటివి రాకుండా నాణ్యత పాటిస్తం. వాటర్ సమస్య కూడా వీలైనంత త్వరగా పరిష్కరిస్తాం.
:: ప్రొ. లక్ష్మీనారాయణ, ఓయూ రిజిస్ట్రార్